CM Chandrababu ON Auto Driver Scheme: ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 04 , 2025 | 01:26 PM
ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామనిఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు అమలుచేస్తున్నామని నొక్కిచెప్పారు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్లు బాగుచేశామని వివరించారు.
అమరావతి, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): 2024 ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సెల్‌ఫోన్లు చూసుకొండి డబ్బులు వచ్చాయా.. చూసుకున్నారా.. కన్పర్మేషన్ మెసేజేలు అందుకున్నారా.. అని సీఎం ఆటో డ్రైవర్‌లని అడిగారు. అవును రూ.15 వేలు వచ్చాయని ఆటోడ్రైవర్‌లు సీఎంకు సమాధానం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్‌లు, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి వ్యవస్థలన్నీ అగమ్యగోచరమని తెలిపారు సీఎం చంద్రబాబు.
పాలనను గాడిలో పెడుతున్నాం..
ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని ఉద్ఘాటించారు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్లు బాగుచేశామని వివరించారు. స్త్రీశక్తికి ముందే ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు. పేదల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటామని వెల్లడించారు. యునివర్సిల్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో అందరినీ ఆదుకుంటామని తెలిపారు. రూ.25 లక్షల వరకు హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఉద్ఘాటించారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని నొక్కిచెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 750 సేవలు నేరుగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్‌ల పండుగ..
‘ఓజీ సినిమా చూశారు.. దసరా పండుగ చేసుకున్నారు. విజయవాడ ఫెస్టివల్ చాలా బాగా జరిగింది. ఈరోజు ఆటో డ్రైవర్‌ల పండుగలో ఉన్నాం. ఆయుధ పూజ తరహాలో వాహన పూజ చేశారు. ఆటో డ్రైవర్‌లు పేమెంట్లు అన్ని సెల్‌ఫోన్ ద్వారానే చేస్తున్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. చెప్పిన రోజు చెప్పినట్లుగా పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఆటోడ్రైవర్లకు ఎన్నో కష్టాలు ఉన్నాయి... రోడ్లు అన్ని అధ్వానంగా ఉన్నాయి. నేను, పవన్ కల్యాణ్ , బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపు ఇచ్చాం. 94శాతం స్ట్రైయిక్ రేటు వచ్చింది. రానున్న రోజుల్లో ఈ స్ట్రైయిక్ రేటు పెరగాలి. 16 నెలల క్రితం అంతా అగమ్య గోచరం. రాత్రి, పగలు ఆలోచించాం. ఏపీని కాపాడటానికి ఉద్యమ స్పూర్తితో ముందుకు వచ్చాం. చరిత్రలో ఎప్పుడైనా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చూశారా. 175 నియోజకవర్గాలల్లో ఆటో డ్రైవర్‌ల పండుగ జరుగుతోంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం
జగన్ హయాంలో నాపై క్రిమినల్ కేసు.. అశోక్ గజపతిరాజు ఫైర్
Read Latest AP News And Telugu News