Share News

AP Govt : బర్డ్ ఫ్లూ కలకలం.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Feb 12 , 2025 | 09:29 AM

AP Govt: ఈ మధ్య కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకస్మికంగా భారీగా కోళ్లు చనిపోయాయి. ఒక్క గోదావరి జిల్లాలోనే 62 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ జిల్లాల్లోని కానూరు అగ్రహారం, వేల్పూరు ఫారాల నుంచి నమూనాలు సేకరించి పరిశీలించారు. అధికారుల సేకరించిన నమూనాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.

AP Govt : బర్డ్ ఫ్లూ కలకలం.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

అమరావతి: ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్లు మృతిచెందడంపై పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఏపీ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ (బుధవారం) టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. చనిపోయిన కోళ్లను పరిశీలించి శాంపిల్స్ ల్యాబ్‍కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.


అప్రమత్తంగా ఉండాలి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. పరిస్థితిని బట్టి జోన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని అన్నారు. పూర్తి స్థాయిలో సర్వైలెన్స్ ఉండాలని సూచించారు. పౌల్ట్రీల వద్ద బయో సెక్యూరిటీ మేజర్స్ అమలు చేయాలని అన్నారు. సంబంధిత పౌల్ట్రీల వద్ద రవాణా వాహనాలు సంచరించకుండా ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు సంబంధిత ప్రాంతాల నుంచి కోళ్ల రవాణా నిషేధించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో భయం

ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాకు బర్డ్ ఫ్లూ వ్యాధి పాకింది. గంపలగూడెం మండలం అనుమ్మోలంకలోని ఓ పౌల్ట్రీఫామ్‌లో మూడ్రోజుల్లో 11వేల కోళ్లు మృతిచెందాయి. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు,చికెన్ షాపులు,కోళ్లు, గుడ్లను పుడ్చేయాలని అక్కడి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులపాటు చికెన్‌కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తిరువూరు పరిసర ప్రాంతాల్లో 15రోజుల నుంచి ఇప్పటికే కొన్ని పౌల్ట్రీఫాంలల్లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. లక్షల్లాది రూపాయల పెట్టుబడుపెట్టి క్షణాల్లో కళ్లముందే కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


ఏలూరులో 17 గ్రామాల్లో అలెర్ట్

ఏలూరు: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోండటంతో ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తణుకు మండలం వేల్పూరు నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో 17 గ్రామాల్లో అలెర్ట్ జోన్ విధించారు. మూడు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలకు కోడిగుడ్లు, కోళ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. స్థానిక మార్కెట్‌లో కేజీ రూ.200 నుంచి రూ.160లకు చికెన్ ధరలు పడిపోయాయి. బర్డ్ ఫ్లూ వ్యాపించిన ప్రాంతాల్లో చికెన్ దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


ప్రజల్లో బర్డ్‌ఫ్లూ భయం..

కాగా గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్‌ మండలం వేల్పూరులోని కోళ్లఫారాల్లో ఒక్కసారిగా వేల కొద్దీ కోళ్లు మరణిస్తున్నాయి. చనిపోయిన కోళ్ల శాంపిళ్లను అధికారులు పరీశీలించారు. అధికారులు పరిశీలించిన నమూనాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది. వాస్తవానికి గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి.


పౌల్ట్రీ పరిశ్రమకు భారీ నష్టం..

ఈ జిల్లాల్లో 350 వరకూ పౌల్ర్టీ ఫారాలు ఏర్పాటు చేశారు. 3 కోట్ల మేర వ్యయంతో కోళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. గోదావరి జిల్లాల్లో ప్రతిరోజు 2.40 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ స్థానిక అవసరాలకే కాకుండా.. ఒడిశా, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌, అస్సాం తదితర రాష్ట్రాలకూ వీటిని ఎగుమతి చేస్తుంటారు. గోదావరి జిల్లాల్లో రోజుకు కనీసం 30 వేల కోళ్లను మాంసం కోసం వినియోగిస్తారు. పరిశుభ్రత లేకపోవడం కానీ, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన కోళ్ల ద్వారా గానీ కానూరు అగ్రహారంలో బర్డ్‌ ఫ్లూ వ్యాపించి ఉండొచ్చని అధికారులు తెలిపారు. బర్డ్‌ఫ్లూ కారణంగా ప్రస్తుతం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్లు వేల సంఖ్యలో చనిపోతున్నాయి. ఇది మరింత వ్యాప్తిచెందకుండా తక్షణ చర్యలు తీసుకోకపోతే.. పౌల్ట్రీ పరిశ్రమ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ లిక్కర్‌ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి

మళ్లీ రాజకీయాల్లోకి రాను

ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ చేయరా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 12 , 2025 | 11:13 AM