Share News

Thummala: వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

ABN , Publish Date - Jun 08 , 2024 | 04:22 AM

వరిసాగులో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, వరి విస్తీర్ణం కొంతకాలంగా గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Thummala: వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ

  • సన్నాలు సాగుచేసే రైతులకు రూ.500 బోనస్‌

  • ఇక్కడి ధాన్యానికి ఇతర దేశాల్లో మంచి డిమాండ్‌

  • గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌లో మంత్రి తుమ్మల

  • రాష్ట్రంలో అత్యుత్తమ రకాల ధాన్యం ఉత్పత్తి: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): వరిసాగులో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, వరి విస్తీర్ణం కొంతకాలంగా గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నిరుడు 12 మిలియన్‌ ఎకరాల్లో రైతులు వరి సాగుచేయగా 26 మిలియన్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. రాష్ట్రంలో వరిసాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని, 220 రకాల విత్తనాలు రాష్ట్రంలో సాగులో ఉన్నాయని, ఇందులో 60 శాతం ముతక రకాలు, 40 శాతం ఫైన్‌, సూపర్‌ ఫైన్‌ వెరైటీలు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల వరిసాగును ప్రోత్సహించేందుకు ఈ సీజన్‌ నుంచి క్వింటాకు రూ. 500 బోనస్‌ ప్రకటించిందని వెల్లడించారు. ఇంటర్నేషనల్‌ కమోడిటీ ఇనిస్టిట్యూట్‌ (ఐసీఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్‌ రైస్‌ సమ్మిట్‌-2024లో పాల్గొని మంత్రి తుమ్మల మాట్లాడారు.


తెలంగాణ నుంచి ఫిలిప్పైన్స్‌ అమెరికా, బంగ్లాదేశ్‌, యూఏఈ, ఉత్తర కొరియా దేశాలకు బియ్యం ఎగుమతి అవుతోందని చెప్పారు. సోనామసూరి, సాంబమసూరి, హెచ్‌ఎంటీ, ఎంటీయూ- 1010, ఐఆర్‌- 64, జేజీఎల్‌ వెరైటీలకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంద న్నారు. తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉండే సూపర్‌ ఫైన్‌ రకమైన తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌- 15048) దేశావ్యాప్తంగా ఆదరణ పొందిందని, 6 మి.మీ కంటే ఎక్కువ పొడవు ఉన్న విత్తనాలకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని చెప్పారు. దేశీయ, విదేశీ మార్కెట్‌కు అనువైన రకాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. స్వాతంత్ర్యానంతరం మన దేశంలో బియ్యం ఉత్పత్తి సుమారు 8 రెట్లు పెరిగి 14 కోట్ల మెట్రిక్‌ టన్నులకు చేరుకుందని, ప్రపంచ మార్కెట్లో 45 శాతం వాటాను భారతదేశం కలిగిఉందని అన్నారు.


ధాన్యం ఉత్పత్తికి అవసరమైన వనరులు, టెక్నాలజీ ఉన్నప్పటికీ.. వ్యవసాయ సంక్షోభం నేటికి పెద్ద సవాలుగా మారిందని, ధరను నిర్ణయించటంలో కూడా మార్కెటింగ్‌ సమస్యలు ఉన్నాయని తుమ్మల ఆందోళన వ్యక్తంచేశారు. మెరుగైన మార్కెట్‌ ధర, రైతులకు ప్రయోజనం కలిగించటానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు. బియ్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులు, వరి శాస్త్రవేత్తలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు, ఎగుమతి మార్కెట్‌ను విస్తృతం చేయటానికి ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ దోహదపడుతుందని తుమ్మల పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, మిల్లర్లు, ప్రగతిశీల రైతులు... ఇతర దేశాల్లో అనుసరించే విధానాలు ధాన్యం ఉత్పత్తి, మిల్లింగ్‌ పద్ధతులు, స్టోరేజీ టెక్నాలజీ, కాలుష్య నియంత్రణ తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.


ఎరువులు, సబ్సిడీలకు ప్రోత్సాహం: ఉత్తమ్‌

రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు అందిస్తూ పంటల సాగును ప్రోత్సహిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఏడాదిలో 2 పంటలు, కొన్నిచోట్ల 3 పంటలు కూడా పండిస్తారని తెలిపారు. దేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ‘రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ ఏడాది 265 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించిందని ఉత్తమ్‌ తెలిపారు.


రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కుతోపాటు ఆహారభద్రతను కూడా హక్కుగా పరిగణిస్తారని మంత్రి అన్నారు. పేదలకు ఉచిత బియ్యం, సబ్సిడీపై ఆహారధాన్యాల పంపిణీ ఇందులో భాగమేనని అన్నారు. రక్తహీనత ఇతరత్రా సమస్యలకు పరిష్కారంగా ఫోర్టిఫైడ్‌ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్‌ ఛైర్మన్‌ జి. చిన్నారెడ్డి, టీఎ్‌సఎ్‌సడీసీ ఛైర్మన్‌ సుంకెట అన్వే్‌షరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 04:22 AM