Share News

CM Chandrababu On UAE: దుబాయ్ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పెట్టుబడులపై చర్చ

ABN , Publish Date - Oct 24 , 2025 | 07:42 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.

CM Chandrababu On UAE: దుబాయ్ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. పెట్టుబడులపై చర్చ
CM Chandrababu On UAE

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) యూఏఈ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. యూఏఈ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.


ప్రస్తుతం భారత్- యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి పెట్టే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాలన, పౌరసేవలను మరింత మెరుగ్గా అందించే అంశంపై భేటీలో మాట్లాడారు. సాంకేతికంగా పౌరసేవలు, పాలనా అంశాల్లోని అత్యుత్తమ విధానాలను ఆర్టీజీఎస్ ద్వారా ఇచ్చిపుచ్చుకునే అంశంపై యూఏఈ ఆర్థిక శాఖ మంత్రి వివరించారు. స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలకు నిధులు ఇవ్వటం ద్వారా ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా ప్రోత్సహించే అంశంలో దుబాయ్ సిలికాన్ ఓయాసియా తీసుకున్న చర్యలపైనా సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు.


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేలా అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్- దుబాయ్ సిలికాన్ ఒయాసియా మధ్య కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటు చేసే అంశంపై అంగీకారం తెలిపారు. ఆహార భద్రత అంశంపై ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు, కొత్త అవకాశాలను అన్వేషించే అంశాన్ని ప్రస్తావించారు యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి చర్చించారు.


అలాగే, యూఏఈ పర్యటనలో చివరిరోజు గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. అలాగే, దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో తెలుగు డయాస్పోరా సమావేశం ఇవాళ(శుక్రవారం) జరిగింది. ఏపీ ఎన్నార్టీ సమన్వయంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి. తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున యూఏఈలోని తెలుగు ప్రజలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కువైట్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ దేశాల నుంచి కూడా కార్యక్రమానికి తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.


తెలుగు జాతికి తిరుగే లేదు..

తెలుగు జాతికి తిరుగే లేదని. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా తయారవుతుందని ఉద్ఘాటించారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు ఉన్నతస్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. 30 ఏళ్ల ముందు ఐటీని ప్రోత్సహించానని గుర్తుచేశారు. తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచం అంతా రాణిస్తున్నారని నొక్కిచెప్పారు. సత్యనాదెళ్ల లాంటి తెలుగు వాళ్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా ఉన్నారని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాసాంధ్రులంతా తపించి గెలిపించారని చెప్పుకొచ్చారు. గల్ఫ్ దేశాల నుంచి తెలుగు ప్రజలు తరలివచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావటం ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. అబుదాబీ, దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ దిశగా నడుస్తున్నాయని వివరించారు. 1.50 లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


ప్రతీ ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త..

గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకువస్తే ఇప్పుడు ఏపీలోని విశాఖపట్నానికి గూగుల్ తీసుకువస్తున్నామని ఉద్ఘాటించారు. దేశంలో క్వాంటం వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని నొక్కిచెప్పారు. ప్రతీ ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు. ఐటీ, కమ్యూనికేషన్ల రంగంలో విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నామని వివరించారు. సాంకేతికత ద్వారా పాలన అందించేలా వాట్సాప్ ద్వారా 730కి పైగా పౌర సేవలు అందిస్తున్నామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పుకొచ్చారు.15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం.. బైకర్ తల్లి చెప్పిన విషయాలివే..

బాలకృష్ణపై జగన్ వ్యాఖ్యలు సరికాదు.. మంత్రి పార్థసారథి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 09:33 PM