Pawan Kalyan on Fishermen Problems: మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపర్చడమే లక్ష్యం:పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 17 , 2025 | 09:06 PM
ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మత్స్య సంపద పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల జీవితాల్లో మెరుగైన మార్పులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. మత్స్య సంపద పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలపై ఇవాళ (శుక్రవారం) పవన్ కల్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో పాటు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ), విశాఖపట్నం శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు పవన్ కల్యాణ్ .

మత్స్యకారుల్లో చేపల వేట సామర్థ్యాన్ని మరింత పెంపొందించడానికి గల అవకాశాలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం సముపార్జనకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటీవల కాకినాడ పర్యటన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు తమ సమస్యలని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి వందరోజుల ప్రణాళిక చేపట్టారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఈ సమీక్షలో చర్చించారు పవన్ కల్యాణ్
.
ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలని అన్వేషించాలని సూచించారు. ముఖ్యంగా చేపల వేటలో మెలకువలు నేర్పడం, నైపుణ్యం పెంచడంతోపాటు తగిన సౌకర్యాల కల్పనపైనా దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. వీటితోపాటు మత్స్య సంపదను పెంపొందించడం, తదితర అంశాలపై విశాఖపట్నం సీఎంఎఫ్ఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్ కె. కిజాకుడాన్ సలహాలు, సూచనలు తీసుకున్నారు.

ఆయన సూచనలను అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కాకినాడ జిల్లా కలెక్టర్‌కి పవన్ కల్యాణ్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, మత్స్య శాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ బిందు మాధవ్, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...
సామాన్యులకు ఉపయోగపడేలా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పురోగతి: పెమ్మసాని
జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసం
Read Latest AP News And Telugu News