Tirupati: తిరుపతి దక్షిణ దిశ విస్తరణకు శుభారంభం
ABN , Publish Date - Aug 14 , 2025 | 06:54 AM
తిరుపతి నగరం దక్షిణ దిశగా విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరానికి దక్షిణంగా ఉన్న పల్లెల ప్రజలకు జాతీయ రహదారిని దాటడం అనే ప్రాణాంతక సమస్యకు పరిష్కారం లభిస్తోంది.
» వేగంగా ఎన్ హెచ్ 716 విస్తరణ
» ఏడాదిన్నరలో అందుబాటులోకి..
» ట్రాఫిక్ జాములు ఉండవు.
» మొత్తం రోడ్ల నిర్మాణం : 37.43కి.మీ
» మల్లవరం నుంచి రేణిగుంట
» (కేఎల్ఎం సర్కిల్)దాకా: 17.40 కి.మీ
» తమిళనాడు/ఏపీ సరిహద్దు పుత్తూరు సెక్షన్ 20.03.2
» ఇరువైపులా సర్వీస్ రోడ్డు దూరం: 32 కి.మీ
» నిర్మాణ వ్యయం: రూ.862.11కోట్లు
» నిర్మాణ సమయం: రెండు సంవత్సరాలు
» పూర్తి చేయాల్సిన తేదీ :13-12-2026
తిరుపతి (Tirupati) నగరం దక్షిణ దిశగా విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరానికి దక్షిణంగా ఉన్న పల్లెల ప్రజలకు జాతీయ రహదారిని (National Highway) దాటడం అనే ప్రాణాంతక సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఆరు వరుసలుగా విస్తరణ జరుగుతున్న జాతీయ రహదారిపై కొత ఫ్లైవోవర్లు, అండర్‌పాసులు నిర్మించనున్నారు. ఇందువల్ల రోడ్డు ప్రమాదాలకు అవకాశముండదు.
నిర్మాణ సంస్థ:
టీపీఎఫ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వొయాన్స్డ్ సొల్యూషన్స్ లిమిటెడ్ తిరుపతి-ఆంధ్రజ్యోతి: చిత్తూరు-నాయుడుపేట ఆరు లేన్ల రహదారిలో సి.మల్లవరం నుంచి రేణిగుంట కేఎల్ఎం కూడలి దాకా మాత్రమే నాలుగు లేన్ల రహదారి ఉండిపోయింది. దీన్ని కూడా ఆరు లేన్ల రహదారిగా విస్తరించే పనులు జోరుగా సాగుతున్నాయి. 17.40 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రహదారిపై కొత్తగా మూడు ఫ్లైవోవర్లు, 5 అండర్‌పాసులు నిర్మిస్తున్నారు. సర్వీస్ రోడ్లు ఉంటాయి.
యాక్సెస్ కంట్రోల్డ్ హైవే
'యాక్సెస్ కంట్రోల్డ్ హైవే’గా రూపుదిద్దుకుంటున్న ఈ జాతీయ రహదారి తిరుపతి నగర విస్తరణలో కీలక పాత్ర పోషిం చబోతోంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ 2024 నవంబరు 5న దీనికి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి ఎన్‌హెచ్ 716గా నామకరణం చేశారు. ఇప్పటివరకు 11 శాతం పనులు పూర్తయ్యాయి. ఏడాదిన్నరలో పూర్తిగా అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతం విస్తరణ పనులతో పాటు రామానుజపల్లె, మల్లవరం వద్ద అండర్ పాస్ పనులు మొదలు పెట్టారు.
యాక్సెస్ కంట్రోల్డ్ హైవే ప్రత్యేకతలు
వేగంగా, సురక్షితంగా వాహనాలు ప్రయాణించేలా ఈ హైవే నిర్మాణం జరుగుతోంది. హైవేను క్రాస్ చేసే అవసరం ఎక్కడా ఇక ఉండదు. హైవేకి సమాంతరంగా అటూ, ఇటూ సర్వీస్ రోడ్లు ఉంటాయి. హైవే మీదకు ఎక్కడానికీ, దిగడానికీ ఈ సర్వీస్ రోడ్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉంటాయి. పశువులు హైవే మీదకు వచ్చే వీలే లేకుండా బారికేడ్లు నిర్మిస్తారు.
మూడు ఫ్లైవోవర్లు
హైవేపై మూడుచోట్ల ఫ్లైవోవర్లు నిర్మించనున్నారు. ప్రస్తుతం కేఎల్ఎం ఆస్పత్రి కూడలి గందరగోళంగా ఉంటుంది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపునకు వెళ్లే ఆరు వరసల హైవేలోంచి చెన్నైకి నాలుగు వరసల కూడలి చీలుతుంది. ఇదే కూడలిలో రేణిగుంట నుంచి ఒక రోడ్డు వచ్చి కలుస్తుంది. ఇక్కడ ఎటు నుంచి ఎటు తిరగాలో అర్థంగాక వాహనదారులు గందరగోళపడుతుంటారు. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ప్రమాదాలు జరుగుతుంటాయి. అలాగే మల్లవరం కూడలి కూడా ప్రమాదాలకు దారితీసేలా ఉంది. ఈ రెండు కూడళ్ల వద్దా ఫ్లైవోవర్లు నిర్మించనున్నారు. అలాగే అవిలాల క్రాసింగ్‌లో మరొక ఫ్లైవోవర్ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది. ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
ఐదు అండర్ పాసులు
మల్లవరం కూడలి నుంచి కేఎల్ఎం కూడలి దాకా అనేక చోట్ల హైవేను క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది. ఆర్సీపురం, పచ్చి కాపలం వరకూ ఉన్న పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇందుకు పరిష్కా రంగా అడర్పాస్ నిర్మాణం జరుగుతోంది. పేరూరు జంక్షన్, రామానుజపల్లె చెక్ పోస్ట్ జంక్షన్లలో భారీ వాహనాలు సైతం వెళ్లేలా(వీ యూపీ) అండర్ పాసులు నిర్మించనున్నారు.తనపల్లి క్రాస్, తిరుచానూరు జంక్షన్లలో కార్లు, మినీ వ్యాన్లు, ఆటోలు, ద్విచక్ర వాహ నాలు మాత్రమే వెళ్లేలా ఎల్వీయూపీ అండర్ పాస్లు నిర్మిస్తారు. ఇది 4.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఎమ్మార్పల్లి - మల్లవరం రోడ్డులో ఉప్పరపల్లి జంక్ష న్లో కార్లు, బస్సులు వెళ్లేలా (ఎస్వీయూపీ) అండర్ పాస్ నిర్మిస్తారు. ఈ అండర్పాస్ 5.5మీటర్ల ఎత్తు ఉంటుంది.
టోల్ తప్పదు...
యాక్సెస్ కంట్రోల్డ్ హైవే మీదకు నగరంలో నుంచి ఎక్కాలనుకుంటే మాత్రం టోల్ ఫీజు చెల్లించాలి. ప్రస్తుతం హైవేపై మేర్లపాక వద్ద, పాకాల వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇవి కాకుండా సర్వీస్ రోడ్డులోంచి ఎక్కే దగ్గర కూడా టోల్ బూత్‌లు పెడుతారు. హైదరాబాద్‌లోని అవుటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్ల తరహాలో ఇవి ఉంటాయి. కింది ప్రాంతాల్లో టోల్ బూత్‌లు ఉంటాయి. ఎంటర్ చేసిన టోల్ ప్లాజా నుంచి ఎగ్జిట్ టోల్ ప్లాజా వరకు ప్రయాణ దూరం ఆధారంగా టోల్ వసూలు చేస్తారు.
• తిరుపతి నుంచి మదనపల్లె వెళ్లే మార్గంలో సీ.మల్లవరం జంక్షన్ వద్ద
• శ్రీకాళహస్తి నుంచి చిత్తూరు వెళ్లే వైపు తొండమనాడు దగ్గర
ఆర్సీపురం జంక్షన్ (అవిలాల క్రాస్) వద్ద
• గాజులమండ్యం జంక్షన్ (ఫ్లైఓవర్ కింద చెన్నై మార్గంలో)
నగరి దగ్గర రెండు
ఈ కూడలి ప్రమాదకరం
ప్రస్తుతం హైవేల్లో మర్రిగుంట కూడలి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఎయిర్ పోర్టు వైపు నుంచి తిరుపతి వైపునకు వస్తున్నపుడు రేణిగుంట చెక్‌పోస్టు నుంచి ఒక రోడ్డు వచ్చి కలుస్తుంది. ఈ కూడలి గందరగోళంగా ఉండటంతో వేగంగా ప్రయాణించే వాహనాలు హఠాత్తుగా ఎటు మళ్లాలో అర్థం కాక సడన్ బ్రేకు వేసి పల్టీలు కొడుతున్నాయి. ఇక్కడ సురక్షితమైన కూడలి గానీ, ప్లైవోవర్ గానీ అవసరం.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు భయం పోయింది.. జగన్‌కు పట్టుకుంది
జగన్‌కు దమ్ముంటే మోదీ, షాపై పోరాడాలి
For More AndhraPradesh News And Telugu News