Literary Achievement: శాంతి నారాయణకు తెలుగు వర్సిటీ పురస్కారం
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:20 AM
అనంతపురం జిల్లాకు చెందిన సాహితీ వేత్త, విమలా శాంతి సాహిత్య సామాజిక సేవా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ శాంతి నారాయణకు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం ప్రకటించింది.
అనంతపురం టౌన్, జూలై 3(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాకు చెందిన సాహితీ వేత్త, విమలా శాంతి సాహిత్య సామాజిక సేవా సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ శాంతి నారాయణకు తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారం ప్రకటించింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్ కోట్ల హనుమంతరావు గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాలకు చెందిన 12 మందిని తెలుగు వర్సిటీ పురస్కారాలకు ఎంపిక చేసింది. సాహిత్య విభాగంలో(నవల, కథా ప్రక్రియ) ఉభయ తెలుగు రాష్ట్రాల తరఫున శాంతి నారాయణను ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో త్వరలో పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహించి, శాంతి నారాయణకు పురస్కారం, రూ.20,116 నగదు బహుమతి అందజేసి సత్కరిస్తామని రిజిస్ట్రార్ తెలియజేశారు.