Share News

Republic Day 2024 గణతంత్ర వేడుకల్లో మహిళలదే హవా.. చరిత్ర సృష్టించిన నారీ శక్తి..

ABN , Publish Date - Jan 26 , 2024 | 03:23 PM

Republic Day 2024 parade dazzled by cultural extravaganza celebrating 'women power' with pride Naik

Republic Day 2024 గణతంత్ర వేడుకల్లో మహిళలదే హవా.. చరిత్ర సృష్టించిన నారీ శక్తి..

దిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. అతిరథ మహారథుల మధ్య వివిధ రంగాలు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సారి నారీశక్తి పేరుతో త్రివిధ దళాలు చేపట్టిన కవాతు చూపుతిప్పుకోకుండా చేశాయి. వివిధ రాష్ట్రాలు ప్రదర్శించిన శకటాలు.. ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలుగా నిలిచాయి. మహిళా శక్తి సాంస్కృతిక వ్యక్తీకరణ- సంకల్పం ద్వారా సాఫల్యం అనే థీమ్‌తో ఈ ప్రదర్శనలు జరిగాయి. చివరగా ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలందరికీ అభివాదం చేసి వేడుకలకు ముగింపు పలికారు.

1500 మంది నృత్యకారుల బృందం భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశాన్ని అందించింది. కూచిపూడి, కథక్, భరతనాట్యం, సత్రియా, మోహినిఅట్టం, ఒడిస్సీ, మణిపురి వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు బాలీవుడ్ స్టైల్ సహా మరో 30 రకాల జానపద నృత్య రీతులను ప్రదర్శించారు. 120 మంది నృత్యకారులు వివిధ గిరిజన, జానపద ప్రదర్శనలు ఇవ్వగా.. మరో 120 మంది నృత్యకారులు గుజరాత్, మణిపూర్, కేరళ, మహారాష్ట్ర సంప్రదాయంలో నృత్యాలు చేశారు. మొత్తంగా ఈ బృందంలో 199 మంది గిరిజన నృత్యం, 486 మంది జానపద నృత్యం, 399 మంది శాస్త్రీయ నృత్యం, 56 మంది బాలీవుడ్ డ్యాన్స్ కు ప్రాతినిథ్యం వహించారు.


త్రివిధ దళాలతో సెల్యూట్..

మూడు సర్వీసులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా సైనికుల బృందం గణతంత్ర దినోత్సవంలో కవాతు చేయడం ఇదే మొదటిసారి. సేవా తథా సహాయత అనే నినాదంతో పాల్గన్నారు. ఈ బృందానికి మిలటరీ పోలీస్ కెప్టెన్ సంధ్య నాయకత్వం వహించారు. కెప్టెన్ శ్రణ్య రావు, సబ్ లెఫ్టినెంట్ అన్షు యాదవ్, లెఫ్టినెంట్ సృష్టి రావు తమతమ రంగాలకు ప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తించారు. త్రివిధ దళాలతో పాటు స్కై డైవింగ్, అశ్వ, మోటార్ సైకిల్ విన్యాసాలూ చేశారు. వైమానిక దళంలో 450 మంది అగ్నిపథ్, 1100 మంది అగ్నివీర్ లు ఆర్మీలో వారి శిక్షణను పూర్తి చేసి వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఉత్తమ కవాతు బృందంగా..

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మహిళా ముగ్గురు సబార్డినేట్ ఆఫీసర్లతో పాటు 80 మంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొదటిసారిగా కర్తవ్య పథ్ లో కవాతు నిర్వహించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ శ్వేతా సింగ్ ఈ బృందానికి నేతృత్వం వహించారు. దిల్లీ పోలీసుల పూర్తి మహిళా టీం సైతం ఈ కవాతులో పాల్గొంది. ఈ బృందానికి అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేతా కె. సుగతన్ నాయకత్వం వహించారు. ఉత్తమ కవాతు బృందంగా ఢిల్లీ పోలీస్ బృందం 15 సార్లు ఎంపికైంది చివరగా 2021లో ఎంపికైంది.


చరిత్ర సృష్టించారు..

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ విభాగంలో ప్రఖ్యాత శాస్త్రవేత్త సునీతా జెనా మహిళా సాధికారతకు సారథ్యం వహించారు. శాస్త్రవేత్తలు పి లక్ష్మీ మాధవి, జె సుజనా చౌదరి, ఎ భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. DRDO అభివృద్ధి చేసిన వ్యవస్థల నమూనాలను ప్రదర్శించారు. ఇందులో MPATGM, AGNI-5, ASAT క్షిపణులు కీలకం. బాంబే ఇంజనీర్ గ్రూప్ అండ్ సెంటర్‌కు చెందిన ఆల్-మెన్ కంటెంజెంటుకు నాయకత్వం వహించిన భారత సైన్యంలోని మొదటి మహిళా అధికారిగా మేజర్ దివ్య త్యాగి చరిత్ర సృష్టించారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 03:24 PM