Pawan Kalyan on Karnataka: గోపాలగౌడ ఇచ్చిన తీర్పులు చారిత్రాత్మకం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:47 PM
రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో యువ న్యాయవాదులకు గోపాలగౌడ దిశానిర్దేశం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రైతులు, పర్యావరణం అనే అంశాలు తనను గోపాలగౌడకు దగ్గర చేసిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
చింతామణి,అక్టోబర్6 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాలగౌడ (Gopala Gowda) మట్టి వాసనలు తెలిసిన రైతుబిడ్డ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. డబ్బు కోసం కాకుండా సగటు ప్రజలకు న్యాయం చేసేందుకు గోపాలగౌడ వచ్చారని ఉద్ఘాటించారు. తన వృత్తి జీవితాన్ని కార్మికులు, కర్షకుల కోసం అంకితం చేశారని ప్రశంసించారు. ఎన్నో కీలక కేసుల్లో గోపాలగౌడ ఇచ్చిన తీర్పులు చారిత్రాత్మకమని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో పవన్ కల్యాణ్ పర్యటించారు.
గోపాలగౌడ నిదర్శనం..
గోపాల గౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు పవన్. గోపాలగౌడ రాసిన పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. పవన్‌ని చూడటానికి భారీగా తరలివచ్చారు అభిమానులు, ప్రజలు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ప్రసిద్ద కవి కుప్పలి వెంకటప్పను గుర్తు చేసుకున్నారు పవన్ కల్యాణ్. ఈ సందర్భగా ఆయన ప్రసంగించారు. పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పదవి తర్వాత ఎవరి కోసం జీవించాలో గోపాలగౌడ ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. భూ సేకరణ చట్టంతో ఇబ్బందులు పడే వారి పక్షాన గోపాలగౌడ నిలిచారని ప్రశంసించారు. ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు చేసినా ఎదురు నిలిచారని చెప్పుకొచ్చారు. జనసేన చేపట్టిన పోరాటాల్లో గౌపాలగౌడ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
గోపాలగౌడ.. నాకు వెన్నుతట్టి ధైర్యం చెప్పారు..
‘రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో గోపాలగౌడ యువ న్యాయవాదులకు దిశానిర్దేశం చేశారు. రైతులు, పర్యావరణం అనే అంశాలు నన్ను గోపాలగౌడకు దగ్గర చేసింది. మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజకీయాలు చేయాలని నమ్మారు. నేను గతంలో ఓడిపోయిన సమయంలో వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. కులం, సామాజిక కట్టుబాట్లను దాటి దేశ ప్రయోజనాల కోసం ముందుకెళ్లాలని గోపాలగౌడ చెప్పారు. పెన్నా పరివాహక ప్రాంతం విస్తారంగా చెరువులు ఉన్నా... ఇప్పుడు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. కోలార్, చిక్ బల్లాపూర్ ప్రాంతాల్లో ఇప్పుడు నీటిసమస్య ఉంది. ఈ సమస్యని పరిష్కరించడానికి ఏపీ నుంచి సహకారం అందిస్తాం. న్యాయరంగంలో గోపాలగౌడ గొప్ప వ్యక్తి.. ఆయన పుట్టినరోజు వేడుకలకు రావటం సంతోషాన్ని ఇచ్చింది. కర్ణాటకలో చాలా తెలుగు కుటుంబాలు నివశిస్తున్నాయి. సంస్కృతి -సంప్రదాయాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సంబంధం ఉంది. ఏనుగుల గుంపులని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగులని కర్ణాటక ఇచ్చింది. ఏపీలో పంటపొలాలు నాశనం కాకుండా కర్ణాటక ప్రభుత్వం సహకరించింది. శ్రీశైలం దేవస్థానానికి వచ్చే కర్ణాటక భక్తులకు సౌకర్యాల విషయంలో సానుకూలంగా ఉన్నాం’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రైతులు కోసం పవన్ కల్యాణ్ నిరంతరం ఆలోచిస్తారు: జస్టిస్ గోపాలగౌడ
తన జన్మదిన వేడుకలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రావటం చాలా సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి.గోపాలగౌడ వ్యాఖ్యానించారు. రైతులు, యువత, మహిళల అభ్యున్నతి గురించి పవన్ కల్యాణ్ నిరంతరం ఆలోచిస్తారని ప్రశంసించారు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా పవన్ కథానాయకుడేనని కొనియాడారు. కర్ణాటకలోని మూడు జిల్లాల్లో నీటి సమస్య ఉందని తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పవన్ కల్యాణ్ నీటి సమస్యని పరిష్కరించాలని కోరుతున్నానని గోపాలగౌడ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ముంబైలో నారా లోకేష్ పర్యటన.. ఎందుకంటే..
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News