Share News

Gautam Gambhir: పేరుకే వివాదాస్పద మనిషి.. కానీ మనస్సు మాత్రం బంగారం

ABN , Publish Date - Jan 23 , 2024 | 11:22 AM

గౌతం గంభీర్. ఈ పేరు వినగానే టీమిండియాకు గంభీర్ అందించిన రెండు ప్రపంచకప్‌లతోపాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాలను కూడా సంపాదించుకున్నాడు.

Gautam Gambhir: పేరుకే వివాదాస్పద మనిషి.. కానీ మనస్సు మాత్రం బంగారం

ఢిల్లీ: గౌతం గంభీర్. ఈ పేరు వినగానే టీమిండియాకు గంభీర్ అందించిన రెండు ప్రపంచకప్‌లతోపాటు ఆయన అగ్రెసివ్ ప్రవర్తన కూడా గుర్తుకొస్తుంది. తన ఆటతో ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో అదే స్థాయిలో వివాదాలను కూడా సంపాదించుకున్నాడు. అందుకే గంభీర్‌ను విపరీతంగా అభిమానించే వారితోపాటు విమర్శించే వారు కూడా ఉంటారు. ఎవరు ఏమన్నా గంభీర్ వెనక్కి తగ్గే మనిషి కాదు. తనకు నచ్చింది చేసుకుంటూ పోతాడు. ముఖ్యంగా ముక్కుసూటి మనిషి. తనకు మంచి అనిపించింది చేస్తాడు. అందుకోసం అవసరమైతే ఎదురుగా ఉన్నది ఎంతటి వారైనా సరే వారితో గొడవకు దిగుతాడు. క్రికెట్‌లోనే కాదు ప్రస్తుతం రాజకీయాల్లోనూ గంభీర్ ఇదే తీరును కనబరుస్తున్నాడు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో గంభీర్ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడిగా కూడా ఉన్న గంభీర్ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టాడు. ఈ క్రమంలోనూ గంభీర్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నాడు.


సోమవారం అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సెక్స్ వర్కర్లకు గంభీర్ చీరలు, శాలువాలు పంచాడు. ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఉండే సెక్స్ వర్కర్లకు గంభీర్ చీరలు, శాలువాలు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ పని చేయడానికి ఇంతకంటే మంచి రోజు మరొకటి లేదని గంభీర్ పేర్కొన్నాడు. రాముడి సూత్రాలను పాటించడం చేయడం ద్వారా దేశం అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని గంభీర్ నొక్కిచెప్పాడు. "ఈ రోజు రాముడు వచ్చాడు. రామమందిరం ప్రారంభోత్సవం జరిగింది. కాబట్టి ప్రతి భారతీయుడికి అభినందనలు తెలియజేస్తున్నాను. రాముడు అందరికీ చెందినవాడు. ఈ రోజు మనం సమాజంలో భాగమైన మహిళలకు చీరలు, శాలువాలు పంపిణీ చేసాము. ఈ రోజు వారికి(సెక్స్ వర్కర్లు) కూడా పండుగ. రాముడు వారికి కూడా చెందుతాడు. నాకు ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదు. ఈ రోజు నేను ఇవ్వాలనుకుంటున్న అతి పెద్ద సందేశం ఏమిటంటే.. శ్రీరాముడి ఆదర్శాలైన మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యం. అప్పుడే ఈ దేశం పురోగతి చెందుతుంది" అని గంభీర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా కూడా ఉన్న గౌతం గంభీర్ సోమవారం నాటి బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

కాగా సేవా కార్యక్రమాలు చేపట్టడం గంభీర్‌కు ఇదే కొత్తేం కాదు. గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి తన మంచి మనసును చాటుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో 5 లక్షల మందికి ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశాడు. అంతేకాకుండా 5 వేల పీపీఈ కిట్లు, 40 వేల మాస్కులను కూడా పంచాడు. దీంతో గంభీర్ వివాదాస్పద మనిషిగా పేరు ఉన్నప్పటికీ, మనస్సు మాత్రం బంగారం అని అభిమానులు అంటున్నారు. కాగా 13 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గంభీర్ టీమిండియాకు అనేక విజయాలు అందించాడు. జట్టులో ఓపెనర్లుగా సచిన్, సెహ్వాగ్, గంగూలీ వంటి దిగ్గజ ఆటగాళ్ల హవా కొనసాగుతున్న సమయంలోనూ తనదైన ముద్ర వేశాడు. జట్టుకు కీలక ఓపెనర్‌గా, వన్ డన్ బ్యాటర్‌గా మారాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన టీమిండియా బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా 58 టెస్టుల్లో 4,154 పరుగులు, 147 వన్డేల్లో 5,238 పరుగులు, 37 టీ20ల్లో 932 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 20 సెంచరీలు సాధించాడు. అందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 23 , 2024 | 11:22 AM