Share News

YS Sharmila: పొత్తులపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 23 , 2024 | 10:55 AM

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila: పొత్తులపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

అమరావతి, ఫిబ్రవరి 24: ఏపీలో (Andhrapradesh) ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా.. ఈరోజు పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి (BJP) వైసీపీ (YCP) , టీడీపీలు (TDP) బీటీంలుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సీపీఎం (CPM), సీపీఐతో (CPI) కలిసి కాంగ్రెస్ పని చేస్తుందని స్పష్టం చేశారు. నేటి నుంచి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పని చేస్తామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బ కొట్టేలా పని చేస్తామన్నారు.

పొత్తుల‌పై తమ‌ మధ్య చర్చ జరిగిందని.. ముందు ప్రజా సమస్యపై కలిసి వెళతామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge) ఈనెల 26న ఏపీకి వస్తున్నారని... సభలో పాల్గొంటారని తెలిపారు. ఆరోజు కూడా వామపక్ష పార్టీలు నేతలతో మరోసారి భేటీ అవుతామన్నారు. భవిష్యత్తులో తప్పకుండా కలిసి పని చేస్తామని, కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ అతిపెద్ద అవినీతి పార్టీలను తరిమి కొట్టాలంటే తాము కలిసి నడవాలని చెప్పుకొచ్చారు. ఏపీకి ఇంత అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడించాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో మోడీ హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతుందని, ప్రజలకు మంచి జరుగుతుందని ఏపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.


అదే వాస్తవం..

గత పదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే కారణమని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేంద్ర బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదన్నారు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని నాడు చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎపికి అప్పుడే హోదా వచ్చేదన్నారు. తిరుపతిలోనే ప్రధాని మోడీ పదేళ్లు హోదా ఇస్తామన్నారని.. నేటికీ మన హక్కులలో ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు కూడా నాడు బీజేపీతో పొత్తు పెట్టి, మంత్రి పదవులు తీసుకున్నారన్నారు. ‘‘చంద్రబాబు హోదా కాదు.. ప్యాకేజీ అని సరిపెట్టారు. హోదా తెస్తాం నాకు అధికారం ఇవ్వండి అని జగన్ అన్నారు. బీజేపీ మెడలు వంచుతామన్న జగన్ ఈ ఐదేళ్లల్లో ఒక్క పోరాటం కూడా చేయలేదు. కనీసం ఎంపీలు ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు’’ అంటూ విరుచుకుపడ్డారు.

పోలవరం విషయంలో కూడా ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. హోదా ఇవ్వకపోవడం వల్లే ఏపీకి పరిశ్రమలు రాలేదన్నారు. ఉద్యోగాలు ఇక్కడ లేక పొట్ట చేతబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారన్నారు. అమరావతి రాజధాని అని‌ చంద్రబాబు త్రీడీ‌ చూపారని.. జగన్ అసలు ఏపీకి రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఏపీకి అన్ని‌విధాలా అన్యాయం చేసిన బీజేపీకి టీడీపీ, వైసీపీ తొత్తులుగా మారాయన్నారు. మోడీకి చంద్రబాబు, జగన్‌లు బానిసలుగా మారి.. రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నిన్న తాము చేసిన పోరాటం ప్రజలు చూశారని.. ఒక రాత్రి పార్టీ ఆఫీస్‌లో ఉండి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తమ పోరాటానికి సీపీఎం, సీపీఐ నేతలు మద్దతు ఇచ్చారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2024 | 10:55 AM