Share News

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

ABN , Publish Date - Apr 04 , 2024 | 07:55 AM

ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియో జకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

ఏపీలో ఎన్నికలకు వేళైంది. అభ్యర్థుల ప్రకటన పూర్తైంది. ఏప్రిల్ 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు సిద్ధం చేశాయి. అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష తెలుగుదేశం (Telugu Desam) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇప్పటికే ఎన్ని కల ప్రచారాన్ని ప్రారంభించారు. ఓటర్ల మనసు గెలుచుకునేం దుకు అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ మధ్య ఈ నియోజకవర్గంలో పోటీ నెలకొంది. వైసీపీ తరపున సీనియర్ నాయకుడు, స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేస్తుండగా.. టీడీపీ తరపున మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.

AP Election 2024: ఏపీ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ

తమ్మినేనికి పరీక్ష..

తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో తలపండిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సుదీర్ఘకాలం ఆ పార్టీలో పనిచేశారు. 1983 నుంచి 2019 వరకు 9సార్లు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే ఆయన అన్ని ఎన్నికల్లో పోటీ చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి పదో సారి పోటీ చేస్తున్నారు. తొమ్మిది సార్లు పోటీ చేయగా.. ఐదు సార్లు గెలుపొందారు. మూడు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలవగా.. ఓసారి ఇండిపెండెంట్‌గా, మరోసారి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో 2009లో తెలుగుదేశం పార్టీ వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆముదాలవలస నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోగా.. 2019లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి గెలిచారు. సుదీర్ఘకాలం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. గత ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని నియోజకవర్గం ప్రజలు చెబుతున్న మాట. వైసీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే.. ఆముదాలవలస నియోజకవర్గంలో తమ్మినేనిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రజలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నా.. మరమ్మతులు చేయించలేకపోయారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న గ్రామాలు ఉన్నాయి. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇస్తామన్న పథకం పూర్తిస్థాయిలో అమలుకాలేదు.


కమీషన్లకే ప్రాధాన్యత..

తమ్మినేని సీతారాం గత ఐదేళ్ల కాలంలో తన నియోజకవర్గం పరిధిలో ప్రతి పనికి కమీషన్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా శ్రీకాకుళం నగరానికి ఈ నియోజకవర్గం సమీపంలో ఉంటుంది. దీంతో చెన్నై, కోల్‌కతా సమీపంలోని భూముల్లో లేఅవుట్ల విషయంలో భారీగా పర్సంటేజీలు వసూలు చేశారనే ఆరోపణలు తమ్మినేనిపై ఉన్నాయి. ఈ విషయంలో తమ్మినేని సీతారాం భార్య కీలకంగా వ్యవహరించారనే ప్రచారం జరగుతోంది. ఏ పని కావాలని వెళ్లినా కమీషన్లు తీసుకునేవారనేది తమ్మినేని సీతారాం కుటుంబంపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో ఈసారి నియోజకవర్గంలో ఆయన గెలవడం అసాధ్యమనే ప్రచారం జరుగుతోంది. సొంత సామాజిక వర్గం ప్రజలే ఆయనపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది.


కూన రవికుమార్‌కే ఛాన్స్..!

కూన రవికుమార్ తమ్మినేని సీతారాంకు స్వయాన మేనల్లుడు. అయినప్పటికీ రాజకీయంగా వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. 2009లో కూన రవికుమార్‌కు టీడీపీ టికెట్ ఇవ్వడంతో తమ్మినేని పార్టీ వీడారు. 2009 నుంచి 2019 వరకు 3 సార్లు కూన రవి కుమార్ ఆముదాలవలస నుంచి పోటీచేసి ఒకసారి గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారని ఇక్కడి ప్రజల నోట వినిపించే మాట. నియోజకవర్గం అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల తరపున పోరాటం చేసిన నాయకుడు కూన రవికుమార్. ప్రభుత్వాన్ని అన్ని విషయాల్లో ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో.. ఆయనపై తమ్మినేని సీతారాం ప్రోద్భలంతో అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలుు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కూన రవి పోటీచేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేనిపై ఉన్న వ్యతిరేకత రవికుమార్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆముదాలవలసతో కూన రవి కుమార్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇదే ట్రెండ్ ఎన్నికల పోలింగ్ వరకు కొనసాగితే కూన రవికుమార్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నట్ల తెలుస్తోంది. అసలు ఫలితం జూన్4న తెలియనుంది.


AP Election 2024: ఏపీ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 08:06 AM