Congress Balagam : ‘బలగం’ సినిమా ఎఫెక్ట్.. టీ. కాంగ్రెస్ నేతల చేతులు కలిశాయ్.. మూడునాళ్ల ముచ్చటేనా..!?

ABN , First Publish Date - 2023-04-29T17:44:03+05:30 IST

‘బలగం’.. ‘బలగం’ (Balagam Movie) ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది.. ఏ ఇంట్లో చూసినా ఈ మూవీనే కుటుంబ సభ్యులంతా కలిసి వీక్షిస్తున్నారు..

Congress Balagam : ‘బలగం’ సినిమా ఎఫెక్ట్.. టీ. కాంగ్రెస్ నేతల చేతులు కలిశాయ్.. మూడునాళ్ల ముచ్చటేనా..!?

‘బలగం’.. ‘బలగం’ (Balagam Movie) ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది.. ఏ ఇంట్లో చూసినా ఈ మూవీనే కుటుంబ సభ్యులంతా కలిసి వీక్షిస్తున్నారు. థియేటర్లలో సూపర్ డూపర్ హిట్టయ్యాక ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రాన్ని జనాలు తెగ చూసేస్తున్నారు. కుటుంబంలోని సభ్యుల మధ్య ఉన్న బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, బాధలు, కొట్లాటలను ఎంతో హృద్యంగా తెరకెక్కించిన కమెడియన్ వేణు జనాలను ఏడిపించేస్తున్నాడు.!. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్‌లో ముక్కలుగా విడిపోయిన కుటుంబాన్ని ఒక్కపాటతో ఒక్కటిగా చేర్చి.. మన కుటుంబమే మన బలగం అని చెప్పిన తీరు ఎంతో హర్షణీయమని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రియల్‌ లైఫ్‌లో ఎంతోమందిని ఒక్కటి చేసింది. ఏళ్ల తరబడి గొడవలున్న కుటుంబాల్లో, అన్నదమ్ముల మధ్య ఈ సినిమాతో సయోధ్య కుదిరింది. ఇలా ఒకటారెండా తెలుగు రాష్ట్రాల్లో వందలాది సంఘటనలు జరిగాయి. ఈ సినిమా సామాన్యులనే కాదండోయ్.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలను కూడా కలిపింది. ఇప్పుడెందుకీ సినిమా గురించి.. ఇంతకీ ఏం జరిగిందనే కదా మీ సందేహం.. ఈ స్పెషల్ స్టోరీ చదివితే అసలు విషయమేంటో మీకే అర్థమైపోతుంది.. ఇక ఎందుకు ఆలస్యం చదివేయండి..

Balagam-Congress.jpg

అసలేం జరిగింది..!?

తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రెండ్రోజులు కలిసుంటే రెండేళ్లు విడిపోయి ఉంటారు. ఎప్పుడు ఎవరి మధ్య విబేధాలు తలెత్తుతాయో..? ఎవరు మీడియా ముందుకొచ్చి దుమ్మెత్తిపోస్తారో..? తెలియని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా టీ కాంగ్రెస్ నేతల పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి (Revanth Reddy) టీపీసీసీ చీఫ్ పదవి దక్కిన తర్వాత ఒక్కరంటే ఒక్కరికి అసలు పడట్లేదు. అయితే ఇన్నాళ్లు ఉప్పు- నిప్పులా కాంగ్రెస్ నేతలు ఒక్కటయ్యారు. విభేదాలను పక్కన పెట్టారు.. ఒకే వేదికపైకి వచ్చి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని.. చేయి చేయి కలిపి ఇదీ ‘కాంగ్రెస్ బలగం’ అంటే అని నేతలు చాటిచెప్పారు. అంతా ఐక్యంగా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని కార్యకర్తల సాక్షిగా ప్రకటించారు. పార్టీ శ్రేణులకు భవిష్యత్తుపై భరోసా కల్పించారు. శుక్రవారం నాడు నల్లగొండలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన సభలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో దిగ్గజాలు అనదగ్గ వారంతా ఒక్కతాటిపైకి వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, నల్లగొండ జిల్లాకే చెందిన మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి (Jana Reddy), ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkata Reddy) , ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) హాజరయ్యారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఇలా తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ దృశ్యం కళ్లముందు కనిపించడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిన్న మొన్నటి వరకూ వేణు దర్శకత్వం వహించిన ‘బలగం’ గురించి చర్చించుకోగా.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీవరకూ ‘కాంగ్రెస్ బలగం’ చర్చించుకుంటున్నారు.

Congress-Balagam.jpg

మొదట్నుంచీ ఇదీ పరిస్థితి..

వాస్తవానికి రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేతలంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారేనన్న సంగతి తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి రేవంత్‌ను వారు జిల్లాలో అడుగు కూడా పెట్టనివ్వడంలేదు. కనీసం అయితే ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో నిరుద్యోగ సభలు నిర్వహించాలని నిర్ణయించిన రేవంత్‌రెడ్డి.. నల్లగొండలో ఈ నెల 21వ తేదీని తొలుత ప్రకటించారు. కానీ, తమకు సమాచారం లేకుండా తేదీ ప్రకటించడమేంటని జిల్లాకు చెందిన ఎంపీలు ఉత్తమ్‌, వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి కాంగ్రెస్‌ పెద్దల సమన్వయంతో 28న సభ ఖాయమైంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూళ్లు ఉన్నాయని చెబుతూ వచ్చిన వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌.. చివరికి సభకు వచ్చారు. ఇలా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి, వి.హనుమంతరావు వంటి దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్న టైమ్‌లో కార్యకర్తలు, అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. మొత్తానికి చూస్తే.. సభ సక్సెస్ కావడంతో పాటు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నల్గొండ సాక్షిగా నేతలంతా ఒక్కటయ్యారు. నిజంగా ఈ బలగం సీన్‌తో కార్యకర్తలు, ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు.

Congress-Balagam-1.jpg

కంటిన్యూ అయ్యేనా..?

తెలంగాణ నేటివిటీలో తీసిన ‘బలగం’ సినిమాకు రాష్ట్రంలో మంచి ఆదరణ వచ్చింది. సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకూ ఎక్కడ చూసినా ఈ సినిమానే చూశారు. ఆ మధ్య థియేటర్లకు వెళ్లి మరీ బీజేపీ నేతలు సినిమా చూశారు. బహుశా కాంగ్రెస్ నేతలు కూడా ‘బలగం’ సినిమా చూశారేమో కానీ.. ఇక విబేధాలు వద్దురా బై అని ఇన్నాళ్లు ఉప్పు-నిప్పులా ఉన్నవాళ్లంతా ఒక్కటయ్యారు. వాస్తవానికి రేవంత్-కోమటిరెడ్డి (Revanth-Komati Reddy) కలయిక ఇదేం మొదటిసారి కాదు.. ఆ మధ్య ప్రజా సమస్యల పోరాట విషయంలో చేయి చేయి కలిపారు. కొన్ని రోజులకే యథావిధిగా మీడియా ముందుకు వచ్చి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం షరా మామూలే. వాస్తవానికి తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అంటే రాష్ట్ర ప్రజలకు ఎనలేని అభిమానమే ఉంది. కానీ.. నేతల మధ్య నిత్యం కుమ్ములాటలతో ఆ అభిమానం కాస్త తెరమరుగయ్యింది. ఈ ‘బలగం’ సీన్ తర్వాత అయినా కాంగ్రెస్‌కు మంచి జరిగితే మంచిదే.. లేదంటే ఇదంతా మూడునాళ్ల ముచ్చటలాగే ఉంటే మాత్రం పార్టీకి గడ్డురోజులేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా వచ్చేస్తామని కార్యకర్తలు ధీమాగా చెప్పుకుంటున్నారు. అయితే.. అబ్బే ఇలాంటి సన్నివేశాలు కాంగ్రెస్‌లో ఎన్ని చూడలేదు.. ఇదంతా మూడ్నాళ్ల ముచ్చటే అని కుమ్ములాటలకు, వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అనేవాళ్లు లేకపోలేదు. కాంగ్రెస్‌లో ఈ పరిస్థితులు ఎన్నిరోజులు కొనసాగుతాయో.. ఎన్నికల ముందు ఇంకా ఎన్నెన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.

Congress-Balgam-3.jpg

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Rajani On CBN : రజనీకాంత్‌పై వైసీపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన టీడీపీ.. డైవర్ట్ చేసేశారుగా..!

******************************

Avinash In Viveka Case : అవినాష్ అరెస్ట్ తర్వాత ఏం జరగబోతోంది.. వైఎస్ భారతి పేరు తెరపైకి ఎందుకొచ్చింది.. కోట్లలో బెట్టింగ్‌లు..!?


******************************

Avinash In Viveka Case : అవినాష్ విషయంలో హైకోర్టు తీర్పుతో వైసీపీలో టెన్షన్.. టెన్షన్.. హుటాహుటిన సమావేశమై..

******************************

Updated Date - 2023-04-29T18:01:28+05:30 IST