Share News

World Cup: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు దీపావళి సంబరాల్లో టీమిండియా.. సంప్రదాయ దుస్తుల్లో మనోళ్లు సూపర్!

ABN , First Publish Date - 2023-11-12T13:04:53+05:30 IST

Team India Diwali Celebrations: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు దీపావళి సంబురాల్లో మునిగితేలారు. ఆటగాళ్లంతా సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వేడుకలు జరుపుకున్నారు. బెంగళూరులో జరిగిన ఈ వేడుకల్లో క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. జట్టు సిబ్బంది తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఈ వేడుకల్లో ఆటగాళ్లు ధరించిన సంప్రదాయ దుస్తులు ఆకట్టుకున్నాయి. ఆటగాళ్లంతా సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించారు

World Cup: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు దీపావళి సంబరాల్లో టీమిండియా.. సంప్రదాయ దుస్తుల్లో మనోళ్లు సూపర్!

బెంగళూరు: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు దీపావళి సంబురాల్లో మునిగితేలారు. ఆటగాళ్లంతా సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వేడుకలు జరుపుకున్నారు. బెంగళూరులో జరిగిన ఈ వేడుకల్లో క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. జట్టు సిబ్బంది తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఈ వేడుకల్లో ఆటగాళ్లు ధరించిన సంప్రదాయ దుస్తులు ఆకట్టుకున్నాయి. ఆటగాళ్లంతా సంప్రదాయ దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించారు. ఈ వేడుకల్లో కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా, కూతురు సమైరాతో కలిసి పాల్గొన్నాడు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి వేడుకలకు హాజరయ్యాడు.

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి పిల్లలతో, మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషాతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా కూడా కుటుంబంతో వేడుకల్లో పాల్గొన్నారు. యువ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శ్రేయస్ అయ్యర్ వేడుకల్లో సందడి చేశారు. వీరితోపాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ వేడుకల్లో మునిగితేలారు. ఈ వేడుకల్లో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. ఆటగాళ్లంతా ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు చెప్పుకోని ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో ఆటగాళ్లంతా ఫోటోలకు ఫోజులిచ్చారు. అందరూ కలిసి గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను క్రికెటర్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. బీసీసీఐ కూడా ఆటగాళ్ల దీపావళి సంబరాలకు సంబంధిని వీడియోను ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైరలైన ఫోటోల్లో దీపావళి వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మన ఆటగాళ్లను చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదు.

ఇక ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాకు ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌ ఫలితంతో ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ప్రత్యర్థిపై ఎలాంటి అలసత్వం లేకుండా ఆడాలనుకుంటోంది. నెదర్లాండ్స్‌ ఇప్పటికే సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లకు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు డచ్‌ టీమ్‌ గెలిస్తే మాత్రం చాంపియన్స్‌ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. పరుగుల వరద పారే ఈ స్టేడియంలో డచ్‌ బౌలర్లు వాన్‌ బీక్‌, బాస్‌ డి లీడ్‌, మీకెరెన్‌ భారత బ్యాటింగ్‌ లైనప్‌ను ఎలా అడ్డుకుంటారో చూడాల్సిందే. ఇక, టాపార్డర్‌ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీస్తోంది. ఆరు రోజుల విరామం తర్వాత మైదానం బరిలోకి దిగబోతున్న రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌ను సెమీఫైనల్‌కు ప్రాక్టీ్‌సగా భావించనుంది. ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో విశ్రాంతి లభించడంతో పూర్తి జట్టుతోనే బరిలోకి దిగనున్నట్టు కోచ్‌ ద్రవిడ్‌ తెలిపాడు. విరాట్‌ ఈ టోర్నీలో భీకర ఫామ్‌తో కొనసాగుతున్నాడు. అతను తొలిసారిగా వరల్డ్‌క్‌పలో 500+ పరుగులు సాధించడం విశేషం. అలాగే రోహిత్‌, గిల్‌, శ్రేయాస్‌, రాహుల్‌ ఫామ్‌పై ఆందోళన లేకపోయినా.. సూర్యకుమార్‌ సత్తా చాటాల్సి ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 85 పరుగులే చేసిన అతను డచ్‌పై బ్యాట్‌ ఝుళిపించాలని జట్టు కోరుకుంటోంది. పేస్‌ దళం షమి, బుమ్రా, సిరాజ్‌ ఎప్పటిలాగే ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడితే భారత్‌కు మరో భారీ విజయం ఖాయమే. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌ సైతం అదరగొడుతుండడం శుభ పరిణామం.

Updated Date - 2023-11-12T13:13:43+05:30 IST