Share News

Task Force : టాస్క్‌ లేదు ఫోర్స్‌ లేదు

ABN , Publish Date - Feb 03 , 2025 | 03:14 AM

కానీ రెవెన్యూ అధికారులు తమకు ఆ సమావేశపు నిర్ణయాలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Task Force : టాస్క్‌ లేదు   ఫోర్స్‌ లేదు

  • భూవివాదాలపై చేష్టలుడిగిన రెవెన్యూ

  • టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు డిసెంబరులో నిర్ణయం.. నేటికీ కార్యరూపం దాల్చని సీఎం ఆదేశం

  • అతీగతీలేని మదనపల్లె ఫైల్స్‌ దహనం కేసు

  • విశాఖ భూముల వ్యవహారమూ కంచికే

  • లోతైన విచారణ జరిగితే అధికారులు, వైసీపీ నేతల అక్రమాలు బట్టబయలు

  • అందుకే సీఎం ఆదేశాలు బుట్టదాఖలు?

  • అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలు

రాష్ట్రంలో భూముల అక్రమాల నిగ్గు తేలుస్తాం. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తాం. అక్రమార్కులు ఎంతటివారైనా ఉపేక్షించం. రెవెన్యూ శాఖ ఈ విషయంలో పట్టుదలగా పనిచేయాలి.

- డిసెంబరు 12న కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి ప్రకటించి రెండు నెలలు గడిచిపోయింది. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుపై రెవెన్యూ శాఖ ఇప్పటికీ స్పందించలేదు. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల్లో వైసీపీ నేతలతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఇవేవీ బయటికి రాకుండా ఉండేందుకే కొందరు అధికారులు టాస్క్‌ఫోర్స్‌ ప్రతిపాదనను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత డిసెంబరులో కలెక్టర్ల సదస్సు నిర్వహించింది రెవెన్యూ శాఖనే. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు, ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాల అమలు, తదుపరి కార్యాచరణ బాధ్యత ఆ శాఖదే. కానీ రెవెన్యూ అధికారులు తమకు ఆ సమావేశపు నిర్ణయాలతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను అమలు చేయడం లేదు. కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల మినిట్స్‌లోనూ ఈ అంశం ప్రస్తావన లేదు. అంటే.. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు గురించి రెవెన్యూ శాఖతో పాటు ప్రభుత్వం మరచిపోయినట్లేనా? ఇలాగైతే భూముల అక్రమాల్లో నేతలు, అధికారుల దోపిడీ గుట్టు రట్టయ్యేదెలా? ఎవరి పాత్ర ఏమిటో ఎలా తెలుస్తుంది? ఇదంతా జరగడం ఇష్టం లేకనే రెవెన్యూ శాఖ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేసిందా? కొన్ని పరిణామాలను విశ్లేషిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది.


కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజుల్లో.. గత ఏడాది జూలై 21వ తేదీ అర్ధరాత్రి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు దుండగులు నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. అసైన్డ్‌ భూ ముల దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకు రెవెన్యూ రికార్డులను బూడిద చేసేందుకు కుట్రపూరితంగా అగ్గిరాజేశారు. ఆ తర్వాత అగ్నిప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌పీ సిసోడియా మదనపల్లెకు వెళ్లి విచారించారు. ఆ తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్‌, ఇనాం, షరతుగల పట్టా భూముల అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేయించింది. 10 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను గత జగన్‌ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్‌ చేయగా, అందులో 5.50 లక్షల ఎకరాలను జీఓ 596కి విరుద్ధంగా నిషేఽధిత జాబితా నుంచి బయటకు తీశారని విచారణలో బయటపడింది.


ప్రతిపాదన బుట్టదాఖలు

భూ అక్రమాల పరిధి భారీగా ఉండటంతో ఈ అంశంపై గత ఏడాది డిసెంబరులో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా చర్చ జరిగింది. భూ దోపిడీకి పాల్పడిన వైసీపీ నేతలు, అధికారుల గుట్టు బయటకు తీసేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, ఎస్పీ, జాయిట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్‌డీఓ), డివిజనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (డీఎస్పీ), ఇతర రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సాధారణంగా సీఎం ఆదేశాలపై రెవెన్యూ శాఖ వెంటనే స్పందించి అమల్లోకి తీసుకొస్తూ ఆదేశాలు ఇవ్వాలి. కానీ రెండు నెలలవుతున్నా సీఎం ఆదేశాలకు అతీగతీ లేదు. టాస్క్‌ లేదు. ఫోర్స్‌ లేదు. కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు సంబంధించిన మినిట్స్‌లోనూ ఈ అంశం ప్రస్తావన తీసుకురాలేదని తెలిసింది. అంటే.. టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలను రెవెన్యూశాఖ అజెండా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం కార్యాలయం కూడా దీనిపై ఇప్పటి వరకు ఆరా తీయలేదని తెలిసింది. దీంతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు ప్రతిపాదన బుట్టదాఖలైంది.


అక్రమాల్లో అధికారుల పాత్ర

రెవెన్యూశాఖ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తోందన్న అనుమానాలు లేకపోలేదు. ఇందు కు అనేక కారణాలున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన భూముల అక్రమాల్లో వైసీపీ నేతల భాగస్వామ్యం ఎంతుం దో.. అంతకంటే ఎక్కువగానే రెవెన్యూ అధికారుల పాత్ర ఉంది. తహసీల్దార్లు, ఆర్‌డీఓ స్థాయి అధికారులు, కలెక్టర్లుగా పనిచేసిన కొందరు ఐఏఎ్‌సల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలున్నాయి. ఆర్‌డీఓలుగా డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. వారి ప్రమేయం లేకుండా, కలెక్టర్ల ఆమోదం లేకుండా అసైన్డ్‌ భూములను జీఓ 596కి విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి తీయలేరు. అంటే.. అక్రమంగా నిషేధిత జాబితా నుంచి బయటకు తీసిన 5 లక్షల ఎకరాల వ్యవహారంలో అనేక మంది ఆర్‌డీఓలు, సీనియర్‌ అధికారుల పాత్ర ఉంది. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి విచారణ చేస్తే, ఆనాటి పాపాల్లో భాగస్వాములైనవారి మెడకు చుట్టుకుంటుంది. రాజకీయ నేతలు ఇరుక్కుంటారు. ఇది ఇప్పుడున్న రెవెన్యూ అధికారులకు ఇష్టం లేదని తెలుస్తోంది. భూ అక్రమం కేసులో ఒకనేత, అధికారిని టచ్‌ చేస్తే వారికి శత్రువులై పోతామనో లేక అది ఒకరి నుంచి మరొకరికి అంటుకొని మొత్తంగా ఇటు నేతలు, అటు అధికారయంత్రాంగం ఇబ్బంది పాలవుతారన్న ఆందోళనతోనో కొందరు సీనియర్‌ అధికారుల ఒత్తిడితో టాస్క్‌ఫోర్స్‌ అంశాన్ని బుట్టదాఖలు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైతే రాష్ట్రస్థాయిలో జీఓ 596 నుంచే విచారణ చేపట్టాలి. అప్పుడు నాటి రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి మండల త హసీల్దార్ల వరకు విచారణ ఎదుర్కోవాలి. ఈ పరిణామాలన్నీ కళ్లముందు కనిపించే కొందరు సీనియర్‌ అధికారులు అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది.


అతీగతీ లేని కేసులు

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు నిప్పు పెట్టిన సంఘటన గత ఏడాది జూలైలో జరిగింది. వెంటనే సీఐడీ విచారణకు ఆదేశించారు. నేటికి ఎనిమిది నెలలవుతోంది. ఈ కేసులో పెద్ద పురోగతి లేదు. సంఘటన జరిగిన వెంటనే నాటి ఆర్డీఓ, మాజీ ఆర్డీఓను సస్పెండ్‌ చేశారు. తర్వాత కేసు విచారణలో సీఐడీ కొత్తగా ఏం సాధించిందో ఎవరికీ తెలియడం లేదు. మరోవైపు విశాఖలో భూ కుంభకోణాలే లేవని, ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు సురక్షితమని జిల్లా కలెక్టర్‌ గత ఏడాది డిసెంబరులోనే నివేదించారు. వైసీపీ పెద్దలు, కొందరు బడా అధికారులు అసైన్డ్‌, ఇనాం భూములను చేజిక్కించుకున్న ఉదంతాలేవీ బయటకు రాలేదు. అసలు ఎలాంటి అక్రమాలూ జరగలేదని నివేదించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 03 , 2025 | 03:15 AM