Share News

Ration Card Holders: రేషన్ పంపిణీలో గోల్‌మాల్.. లబ్ధిదారులు చనిపోయినా..

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:18 PM

అర్హులకు మాత్రమే రేషన్ ఫలాలు అందడంతో పాటు బియ్యం పక్కదారి పట్టడానికి వీలులేదన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకనే సాగు తుండటంతో అర్హత లేకపోయినా పలువురు లబ్ధి పొందుతున్నారని సమాచారం. ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడాలంటే ఈ-కేవైసీతో పాటు క్షేత్రస్థాయి సర్వేతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా..

Ration Card Holders: రేషన్ పంపిణీలో గోల్‌మాల్.. లబ్ధిదారులు చనిపోయినా..

  • మృతులకూ రేషన్ సరుకులు.. కార్డుల్లో తొలగించని పేర్లు

  • ప్రహసనాన్ని తలపిస్తోన్న ఈ-కేవైసీ

  • అనర్హులు లబ్ది పొందుతున్నా పట్టని అధికారులు


రేషన్ సరుకులు.. అర్హులకు మాత్రమే అందాలి. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా సరుకుల పంపిణీలో గోల్మాల్‌తో పాటు ప్రజాధనం పెద్దమొత్తంలో వృథా అవుతోంది. జిల్లాలో రేషన్ లబ్ధిదారుల్లో మృతులు ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్థికంగా స్థితిమంతులు, పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన వారు.. ఇలా ఎందరో ఇప్పటికీ రేషన్ కార్డుల్లో ఉన్నారు. వీరందరూ నెలనెలా ఠంచనుగా రేషన్ సరుకులు పొందుతుండటంతో ప్రభుత్వంపై పెనుభారం పడుతోంది. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ-కేవైసీ పక్కాగా అమలు చేస్తే అనర్హులను కార్డుల్లో నుంచి తొలగించవచ్చు. కానీ మూడు నెలలుగా ఈ-కేవైసీ ప్రక్రియను అధికారులు ఓ ప్రహసనంగా మార్చేశారు. ప్రభుత్వం గడువు పొడిగించుకుంటూ వెళ్తుండటంతో ఈ-కేవైసీ నూరు శాతం జరగడంలేదు. ఇదే అవకాశంగా డీలర్లు రేషన్ సరుకులను పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.


బాపట్ల: అర్హులకు మాత్రమే రేషన్ ఫలాలు అందడంతో పాటు బియ్యం పక్కదారి పట్టడానికి వీలులేదన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకనే సాగు తుండటంతో అర్హత లేకపోయినా పలువురు లబ్ధి పొందుతున్నారని సమాచారం. ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడాలంటే ఈ-కేవైసీతో పాటు క్షేత్రస్థాయి సర్వేతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. అర్హులకు లబ్ధి చేకూరడం ఎంత ముఖ్యమో అనర్హుల ఏరివేత కూడా పక్కాగా ఉండాలని పాలకులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడంలేదు. గత ప్రభుత్వం అనర్హుల ఏరివేతపై దృష్టి పెట్టకపోగా... ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొంది. రాజకీయ సిఫార్సులే ప్రామాణికంగా రేషన్ కార్డులను ఇబ్బడిముబ్బడిగా జారీ చేయడంతో జిల్లాలో కార్డుదారులు అమాంతం పెరిగిపోయారు. ఏటికేడు లబ్ధిదారుల సంఖ్యలో పెరుగుదల నమోదు కావడమే తప్ప తొలగించిన వారి సంఖ్య కనిపించదు. అయితే అర్హులు ఎందరో రేషన్ ఫలాలు అందుకోలేక పోతున్నారు. వారిని అధికారులు కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడంతో సరిపెడుతున్నారే కానీ కనికరించడంలేదు. బయోమెట్రిక్‌ను దుర్వినియోగిస్తూ కుటుంబంలో చనిపోయిన వారు ఉన్నా.. వారి సమాచారం ఇవ్వకుండా రేషన్ లబ్ధి పొందుతున్నవారూ ఉన్నారు.


అనర్హులతో రూ.3 కోట్ల వ్యయం

గుంటూరు, పల్నాడు, పరిధిలో దాదాపు రెండున్నర లక్షల మంది అర్హత లేకపోయినా రేషన్ ఫలాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు 21 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం మూడు జిల్లాల పరిధిలోని కార్డుదారుల కోసం కేటాయిస్తోంది. ఇందుకు సగటున రూ. వంద కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. కానీ అనర్హులు రేషన్ లబ్ధి పొందుతుండడం వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.3 కోట్లు అదనంగా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.


విభాగాల మధ్య లోపం..

అనర్హుల ఏరివేత పక్కాగా జరగాలంటే జిల్లా పౌరసరఫరాల శాఖతో పాటు మండలాల పరిధిలోని రెవెన్యూ విభాగం కూడా సమన్వయంతో అడుగులేయాలి. కానీ క్షేత్రస్థాయిలో అది లోపించింది. మరణ ధ్రువీకరణ పత్రాన్ని వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అందిస్తే తప్ప రెవెన్యూ విభాగం మరణాలపై స్పదించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ పత్రాన్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయగానే ఆటోమెటిక్‌గా వారి పేరు రేషన్ కార్డు నుంచి తొలగించబడుతుంది. కానీ ఈ పని అందరూ స్వచ్ఛందంగా చేయకుండా ఏళ్ల తరబడి లబ్దిపొందుతూనే ఉన్నారు. సచివాలయ సిబ్బంది కూడా మరణాలపై దృష్టి పెట్టడం లేదు. పౌర సరఫరాల శాఖ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అంతిమంగా ప్రభుత్వ ఖజానాపై ఆదనపు భారం పడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా

విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్

For More National News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 04:18 PM