Share News

Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:19 AM

ఖమ్మం స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. ఈ మేరకు అధిష్ఠానానికి తెలియజేసినప్పటికీ.. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా, సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Lok Sabha Polls 2024: ఖమ్మం బరిలో ప్రియాంక?

  • అవకాశాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం

  • రాయ్‌బరేలీ, ఖమ్మం.. రెండు స్థానాల నుంచీ పోటీ!

  • అన్ని ప్రత్యామ్నాయాలపైనా పార్టీ పెద్దల కసరత్తు

  • రాష్ట్రంలో మూడు సీట్లపై కొనసాగుతున్న పంచాయితీ

  • కేరళకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి.. కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకేనని ప్రచారం

  • నేడు ఢిల్లీకి వెళ్లే అవకాశం.. అక్కడ ఖమ్మం అభ్యర్థిపై తుది నిర్ణయం?


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రోజుకో మలుపు తిరుగుతున్న ఖమ్మం సీటు పంచాయితీ.. చివరికి అనూహ్యమైన మలుపు తీసుకోనుందా? అక్కడి నుంచి కాంగ్రెస్‌ (Congress) అధిష్ఠానం ఏకంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీనే బరిలోకి దింపే అవకాశం ఉందా? ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్రంగా నడుస్తున్న చర్చ ఇది. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ తప్ప మిగిలిన వాటికి కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో ఖమ్మం (Khammam) స్థానంపై తొలి నుంచీ చర్చ జరుగుతోంది. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్న ఈ స్థానం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలనే ప్రతిపాదన రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి తొలుత బలంగా ముందుకు వచ్చింది. ఈ మేరకు అధిష్ఠానానికి తెలియజేసినప్పటికీ.. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. పైగా, సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు.


దీంతో స్థానిక అభ్యర్థులు ఖమ్మం టికెట్‌ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే, అనూహ్యంగా మళ్లీ గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక పేరు తాజాగా ముందుకు రావటం విశేషం. ప్రియాంక పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రియాంక ఖమ్మం నుంచి పోటీ చేయటం అనేది.. రాహుల్‌ పోటీ చేసే స్థానాలపై ఆధారపడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. వయనాడ్‌ నుంచి సిటింగ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ ఇప్పటికే ఆ స్థానంలో నామినేషన్‌ వేశారు.


వయనాడ్‌తోపాటు యూపీలోని అమేథీ నుంచి కూడా రాహుల్‌ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఉత్తరాది, దక్షిణాది రెండింటి నుంచీ రాహుల్‌ పోటీ చేసినట్లవుతుంది. ప్రియాంకను కూడా ఇదే తరహాలో ఉత్తరాది, దక్షిణాదిల్లోని రెండు స్థానాల నుంచి బరిలో దించాలని.. యూపీలోని రాయ్‌బరేలీ, ఖమ్మంల నుంచి ఆమెను పోటీ చేయించాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ రాహుల్‌ వయనాడ్‌కు మాత్రమే పరిమితమైతే.. ప్రియాంక యూపీలోని అమేధీ, రాయ్‌బరేలీల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ పడతారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. తద్వారా ఉత్తరాది నుంచి ప్రియాంక ప్రాతినిధ్యం వహిస్తే.. దక్షిణాది నుంచి రాహుల్‌ ప్రాతినిధ్యం ఉంటుందని పేర్కొన్నాయి.


ఢిల్లీలో తేలుతుందా?

ప్రియాంక పోటీ ప్రతిపాదన అటుంచితే.. ఖమ్మం సీటుపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సీటు నుంచి పార్టీ టికెట్‌ కోసం రఘురామిరెడ్డి, రాయల నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఖమ్మంతో పాటు కరీంనగర్‌, హైదరాబాద్‌ సీట్లనూ కాంగ్రెస్‌ పెండింగ్‌లోనే ఉంచింది. అయితే కరీంనగర్‌లో వెలిచాల రాజేశ్వర్‌రావు తరహాలోనే ఖమ్మంలో మంగళవారం రఘురామిరెడ్డి కూడా అధిష్ఠానం పేరు ప్రకటించనప్పటికీ నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు, మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళకు వెళ్లారు.


ఓ పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్లారని చెబుతున్నా.. ఖమ్మం సీటు విషయమై ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకే వెళ్లారన్న ప్రచారమూ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే సమృద్ధ భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం జరగనున్న సామాజిక న్యాయ్‌ సమ్మేళన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాహుల్‌గాంధీతో పాటు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌లను ఆహ్వానించారు. దీంట్లో పాల్గొనేందుకు భట్టివిక్రమార్క ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని, అక్కడే ఖమ్మం సీటుపైన అధిష్ఠానం పెద్దలు తేల్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 11:43 AM