Share News

Revanth Vs Jagan: రేవంత్ సర్కార్‌పై వైసీపీ కుట్ర చేస్తోందా.. విజయసాయి మాటలకు అర్థమేంటి..!?

ABN , Publish Date - Feb 05 , 2024 | 09:49 PM

MP Vijayasai Sensational Comments: ‘అవును.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది..’ ఇవీ రాజ్యసభ వేదికగా ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్. ఈ మాటలు విన్న కాంగ్రెస్ ఎంపీలు నవ్వుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చే నడుస్తోంది...

Revanth Vs Jagan: రేవంత్ సర్కార్‌పై వైసీపీ కుట్ర చేస్తోందా.. విజయసాయి మాటలకు అర్థమేంటి..!?

‘అవును.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది..’ ఇవీ రాజ్యసభ వేదికగా ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్. ఈ మాటలు విన్న కాంగ్రెస్ ఎంపీలు నవ్వుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ సాయిరెడ్డి చిలకజోస్యం ఎప్పట్నుంచి మొదలెట్టారు..? రాజ్యసభకు పంపింది జోస్యాలు చెప్పడానికా..? మాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి వైసీపీ ఏమైనా కుట్ర చేసిందా..? అంటూ చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల కామెంట్స్ చూస్తే బహుశా సాయిరెడ్డికి నిద్ర రాదేమో.! ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకొచ్చింది..? ఎంపీ కామెంట్స్ వెనుక పెద్ద కథే ఉందా..? లేకుంటే ఫ్లోలో అనేశారా..? అనే విషయాలు ఇప్పుడీ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Vijayasai-In-Rajyasabha.jpg

అసలేం జరిగింది..?

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో సాయిరెడ్డి మాట్లాడారు. ‘తెలంగాణలో అబద్ధాలు చెప్పి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కుటుంబాల్ని చీల్చడం కాంగ్రెస్‌కు అలవాటు. కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం కాంగ్రెస్‌ డర్టీ పాలిటిక్స్‌కు ఉదాహరణ. కాంగ్రెస్‌ దుష్పరిపాలనకు ఏపీ పెద్ద బాధిత రాష్ట్రం. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఎప్పటికీ క్షమించరు. జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ కనుమరుగు కావడం ఖాయం’ అని విజయసాయి చెప్పుకొచ్చారు. చూశారుగా.. ఎంపీ మాటలు. కాస్త లోతుగా వెళితే సాయిరెడ్డి మాటలకు అర్థాలే వేరులే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. షర్మిల బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే ఒకప్పుడు వైఎస్ జగన్ వదిలిన బాణం అని చెప్పుకున్న ఆమె.. ఇప్పుడు రివర్స్ అన్నట్లుగా అన్నకే గుచ్చుకుంటోంది. షర్మిల ఈ మధ్య చేసిన ప్రసంగాలను చూస్తే క్లియర్ కట్‌గా ఇవన్నీ అర్థమవుతాయి. అందుకే కుటుంబ వ్యవహారంలో తలదూర్చడం అనే పదం సాయిరెడ్డి వాడారని అర్థం చేసుకోవచ్చు.


YS-SHARMILA-8.jpg

పెద్ద కథే ఉందిగా..!

వాస్తవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మంచి మిత్రులు. 2019 ఎన్నికల్లో జగన్‌ గెలుపునకు మూడోకంటికి తెలియకుండా సాయం చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం చేయాల్సినవన్నీ జగన్ చేసుకుంటూ వచ్చారు. ఆఖరికి పోలింగ్ రోజున నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఏపీ పోలీసులతో ఎంత రచ్చ చేయించారో కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందరూ అనుకున్నట్లే.. కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే.. తనకు కావాల్సిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఓడిపోవడంతో తీవ్ర అసంతృప్తి, నిరాశకులోనైన వైసీపీ కనీసం రేవంత్‌కు అభినందనలు కూడా చెప్పిన పాపాన పోలేదు.! నాటి నుంచి నేటి వరకూ తెలంగాణ రాజకీయాల గురించి కానీ.. వైసీపీ వాళ్లు ఎక్కడా సీరియస్‌గా మాట్లాడిన సందర్భాల్లేవ్. ఈ మధ్యనే నీటి పంపకాలు, నాగార్జున సాగర్ గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘అప్పుడు కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. రా జగన్’ అని ఒకింత సవాలే చేశారు. రేవంత్ తెలంగాణలో స్విచ్ వేస్తే.. వైసీపీ నేతలు ఏపీలో మాట్లాడలేక.. ఇలా సాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా తెలంగాణలో జరుగుతున్న విషయాలన్నింటిని నిశితంగా గమనించిన ఏపీ ప్రభుత్వం.. విజయసాయితో ఇలా మాట్లాడించిందనే వార్తలు వినవస్తున్నాయి.

cm-revanth-cabinet.jpg


కుట్ర చేస్తున్నారా..?

రేవంత్ సర్కార్ ముచ్చటగా మూడు నెలలు కూడా ఉండదు.. తప్పుకుండా కూలుతుందని బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకొచ్చినప్పుడల్లా చెబుతున్నారు. ఇప్పుడు ఇదే మాట పక్కనున్న ఏపీ నేతలు కూడా అంటుండటంతో బ్యాగ్రౌండ్‌లో ఏదో జరుగుతోంది..? బీఆర్ఎస్, వైసీపీ కలిసి కాంగ్రెస్‌ను కూల్చడానికి కుట్ర చేస్తున్నాయా..? అనే అనుమానాలు సమాన్యులకు సైతం వస్తున్నాయ్. సాయిరెడ్డి రాజ్యసభకు పంపింది ఇందుకేనా..? రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఒరగబెట్టడానికా..? ప్రభుత్వం కూలుతుందని జోస్యం చెప్పడానికా..? అని కాంగ్రెస్ శ్రేణులు నెట్టింట్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఇంతవరకూ కాంగ్రెస్ నేతలు గానీ.. రేవంత్ రెడ్డిగానీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.. స్పందిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి. ఇంద్రవెల్లి సభావేదికగా ప్రభుత్వం కూలుతుందన్న మాటలకు రేవంత్ రెడ్డి ఏ రేంజ్‌లో కౌంటరిచ్చారో మనందరం చూశాం. ఇప్పుడు సాయిరెడ్డికి దిమ్మదిరిగేలా కౌంటర్ ఎప్పుడిస్తారో అని కాంగ్రెస్ శ్రేణులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయ్. విజయసాయి కామెంట్స్ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో.. వేచి చూడాలి మరి.

Jagan-And-kcr.jpg

AP Elections 2024: ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే.. ఇది చూశాక వైఎస్ జగన్ ముఖచిత్రమేంటో..?

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 05 , 2024 | 09:55 PM