Anagani Satya Prasad: సీఎం చంద్రబాబు కార్మికుల పక్షపాతి..
ABN , Publish Date - Oct 04 , 2025 | 02:51 PM
గత జగన్ ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే ఈ ప్రభుత్వం 435 కోట్ల రూపాయలు ఇస్తోందని మంత్రి అనగాని తెలిపారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో పదివేలు ఇస్తూనే.. ఫైన్‌ల ద్వారా 20,000 రూపాయలు దోపిడీ చేసిందని ఆరోపించారు.
తిరుపతి: నగరంలో 'ఆటో డ్రైవర్ సేవలో' పథకాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంతో చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని మంత్రి అనగాని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్లకు రూ.435 కోట్ల అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో కేవలం పదివేలు మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ.. కూటమి ప్రభుత్వం రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
గత జగన్ ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు వాహనమిత్ర పథకం కోసం ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం 435 కోట్ల రూపాయలు ఇస్తోందని మంత్రి అనగాని తెలిపారు. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో పదివేలు ఇస్తూనే.. ఫైన్‌ల ద్వారా 20,000 రూపాయలు దోపిడీ చేసిందని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెంచి జగన్ ప్రభుత్వం ఒక్కో ఆటో డ్రైవర్‌పై ఏడాదికి రూ. 36 వేల భారం మోపిందని విమర్శించారు. అంతే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లపై విపరీతంగా చలాన్లు రాసి వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు టాక్స్‌లు భారీగా పెంచి ఆటో డ్రైవర్ల రక్తాన్ని జగన్ రెడ్డి జలగలా పీల్చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వేధింపులు లేవు. రోడ్డు టాక్సలు, గ్రీన్ టాక్సులు లేవని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
మరోవైపు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి మార్కెట్ యార్డ్ వద్ద ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సి.ఎం రమేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఖాకీ చొక్కాలను ధరించి ఆటోల్లో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో సి.ఎం రమేష్ నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం నుంచి బొడ్డేపల్లి మార్కెట్ యార్డ్ వరకు ఆటో నడిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ