Food poisoning in KGBV: శ్రీ సత్యసాయి జిల్లాలో ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులకు అస్వస్థత
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:41 AM
శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

శ్రీ సత్యసాయి: జిల్లాలోని సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ (Food poisoning in KGBV) జరిగింది. ఫుడ్ పాయిజన్‌తో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కేజీబీవీ హాస్టల్‌కు అధికారులు చేరుకొని హాస్టల్‌లో తనిఖీలు చేశారు.
రాత్రి సాంబార్ అన్నం తిన్నామని.. ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైనట్లు విద్యార్థినులు చెప్పారు. వారు తిన్న సాంబార్ అన్నం శాంపిల్స్‌ని అధికారులు సేకరించి పరీక్షకు పంపించారు. వాంతులు, విరేచనాలతో మరికొంత మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.
అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ఆదేశాలు
సత్యసాయి జిల్లా సొమందేపల్లి కస్తూర్బా హాస్టల్ ఘటనపై అధికారులతో ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ఆహారం కలుషితమై 20 మంది బాలికలు అస్వస్థతకు గురవ్వడంపై మంత్రి అనగాని ఆందోళన వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బాలికల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. పిల్లలకు వడ్డించిన సాంబార్ అన్నం కలుషితం కావడంతోనే బాలికలు అస్వస్థతకు గురైనట్లు మంత్రి అనగానికి అధికారులు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు.
విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించాలి: మంత్రి సవిత
సత్యసాయి జిల్లా సొమందేపల్లి కేజీబీవీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి సవిత ఆదేశించారు. హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో, వైద్య బృందం చికిత్స అందిస్తోంది. హాస్టల్ వద్దకు చేరుకుని విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి ఆర్డీవో తెలుసుకున్నారు. విద్యార్థినులకు దగ్గరుండి మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌వో ఫైరోజ్ బేగం, డీఈవో కృష్ణయ్యలకు ఫోన్లో మంత్రి సవిత ఆదేశించారు. ఈ ఘటనపై నివేదికతో పాటు విద్యార్థినుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో తాజా ఆహారం, వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే విద్యార్థినులకు ఇవ్వాలని సూచించారు. హాస్టల్ విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరే హాస్టళ్లలోనూ పునరావృతం కానివ్వొద్దని మంత్రి సవిత ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
శాంతి నారాయణకు తెలుగు వర్సిటీ పురస్కారం
For More AP News and Telugu News