Share News

Elections 2024: తెలంగాణలో ఎవరి లెక్కలు వారివి.. లాభ పడబోతున్నది ఎవరు..?

ABN , Publish Date - May 15 , 2024 | 09:00 PM

తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు స్థానాల్లోనే బీఆర్‌ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఆయా పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి.

Elections 2024: తెలంగాణలో ఎవరి లెక్కలు వారివి.. లాభ పడబోతున్నది ఎవరు..?
Congress, BRS, BJP

తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు పోలింగ్ పూర్తైంది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. రెండు, మూడు స్థానాల్లోనే బీఆర్‌ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఆయా పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. ఓటింగ్ మాత్రం వన్‌సైడ్‌గా జరగలేదని, కాంగ్రెస్ భావిస్తున్నట్లు ఆ పార్టీ స్వీప్ చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి సమానంగా ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని, కొన్ని నియోజకవర్గాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


నాగర్‌కర్నూల్, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీకి సంస్థాగత బలం లేకపోయినప్పటికీ.. ఈ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని, గతంలో ఎన్నడూ ఈ నియోజకవర్గాల్లో బీజేపీ సాధించని స్థాయిలో ఓట్లు సాధించే అవకాశం ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు డబుల్ డిజట్‌పై బీజేపీ, కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అగ్రనేతలు తమకు 12 సీట్లు వస్తాయని పైకి చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని, కొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు 15 నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ జరిగిందని, రెండు నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ మధ్య ఫైట్ జరగ్గా.. హైదరాబాద్‌ మినహ మిగతా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరిగినట్లు తెలుస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం అనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా నడుస్తోంది.

BJP: కమలనాథుల కదనోత్సాహం.. ఓటింగ్‌ సరళిపై సంతృప్తి


లాభం ఎవరికి..?

తెలంగాణలో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో, బీఆర్‌ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక స్థానంలో గెలిచింది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఎక్కువ స్థానాలు రావాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో బీఆర్‌ఎస్ కొంత బలహీనపడిందనేది వాస్తవం. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. దీంతో బీఆర్‌ఎస్‌కు ఒక స్థానమైన వస్తుందా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.


ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పూర్తిగా నష్టపోయిందనే విషయాన్ని రాజకీయ పండితులు స్పష్టంగా చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ లాభపడినా.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చిచూస్తే.. కాంగ్రెస్‌ కంటే బీజేపీకే ఎక్కువ లాభం కలిగి ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. కొన్నిచోట్ల బీఆర్‌ఎస్ ఓట్లు బీజేపీ, కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయని.. ఈ బదాలయింపు నియోజకవర్గాల ఆధారంగా జరిగినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ ఓట్లు ఏ పార్టీకి బదిలీ అయ్యాయో.. ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి తప్పనిసరిగా గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


డబుల్ ఎవరికి..

డబుల్ డిజిట్‌పై రెండు జాతీయ పార్టీలు అంచనా పెట్టుకున్నప్పటికీ ఇది సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. ఏ పార్టీకి డబుల్ డిజిట్ రాదని, గరిష్టంగా ఎవరికి వచ్చినా 9 సీట్ల వరకు రావచ్చనే ప్రచారం సాగుతోంది. హోరాహోరీ పోటీ జరిగిన నియోజకవర్గాల్లో ఫలితం ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉంటే మాత్రం 10 నుంచి 11 సీట్లు రావొచ్చని.. కానీ అలాంటి అవకాశాలు చాలా తక్కువని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా అసలు ఫలితం ఎలా ఉంటుంది.. ఎవరి అంచనాలు కరెక్ట్.. ఎవరికి తప్పు అనేది జూన్‌4న తేలనుంది.


Hyderabad: హైదరాబాద్‌లో భారీ మెజారిటీపై ‘మజ్లిస్‌’ ధీమా...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2024 | 09:00 PM