Share News

Hyderabad: టీపీసీసీ కొత్త చీఫ్‌ ఎవరో..

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:05 AM

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్‌ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.

Hyderabad: టీపీసీసీ కొత్త చీఫ్‌ ఎవరో..

  • పార్టీ అధ్యక్ష పదవి బరిలో ముఖ్య నేతలు

  • కీలకంగా మారనున్న సామాజిక సమీకరణాలు

  • బీసీలకు పదవి కేటాయించే అవకాశం

  • రేసులో పొన్నం, మధుయాష్కీ, సురేష్‌ షెట్కార్‌

  • పరిశీలనలో సీతక్క, బలరాంనాయక్‌ పేర్లు

  • ‘మాదిగ’ కోటాలో సంపత్‌కుమార్‌ యత్నాలు

  • పీసీసీ చీఫ్‌పై నిర్ణయం తర్వాతే మంత్రివర్గ విస్తరణ

హైదరాబాద్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి కొత్త సారధి నియామకానికి కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియడం, ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్‌ రెడ్డి పదవీ కాలం కొద్దిరోజుల్లో ముగియనుండడంతో టీపీసీసీ నూతన చీఫ్‌ నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఈ నెల చివరి వారంలోగా కొత్త సారధిని నియమించాలని భావిస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి కొత్త చీఫ్‌ నియామకంపై అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే, అధ్యక్ష పదవి రేసులో చాలా మంది నేతలు ఉండగా సామాజిక వర్గ సమీకరణాలు కీలకం కానున్నాయి. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించడం అధిష్ఠానం ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ బీసీ కార్డును వాడుతుండటమే ఇందుకు కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, ఎంపీ సురేష్‌ షెట్కార్‌ పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. అలాగే, రాష్ట్రంలో ఎస్టీ జనాభా పది శాతానికి పైగా ఉన్న నేపథ్యంలో అధ్యక్ష పదవిని ఆ వర్గానికి కేటాయిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుందని చెబుతున్నారు. దీంతో మంత్రి సీతక్క లేదా ఎంపీ బలరాంనాయక్‌కు పదవి కేటాయించే ప్రతిపాదనపై చర్చ జరుగుతోందని సమాచారం. టీపీసీసీ చీఫ్‌ పదవిని ఎస్టీకి కేటాయిస్తే, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇస్తారని అంటున్నారు. మరోపక్క, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో తమకు అన్యాయం జరగడంతో ప్రభుత్వ, పార్టీ పదవుల్లో న్యాయం చేయాలని మాదిగ సామాజికవర్గ నేతలు కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఆ వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో జగ్గారెడ్డి పేరు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జగ్గారెడ్డి మంచి ఆర్గనైజర్‌ అంటూ రాహుల్‌గాంధీ ప్రశంసించడమే ఇందుకు కారణం.


ఒకరికి ఒకే పదవి నిబంధన అమలైతే...!

ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎక్కువ మందికి ప్రాతినిధ్యం కల్పించడం కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆలోచనగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరికి ఒకే పదవి నిబంధనను అమలు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క.. ఏ పదవిని ఎంచుకుంటారు అనే చర్చ జరుగుతోంది. ఇక, ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలవ్వడం మధుయాష్కీగౌడ్‌కు అధ్యక్ష పదవి రేసులో లోపం కాగా.. రాహుల్‌గాంధీ కుటుంబం, అధిష్ఠానం, రేవంత్‌ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం సానుకూల అంశాలు. టీపీసీసీ చీఫ్‌గా బీసీతో పాటు ఎంపీ పోస్టునూ అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటే సురేష్‌ షెట్కార్‌కు కలిసి రావొచ్చు. అయితే లింగాయత్‌ సామాజికవర్గం రాష్ట్రంలో ప్రభావితం చూపే స్థాయిలో లేకపోవడం ఆయనకు ప్రతికూలాంశం. మంత్రి పదవిని వదులుకునేందుకు సీతక్క విముఖత ప్రదర్శిస్తే ఎస్టీ లంబాడా కింద బలరాం నాయక్‌ను పదవి వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సీఎం రేవంత్‌కు సన్నిహితుడు కావడం బలరాంనాయక్‌కు సానుకూలాంశం.


ఆ నియామకం తర్వాతే విస్తరణ

టీపీసీసీ చీఫ్‌ నియామకం తర్వాతే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బడ్జెట్‌ సమావేశాలకు కొద్ది రోజుల ముందు లేదా సమావేశాల తర్వాత విస్తరణ చేపడతారని అంటున్నారు. కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకమూ మంత్రివర్గ విస్తరణతో పాటే ఉంటుందనీ చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్‌గా మంత్రుల్లో ఒకరిని తీసుకుంటే.. ఆ స్థానానికి మరొకరిని ఎంపిక చెయ్యాలి. అలాగే సామాజిక వర్గ సమకూర్పులో టీపీసీసీ చీఫ్‌ సామాజిక వర్గాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ఒకరికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కల్పించాలంటే దానికీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే బీఆర్‌ఎస్‌ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలా వచ్చే వారిలో కొందరికి మంత్రి వర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్‌ నియామకం తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


కాంగ్రె్‌సలోకి రండి..!

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి దానం పిలుపు

  • సీఎంతో మాట్లాడి గౌరవం దక్కేలా చూస్తానని హామీ

బంజారాహిల్స్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రాజకీయ మనుగడ సాధించేందుకు కాంగ్రె్‌సలో చేరాలని మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పిలుపినిచ్చారు. ఆత్మాభిమానం చంపుకొని బీఆర్‌ఎ్‌సలో ఉండే కన్నా కాంగ్రె్‌సలోకి వచ్చి గౌరవంగా ఉండాలన్నారు. ‘పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎ్‌సను వ్యతిరేకించారు. ఎమ్మెల్యేలు ఎంత పనిచేసినా ప్రజలు ఓటేయలేదు. సికింద్రాబాద్‌లో పద్మారావుగౌడ్‌కు కనీసం డిపాజిట్‌ దక్కలేదు. ఇలాంటి తరుణంలో రాజకీయంగా ఎదగడానికి, ప్రజాసేవ చేసేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. కాంగ్రె్‌సలో చేరే అంశంపై ఆలోచించుకోవాలి. కాంగ్రె్‌సలో చేరాలనుకునే ప్రతి శాసనసభ్యుడికి తగిన గౌరవం దక్కేలా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడే బాధ్యతను తీసుకుంటా..’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 08 , 2024 | 03:05 AM