Share News

TS Elections: రూ.300 కోట్ల ఆస్తి ఉన్నా.. రంజిత్‌రెడ్డికి కారు లేదు!

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:13 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కానీ ఆయనకు సొంత కారు లేదు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం..

TS Elections: రూ.300 కోట్ల ఆస్తి ఉన్నా.. రంజిత్‌రెడ్డికి కారు లేదు!

రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థి రంజిత్‌రెడ్డికి సుమారు రూ.300 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కానీ ఆయనకు సొంత కారు లేదు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. రంజిత్‌రెడ్డి పేరిట రూ.158.81కోట్లు, ఆయన భార్య సీతాదేవి పేరున రూ.135.52 కోట్లు, కుమారుడు రాజార్యన్‌రెడ్డి పేరున రూ.14.17లక్షల విలువ చేసే ఆస్తులున్నాయి. రంజిత్‌రెడ్డి పేరిట రూ.37.83లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, సతీమణి పేరున రూ.1.59కోట్ల విలువ చేసే బంగారు/వజ్రాభరణాలున్నాయి. ఇక ఆయన చేతిలో రూ.1.39లక్షలు, సతీమణి చేతిలో రూ.48,182 నగదు ఉంది. వివిధ బ్యాంకుల్లో రంజిత్‌రెడ్డి పేరిట రూ.20.39కోట్లు, ఆయన భార్య పేరున రూ.2.62కోట్లు అప్పులు ఉన్నాయి. తనపై ఓ క్రిమినల్‌ కేసు ఉన్నట్టు వెల్లడించారు.

‘కాసాని’ ఆస్తులు రూ.15.12కోట్లు

చేవెళ్ల పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ కుటుంబానికి రూ.15.12కోట్లు విలువైన ఆస్తులున్నాయి. ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం.. కాసాని పేరిట రూ.3.16కోట్లు, అతని సతీమణి పేరిట రూ.11.95కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే, రూ.30 లక్షల అప్పు ఉన్నట్టు తెలిపారు. జ్ఞానేశ్వర్‌ దంపతుల వద్ద 120తులాల బంగారు ఆభరణాలున్నాయి. కాసాని పేరిట సొంతంగా వాహనాలు లేవు, కానీ ఆయన సతీమణి పేరిట నాలుగు కార్లు ఉన్నాయి. కాసానికి మొత్తం 50.2 ఎకరాల వ్యవసాయ భూములు, బాచుపల్లిలో 6.28 ఎకరాలు, గాజులరామారంలో 1.05ఎకరాలు, ఖానామెట్‌లో 18 గుంటలు, చందానగర్‌లో 2.1 ఎకరాల వ్యవసాయేతర భూములున్నాయి. గుట్టల బేగంపేట్‌లో రెండు వాణిజ్య భవనాలు, అమీర్‌పేట, బాచుపల్లిలో నివాస గృహాలు ఉన్నాయి.

కంచర్ల కృష్ణారెడ్డికి అప్పులు నిల్‌

నల్లగొండ, ఏప్రిల్‌ 23: బీఆర్‌ఎస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పేరిట రూ.82.60 కోట్ల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. ఆయన భార్య పేరిట సుమారు రూ.1.06 కోట్లు ఆస్తులు ఉన్నాయి. కృష్ణారెడ్డికి ఎలాంటి అప్పులు లేవు. కృష్ణారెడ్డి వద్ద రూ.88 వేలు, ఆయన భార్య వద్ద రూ.18,600 నగదు ఉంది. అలాగే, కృష్ణారెడ్డి పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.96 లక్షల డిపాజిట్టు ఉండగా, ఆయన సతీమణి పేరిట రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. రూ.34లక్షలకు పైగా విలువైన రెండు వాహనాలు ఉన్నాయి. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల, మరికొన్ని చోట్ల వ్యవసాయ భూములు, స్థలాలు ఉన్నాయి.

రఘురాంరెడ్డి ఆస్తి 58కోట్లు, అప్పులు 9.54 కోట్లు

ఖమ్మం, ఏప్రిల్‌23(ఆంధ్రజ్యోతి): పార్టీ అధిష్ఠానం ప్రకటించకముందే ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన రామసహాయం రఘురాంరెడ్డికి రూ.58.27కోట్ల విలువైన ఆస్తులు, రూ.9.54 కోట్ల అప్పులు ఉన్నాయి. రఘురాంరెడ్డికి ఉన్న రూ.58.27కోట్ల ఆస్తుల్లో రూ.13.78 కోట్లు హిందు అవిభాజ్య కుటుంబ ఆస్తులు ఉన్నాయి. ఆయన పేరు మీద రూ.28.16కోట్ల చరాస్తులు, రూ.16.33కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. రూ.9.54కోట్లు అప్పుల్లో రఘురాంరెడ్డి పేరిట 9.23కోట్లు, అవిభాజ్య కుటుంబ అప్పు 31లక్షలు ఉన్నాయి.

మాలోతు కవిత కుటుంబ ఆస్తి రూ.4.97 కోట్లు

మహబూబాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ మాలోతు కవిత కుటుంబానికి రూ.4.97 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. నగదు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు, వాహనాలు, బంగారం, ఇళ్లు అన్నీ కలిపి కవిత పేరిట రూ.4.15కోట్లు ఆస్తులున్నాయి. ఆమెభర్త భద్రునాయక్‌ పేరిట కారు, బంగారం, నగదు, బ్యాంకులో నగదు మొత్తం రూ.41.75లక్షలు, కుమార్తె మహతి పేరిట రూ.21.65లక్షలు, కుమారుడు నయన్‌ పేరిట రూ.18.78లక్షల ఆస్తులు ఉన్నాయి. అలాగే వారికి రూ.10.05 లక్షలు అప్పులున్నాయి.

Read Latest Telangana News And Telugu News


Updated Date - Apr 24 , 2024 | 01:25 PM