Share News

TS Politics : పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ పోటీ.. పరిశీలనలో రెండు కీలక నియోజకవర్గాలు..!!

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:50 PM

Telangana Parliament Elections తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS) పార్టీ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకొని ‘కారు’కు పూర్తిగా పంక్చర్ కాలేదని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది..

TS Politics : పార్లమెంట్ ఎన్నికల్లో కేటీఆర్ పోటీ.. పరిశీలనలో రెండు కీలక నియోజకవర్గాలు..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS) పార్టీ.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకొని ‘కారు’కు పూర్తిగా పంక్చర్ కాలేదని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress Govt) నెలరోజుల పాలనలో చేసిందేమీ లేదని.. రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పే ప్రయత్నంలో చేయాల్సినవన్నీ గులాబీ నేతలు చేస్తున్నారు. మొత్తం 17 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేరుగా రంగంలోకి దిగారు. రెండ్రోజులకో పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించడం.. అక్కడుండే ఎమ్మెల్యేలు, సిట్టింగులు, ద్వితియ శ్రేణి నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజిబిజీగా గడుపుతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇక బీజేపీ హైకమాండ్ అయితే.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉన్న పెద్దలందరూ రాష్ట్రంలో పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ త్రిముఖ పోరులో ఎవరి లెక్కలు వారికున్నాయ్. ఇవన్నీ అటుంచితే.. కేటీఆర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఇందులో నిజమెంత..? పోటీ చేయాల్సి వస్తే ఎక్కడ్నుంచి..? గత 24 గంటలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చేమిటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


KTR-11.jpg

ఇదీ అసలు కథ..!

సిరిసిల్ల ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. హైకమాండ్, తనకు బాగా కావాల్సిన వాళ్లు చేసిన సూచనతో రంగంలోకి దిగుతున్నారట. కీలక నేతలు పోటీ చేస్తే సీటు కలిసి రావడంతో పాటు.. పార్టీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుందని హైకమాండ్ భావిస్తోందట. అంతేకాదు రేపొద్దున కేంద్ర ప్రభుత్వానికి చేరువ కావడానికి తోడ్పడే అవకాశాలు ఉంటాయని ప్లాన్ చేస్తోందట. ఎందుకంటే.. అనారోగ్యంతో ఉన్న గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై రాష్ట్ర స్థాయిలోనే ఉంటారని.. జాతీయ స్థాయిలో కేటీఆర్ చక్రం తిప్పాలన్నదే పార్టీ ప్లానట. అంతేకాదు.. రాష్ట్రంలో కీలక, అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని హైకమాండ్ ఫిక్స్ అయ్యిందట. ఇందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కేటీఆర్ జోరుగా తిరుగుతున్నారని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. గత 2014, 2018 ఎన్నికల్లో అవలీలగా అసెంబ్లీ, పార్లమెంట్‌లో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైన తర్వాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవే. దీంతో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ బాగా సీరియస్‌గా తీసుకున్నది.


పోటీచేస్తే పరిస్థితేంటి..?

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్నీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నవే. ఇక సికింద్రాద్‌ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది. దీంతో ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడించాలని హైకమాండ్ భావిస్తోందట. ఈ వ్యూహంలో భాగంగా కేటీఆర్‌ను బరిలోకి దింపితే కచ్చితంగా గెలుస్తారని.. పైగా సిట్టింగ్‌ను మార్చినట్లు కూడా ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఎందుకంటే 2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. ఈసారి రేవంత్ పోటీచేసే ఛాన్స్ లేదు గనుక ఇది కూడా బీఆర్ఎస్‌కు బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా.. పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైనప్పట్నుంచీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మెదక్ నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడేమో కేటీఆర్ పేరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. కేటీఆర్‌ను పార్లమెంట్‌కు పంపి.. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయటంపై ఫోకస్ చేసేందుకు కేసీఆర్‌ ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు, వీరాభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి. మరోవైపు.. రాష్ట్ర స్థాయిలో అదీ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఓడిపోయింది.. ఇక జాతీయ స్థాయిలో చేసేదేముందనే ఆరోపణలూ లేకపోలేదు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిలో ఎవరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారో చూడాలి మరి.

KTR-9.jpg

Updated Date - Jan 08 , 2024 | 05:52 PM