Share News

AUS vs NZ: హెడ్, వార్నర్ ఊచకోత.. కమిన్స్ మెరుపులు.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్!

ABN , First Publish Date - 2023-10-28T14:35:12+05:30 IST

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృ‌ష్టించారు. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.

AUS vs NZ: హెడ్, వార్నర్ ఊచకోత.. కమిన్స్ మెరుపులు.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్!

ధర్మశాల: న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు విధ్వంసం సృ‌ష్టించారు. టీ20 స్టైలులో చెలరేగిన కంగారులు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(109), డేవిడ్ వార్నర్(81) ఊచకోతకు తోడు చివర్లో కమిన్స్(37) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ ముందు ఆస్ట్రేలియా 389 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. మధ్యలో కివీస్ స్పిన్నర్లు ఫిలిప్స్(3/37), శాంట్నర్(80/2).. చివర్లో పేసర్ బౌల్ట్ (3/77) వికెట్లు తీయడంతో సరిపోయింది కానీ లేదంటే ఆసీస్ స్కోర్ సునాయసంగా 400 దాటేది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన వీరిద్దరు మొదటి వికెట్‌కు 19.1 ఓవర్లలోనే 175 పరుగులు జోడించారు.


మాట్ హెన్రీ వేసిన మొదటి ఓవర్లో వార్నర్ 2 ఫోర్లు బాదాడు. హెన్రీనే వేసిన మూడో ఓవర్లో వార్నర్ ఓ సిక్సు, హెడ్ రెండు సిక్సులు బాదడంతో ఏకంగా 22 పరుగులొచ్చాయి. బౌల్ట్ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ ఓ ఫోర్, సిక్సు బాదాడు. హెన్రీ వేసిన ఐదో ఓవర్ మొదటి మూడు బంతులను హెడ్ 2 ఫోర్లు, ఓ సిక్సు బాదాడు. దీంతో 4.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా స్కోర్ 50 పరుగులకు చేరుకుంది. దీంతో ఈ వరల్డ్ కప్‌లో వేగంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న జట్టుగా రికార్డు నెలకొల్పింది. వార్నర్, హెడ్ ధాటికి కివీస్ బౌలర్ హెన్రీ తన మొదటి 3 ఓవర్లలోనే ఏకంగా 44 పరుగులు సమర్పించుకున్నాడు. ఫెర్గ్యూసన్ వేసిన 7వ ఓవర్లో వార్నర్ రెండు సిక్సులు, హెడ్ ఓ ఫోర్ బాదడంతో 19 పరుగులొచ్చాయి. శాంట్నర్ వేసిన 9వ ఓవర్లో హెడ్ ఓ ఫోర్, సిక్సు, వార్నర్ ఓ ఫోర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్కోర్ 8.5 ఓవర్లలోనే 100 పరుగులకు చేరుకుంది. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా ఆసీస్ రికార్డు నెలకొల్పింది. అలాగే డేవిడ్ వార్నర్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ట్రావిస్ హెడ్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ప్రపంచకప్‌లో వేగంగా హాఫ్ సెంచరీని చేసిన బ్యాటర్‌గా హెడ్ రికార్డు నెలకొల్పాడు. హెడ్, వార్నర్ విధ్వంసంతో ఆస్ట్రేలియా జట్టు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా ఏకంగా 118 పరుగులు చేసింది. మొదటి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా ఓవర్‌కు 12 పరుగుల చొప్పున సాధించింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. అన్ని ప్రపంచకప్‌లలో కలిపి పవర్ ప్లేలో ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. మొదటి 10 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఓపెనర్లు ఏకంగా 10 సిక్సులు బాదడం గమనార్హం. ఆ తర్వాత కూడా హెడ్, వార్నర్ విధ్వసం కొనసాగింది. దీంతో ఆస్ట్రేలియా స్కోర్ 15 ఓవర్లలోనే 150 పరుగులు దాటింది.

అయితే స్పిన్నర్ల ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 20వ ఓవర్ మొదటి బంతికి స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ విడదీశాడు. 5 ఫోర్లు, 6 సిక్సులతో 65 బంతుల్లోనే 81 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడుతున్న వార్నర్.. బౌలర్ ఫిలిప్స్‌కే స్ట్రెట్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లిన హెడ్ 59 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆసీస్ స్కోర్ 23 ఓవర్లలోనే 200కు చేరుకుంది. అనంతరం 24వ ఓవర్లో మరోసారి చెలరేగిన స్పిన్నర్ ఫిలిప్స్ సెంచరీ హీరో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 67 బంతులు ఎదుర్కొన్న హెడ్ 10 ఫోర్లు, 7 సిక్సులతో 109 పరుగులు చేశాడు. ఆ వెంటనే మరోసారి చెలరేగిన ఫిలిప్స్ 18 పరుగులు చేసిన స్మిత్‌ను పెవిలియన్ చేర్చాడు. కాసేపటి తర్వాత 36 పరుగులు చేసిన షాయిన్ మార్ష్‌ను మరో స్పిన్నర్ శాంట్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కాసేపటికే మరోసారి చెలరేగిన శాంట్నర్ 18 పరుగులు చేసిన లబుషేన్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. దీంతో 274 పరుగులకు ఆసీస్ సగం వికెట్లు కోల్పోయింది. ఒకానొక దశలో సునాయసంగా 400 దాటేల కనిపించిన ఆసీస్ స్కోర్ స్పిన్నర్ల ఎంట్రీతో మందగించింది. అనంతరం వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను మందుకు తీసుకెళ్లిన మాక్స్‌వెల్ జట్టు స్కోర్‌ను 300 దాటించాడు. ఈ క్రమంలో మాక్స్‌వెల్ ధాటిగా ఆడాడు. దీంతో 40 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ 292 పరుగులు చేసింది. రచీన్ రవీంద్ర వేసిన 42వ ఓవర్లో 300 మార్కు దాటింది.

అనంతరం 5 ఫోర్లు, 2 సిక్సులతో 24 బంతుల్లోనే 41 పరుగులు చేసిన మాక్స్‌వెల్‌ను 45వ ఓవర్లో జేమ్స్ నీషమ్ పెవిలియన్ చేర్చాడు. 45 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 6 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. అయితే డెత్ ఓవర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ రెచ్చిపోయాడు. అతనికి జోష్ ఇంగ్లిస్ కూడా సహకరించాడు. హెన్రీ వేసిన 46వ ఓవర్లో ఇంగ్లిస్ రెండు ఫోర్లు, కమిన్స్ ఓ ఫోర్ బాదడంతో 15 పరుగులొచ్చాయి. బౌల్ట్ వేసిన 47వ ఓవర్లో కమిన్స్ ఓ సిక్సు, ఇంగ్లిస్ ఓ ఫోర్ బాదడంతో 16 పరుగులు రాగా.. కంగారుల స్కోర్ కూడా 350 పరుగులు దాటింది. నీషమ్ వేసిన 48వ ఓవర్లో కమిన్స్ రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 3 సిక్సులు బాదాడు. ఇంగ్లిస్ కూడా ఓ సిక్సు బాదడంతో ఏకంగా 27 పరుగులొచ్చాయి. దీంతో కంగారుల స్కోర్ 387 పరుగులకు చేరుకుంది. ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండడంతో ఆసీస్ స్కోర్ సునాయసంగా 400 దాడుతుందని అనిపించింది. కానీ 49వ ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌల్ట్.. ఒకే ఒక్క పరుగు ఇచ్చి ఇంగ్లిస్(38), కమిన్స్(37), జంపాను పెవిలియన్ చేర్చాడు. 14 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కమిన్స్ 4 సిక్సులు, 2 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. హెన్రీ వేసిన చివరి ఓవర్లో స్టార్క్(1) ఔటయ్యాడు. దీంతో ఒక్క పరుగు వ్యవధిలోనే ఏకంగా 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో ఫిలిప్స్ 3, బౌల్ట్ 3, శాంట్నర్ 2, హెన్రీ, నీషమ్ తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-10-28T14:38:11+05:30 IST