Share News

Medigadda barrage: మార్చి-01న ఛలో మేడిగడ్డ.. పిలుపునిచ్చిన కేటీఆర్..

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:21 PM

BRS Calls Chalo Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Lift Irrigation Project) కూల్చే కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress) నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగా ‘ఛలో మేడిగడ్డ’కు పిలుపునిచ్చారు కేటీఆర్. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

Medigadda barrage: మార్చి-01న ఛలో మేడిగడ్డ.. పిలుపునిచ్చిన కేటీఆర్..
BRS Calls Chalo Medigadda

హైదరాబాద్, ఫిబ్రవరి 27: కాళేశ్వరం ప్రాజెక్టును(Kaleshwaram Lift Irrigation Project) కూల్చే కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress) నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). ఇందులో భాగంగా ‘ఛలో మేడిగడ్డ’కు పిలుపునిచ్చారు కేటీఆర్. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీలు కొట్టుకుపోవాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డకు తక్షణమే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుల వల్లే పాతాళ గంగ పైకి వచ్చిందని.. ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణకు నీరు కావాలంటే ఎత్తి పోయాల్సిందేనని కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితి అలా ఉందని, మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇంజినీర్స్ చెప్పారు కాబట్టే ఎత్తి పోతలకు డిజైన్ చేశామని కేటీఆర్ వివరించారు. ఖర్చులు లాభాల లెక్కలు వేస్తే హాస్పిటల్స్, ఐఐటిలు కట్టోద్దని వ్యాఖ్యానించారు.

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీళ్లు రాకుండానే తెలంగాణ భూముల ధరలు పెరిగాయా? అని ప్రశ్నించారు. అసలు పనిని తాము చేశామని.. మిగిలిపోయిన కొసరు పని చేయకుండా తమను బద్నాం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.

మార్చ్ 1న ఛలో మేడిగడ్డ..

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించిన కేటీఆర్.. మార్చ్ 1వ తేదీన ‘ఛలో మేడిగడ్డ’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ రోజున ఉదయం 8 గంటలకు 200 మందితో మేడిగడ్డకు వెళ్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలందరితో కలిసి దశల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామని చెప్పారు. అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ తెలిపారు.

మాపై కోపం రైతులపై చూపొద్దు..

దురదృష్టవశాత్తు రెండు పియర్స్ కు పగుళ్లు వచ్చాయని.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు కేటీఆర్. బెంగాల్‌లో పరక్క బ్యారేజ్ కూలిందని గుర్తు చేశారు. తెలంగాణలో కడెం ప్రాజెక్టు, సింగూరు, మూసి గేట్లు కొట్టుకుపోయాయని, గుండ్ల వాగు ప్రాజెక్ట్ సైతం కొట్టుకు పోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. గుజరాత్‌లో మచ్చు ప్రాజెక్ట్ కూలిపోతే 2వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో మూడు పియర్స్ కుంగితే సరి చేయొచ్చనని కేటీఆర్ చెప్పారు. మేడిగడ్డలో కాపర్ డ్యామ్ కట్టి రీపేర్ చేయొచ్చన్నారు. మేడిగడ్డపై విచారణ చేయాలని.. బాధ్యులు పై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పునరుద్ఘాటించారు. తమ మీద ఉన్న కోపాన్ని రైతులపై చూపొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. చిన్న ప్రమాదాన్ని భూతద్దంలో చూపి పొలిటికల్ మైలేజి పొందే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవుచెప్పారు.

ఇచ్చిన బిల్డప్ చాలు..

కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ పేరుతో ఇచ్చిన బిల్డప్ చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ చురకలంటించారు. ముందు చేయాల్సిన పని చేయండని ప్రభుత్వ పెద్దలకు హితవుచెప్పారు. కాగ్ రిపోర్ట్ భగవద్గీత కురాన్, బైబిల్ కాదని గత కాంగ్రెస్ పాలకులే చెప్పారని పేర్కొన్నారు. ‘ఛలో మేడిగడ్డ’ కార్యక్రమానికి కాంగ్రెస్ వాళ్లు వస్తానంటే వాళ్లను కూడా తీసుకెళ్తామన్నారు.

కేసీఆర్ రారు..

కాగా, ‘ఛలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రావడం లేదని చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ విజిట్ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పారు. ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ నేతల ‘ఛలో మేడిగడ్డ’ కార్యక్రమానికి అవసరమైతే అనుమతి తీసుకుంటామని చెప్పారు కేటీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 27 , 2024 | 12:44 PM