World cup: టీమిండియాలో కీలక మార్పు.. శుభ్‌మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్?

ABN , First Publish Date - 2023-10-10T16:08:56+05:30 IST

డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమైన గిల్.. బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు.

World cup: టీమిండియాలో కీలక మార్పు.. శుభ్‌మన్ గిల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్?

డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌కు దూరమైన గిల్.. బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు. ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉండడంతో ముందు జాగ్రత్తగా నేడు గిల్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ అవసరమై టెస్టులు నిర్వహించి, తగిన చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. గిల్ ప్లేట్‌లెట్స్ సంఖ్య ఏకంగా 70,000కు పడిపోయింది. గిల్ కోలుకోవడానికి మరో వారం రోజుల కంటే ఎక్కువ సమయమే పట్టే అవకాశాలున్నాయి. దీంతో అతను ఈ నెల 14న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా ఆడడం అనుమానంగానే ఉంది. కోలుకున్న తర్వాత కూడా గిల్ వెంటనే సరైన ఫిట్‌నెస్ సాధిస్తాడా? అనేది కూడా చెప్పలేం. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా జట్టు మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు గిల్‌కు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో గిల్ సమయానికి కోలుకోకపోతే అతని స్థానంలో ప్రపంచకప్ జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్ లేదా యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ వెబ్‌సైట్స్ తమ కథనంలో పేర్కొన్నాయి.


ఇటీవల చైనా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా గోల్డ్ మెడల్ గెలవడంలో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ కీలకపాత్ర పోషించారు. ఆ టోర్నీలో భారత జట్టు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కెప్టెన్సీతోపాటు బ్యాటుతోనూ గైక్వాడ్ సత్తా చాటాడు. అయితే ఇద్దరు మంచి టాలెంట్ ఉన్న ఆటగాళ్లే అయినప్పటికీ అనుభవం దృష్యా సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా జైస్వాల్ ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో అతడిని నేరుగా వన్డే ప్రపంచకప్‌లోనే అరంగేట్రం చేయించే సాహసం చేసే అవకాశాలు లేవు. ఇక గైక్వాడ్ ఇప్పటివరకు 4 వన్డేలు ఆడగా ఒక హాఫ్ సెంచరీ ఉంది. ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో గైక్వాడ్ మొదటి రెండు వన్డే మ్యాచ్‌ల్లో ఆడాడు. మొదటి వన్డేలో 71 పరుగులు చేయగా.. రెండో వన్డేలో 8 పరుగులు చేశాడు. దీంతో గిల్ స్థానంలో వేరొకరిని ఎంపిక చేయాల్సి వస్తే సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. మొత్తంగా సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ దూరమవడం టీమిండియాకు పెద్ద మైనస్‌గా మారింది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. దీంతో డెంగ్యూ నుంచి వీలైనంత త్వరగా కోలుకుని, పూర్తి ఫిట్‌నెస్ సాధించి గిల్ టీమిండియాలో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Updated Date - 2023-10-10T16:08:56+05:30 IST