Share News

Hyderabad: హైదరాబాద్‌-విజయవాడ హైవేను విస్తరించాలి..

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:49 AM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ రాజధాని అమరావతి దాకా గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను అభివృద్ధి చేయాలని.. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేదా ఎనిమిది లేన్ల హైవేగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు.

Hyderabad: హైదరాబాద్‌-విజయవాడ హైవేను విస్తరించాలి..

  • హైదరాబాద్‌-అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్‌

  • జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలి

  • కోలుకునేదాకా ఏపీకి సాయం చేయాలి

  • మోదీ, షాకు ఏపీ సీఎం చంద్రబాబు వినతి

  • ఏపీ పునర్నిర్మాణానికి చేయూత: మోదీ

  • రేపు రేవంత్‌-చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ రాజధాని అమరావతి దాకా గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను అభివృద్ధి చేయాలని.. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేదా ఎనిమిది లేన్ల హైవేగా మార్చాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. అలాగే.. ఏపీ జెన్‌కో, తెలంగాణ డిస్కమ్‌ల మధ్య ఉన్న ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. గురువారం అక్కడ ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సహా ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీ పునర్నిర్మాణానికి చేయూతనివ్వాలని అభ్యర్థించారు. గత ఐదేళ్లలో ఆర్థికంగా అస్తవ్యస్తమై, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని.. రాష్ట్రం కోలుకునేంతవరకూ ఆర్థిక సహకారం అందించాలని ప్రధాని మోదీని కోరారు.


నిధుల నిర్వహణలో గత ప్రభుత్వం తీవ్ర అక్రమాలకు పాల్పడినందువల్ల ఏపీంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా చేయూతనివ్వడంతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంపూర్ణ సహకారం, రాజధాని అమరాతిలో ప్రభుత్వ సముదాయాలు, మౌలిక సదుపాయాల పూర్తికి సమగ్ర ఆర్థిక మద్దతు.. పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు, రోడ్లు, వంతెనలు, నీటిపారుదల, తాగునీటి ప్రాజెక్టుల వంటి అత్యవసర రంగాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి వ్యయం కోసం ప్రత్యేక సాయం కింద అదనపు కేటాయింపులు, బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీ త రహాలో వెనుకబడినప్రాంతాలకు మద్దతు, దుగరాజపట్నం రేవు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అభ్యర్థించారు. విభజన కంటే గడిచిన ఐదేళ్లలో జగన్‌ పాలన వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరుల లోటు తీవ్రంగా ఉందని ప్రధానికి వివరించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనిస్తేనే ఈ సవాళ్లను ఎదుర్కోగలమని పేర్కొన్నారు.


చంద్రబాబు విజ్ఞప్తికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడతామని.. రాజధాని అమరావతి సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. అలాగే.. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌గడ్కరీ, ఖట్టర్‌, పీయూ్‌షగోయల్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, హర్దీప్‌ సింగ్‌పురీ.. ఏపీ పునర్నిర్మాణానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అమిత్‌ షా, చంద్రబాబు దాదాపు అరగంట సేపు కీలక సమాలోచనలు జరిపారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అనేక అంశాలను చంద్రబాబుతో చర్చించానని హోం మంత్రి స్వయంగా ట్వీట్‌ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం వికసిత్‌ భారత్‌తో పాటు వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌కు కట్టుబడి ఉందని తెలిపారు. కాగా.. చంద్రబాబు శుక్రవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, జేపీ నడ్డా, రాందాస్‌ అథవాలేతో పాటు నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం, జపాన్‌ రాయబారి సుజుకి హిరోషీని కలుస్తారు.


నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

  • ఘన స్వాగతానికి టీడీపీ ఏర్పాట్లు

  • బేగంపేట నుంచి భారీ ఊరేగింపు

హైదరాబాద్‌, రాంనగర్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు వస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం వరకు వేలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించనున్నారు. పలుచోట్ల పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలతో పాటు బతుకమ్మ, బోనాలు, డీజేలను సిద్ధం చేశారు. టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ను అలంకరించారు. కాగా, శనివారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా బాబు నివాసం నుంచి భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని, ఘనంగా సన్మానించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.


మరోవైపు అధినేతతో టీటీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఉండనుంది. ముఖ్య నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించి వారి నుంచి అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగానే తెలంగాణలో టీడీపీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై బాబు దిశా నిర్దేశం చేస్తారు. కాగా, హైదరాబాద్‌తో చంద్రబాబుకు ప్రత్యేక అనుబంధం ఉందని.. నగరంతో పాటు తెలంగాణలో ఆయన చేసిన అభివృద్ధి ఆనవాళ్లు ఎప్పటికీ కనిపిస్తాయని టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.అరవింద్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. కాగా, చంద్రబాబుకు చరిత్రలో నిలిచిపోయేలా స్వాగ తం పలుకుతామని టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి తెలిపారు.


చంద్రబాబు పర్యటన తో పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొందని అధికార ప్రతినిధి సూర్యదేవర లత చెప్పారు. ఫిరాయింపుల దుష్ట సంప్రదాయాన్ని కేసీఆర్‌ ప్రోత్సహించారని.. ఇప్పుడు దానికే బీఆర్‌ఎస్‌ బలవుతోందని రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌.దుర్గాప్రసాద్‌ అన్నారు. కొంతమంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని, టీడీపీ నుంచి వెళ్లినవారిని తిరిగి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధిని తర్వాత వచ్చిన పాలకులు కొనసాగించారని ప్రకటించి చంద్రబాబు రాజ నీతిజ్ఞత ప్రదర్శించారని అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎ.ఎ్‌స.రావు అన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 04:49 AM