Tirupati SP Subba Rayudu: తిరుపతి గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ సుబ్బరాయుడు
ABN , Publish Date - Nov 01 , 2025 | 10:00 PM
తిరుపతి గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రతి మలుపు వద్ద బ్లీకింగ్ లైట్లు, రేడియం ఏరో మార్క్స్, సేఫ్టీ మెజర్‌మెంట్స్ తీసుకున్నామని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు.
తిరుపతి, నవంబరు1 (ఆంధ్రజ్యోతి): తిరుపతి గరుడ వారధి (Garuda Varadhi)పై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ (Tirupati SP Subba Rayudu) స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రతి మలుపు వద్ద బ్లీకింగ్ లైట్లు, రేడియం ఏరో మార్క్స్, సేఫ్టీ మేజర్‌మెంట్స్ తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఈరోజు(శనివారం) ఎస్పీ సుబ్బరాయుడు స్వయంగా గరుడ వారధిని సందర్శించారు. ఈ క్రమంలో తిరుపతి గరుడ వారధిపై అక్కడి ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు సంబంధిత అధికారులు, ట్రాఫిక్ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు వెంట అదనపు ఎస్పీ (శాంతి భద్రత) రవిమనోహర్ ఆచారి, ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణ చారి, సీఐ సంజీవి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు.
వాహనాల అధిక వేగం ప్రమాదకరమని... వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్‌పై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐఏఎస్, ఐపీఎస్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, ఐఏఎస్, ప్లానింగ్ అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రమాద నివారణ చర్యలను కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఫ్లైఓవర్‌పై రాత్రింబవళ్లు ట్రాఫిక్ పోలీసులు పహారా కాస్తూ, వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రతి మలుపు వద్ద బ్లీకింగ్ లైట్లు, రిఫ్లెక్టివ్ ఏరో మార్కులు, సేఫ్టీ బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని వివరించారు. రహదారి మోస్తరు వర్షాల్లోనూ స్పష్టంగా కనబడేలా రేడియం మార్కింగ్ పనులు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు ఎస్పీ సుబ్బరాయుడు.
తిరుపతి గరుడ వారధిపై చిన్న ప్రమాదం కూడా జరుగకుండా ప్రతి మలుపు వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. వేగ నియంత్రణే భద్రతకు మూలమని నొక్కిచెప్పారు. అధిక వేగం ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు నియమాలను కచ్చితంగా పాటించాలని దిశనిర్దేశం చేశారు. బైక్ నడుపుతూ మొబైల్ వాడవద్దని సూచించారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కవద్దని , ప్రజలకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణ కల్పించినా, స్టంట్స్ చేయడం, రీల్స్, షార్ట్ ఫిలిమ్స్ తీయడం ద్వారా కొన్ని పరిస్థితుల్లో మీ ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తారని చెప్పుకొచ్చారు. మీ భద్రత మీ చేతిలోనే ఉందని సూచించారు. వర్షకాలంలో గరుడ వారధి వంటి ఎత్తైన ప్రాంతాల్లో వాహనాలు నడపేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ఎవరైనా ప్రమాదకర పరిస్థితిని గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరి జాగ్రత్తే సమాజ భద్రతకు పునాది అని తెలిపారు. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో ఈ చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజలందరూ పోలీసు శాఖకి సహకరించాలని ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
నేను అభివృద్ధి చేస్తుంటే.. వాళ్లు విధ్వంసం చేస్తున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News