Tirupati Dead Bodies: పాకాల మృతదేహాల మిస్టరీ.. వివాహేతర సంబంధంపై అనుమానాలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:13 PM
తిరుపతి సమీపంలోని పాకాల అడవిలో ఈనెల 14న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అందులో ఓ మృతదేహం పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్‌దే అని తేలింది.
తిరుపతి: పాకాల అడవిలో బయటపడిన మృతదేహాలు స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాకాల మండలం గాదంకి టోల్‌ప్లాజా సమీపంలోని అడవిలో 2 మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. అయితే.. మృతదేహాల పక్కనే 2 గోతులు తీసి పూడ్చిన ఆనవాళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ రెండు గోతుల్లో చిన్నారుల మృతదేహాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను పాతిపెట్టిన చోట ఇవాళ(మంగళవారం) తవ్వకాలు జరపనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తిరుపతి సమీపంలోని పాకాల అడవిలో ఈనెల 14న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అందులో ఓ మృతదేహం పాండిచ్చేరికి చెందిన కలై సెల్వన్‌దే అని తేలింది. అదే ప్రదేశంలో లభించిన మృతదేహాలను అతడి వదిన జయమాలిని, ఆమె ఇద్దరు కుమార్తెలవని గుర్తించారు. నలుగురి మరణాలను హత్యలుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతురాలు తన భార్య అంటూ.. వెంకటేశన్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. హత్యలకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పాకాల అడవిలో బాగా కుళ్లిన స్థితిలో మృతదేహాలు బయటపడ్డాయి. పశువుల కాపర్లు మృతదేహాలను చూసి, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుండగా, పక్కనే వస్త్రం కప్పి ఉన్న మహిళ శవం ఉంది. ఆ పక్కనే మరో రెండు గోతులు తీసి పూడ్చిపెట్టిన ఆనవాళ్లూ కనిపించాయి. అందులో చిన్నారుల మృతదేహాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గుంతలు తవ్వేందుకు ఉపయోగించిన పార సమీప చెట్లపొదల్లో లభ్యం అయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే వారి మరణాలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం