Karnataka Assembly Elections: ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల ముందు ప్రి పోల్ సర్వేలు... ఊహించని ఫలితాలు

ABN , First Publish Date - 2023-04-27T18:41:35+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ప్రి పోల్ సర్వేలు వెల్లడయ్యాయి.

Karnataka Assembly Elections: ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల ముందు ప్రి పోల్ సర్వేలు... ఊహించని ఫలితాలు
Karnataka Assembly Elections

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ప్రి పోల్ సర్వేలు వెల్లడయ్యాయి. 224 స్థానాలున్న కర్ణాటకలో అధికారం చేపట్టేందుకు కావాల్సిన మేజిక్‌ నెంబర్ 113 కాగా ఏ పార్టీ కూడా మెజార్టీ సాధించే అవకాశాలు కనిపించడం లేదని సర్వేలన్నీ చెబుతున్నాయి. అధికార బీజేపీ(BJP), కాంగ్రెస్ (Congress), జేడీఎస్‌ల(JDS) మధ్య త్రికోణ పోటీ ఉండగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నాయి. అయితే సర్వేలన్నీ ఏ పార్టీకీ మెజార్టీ రాబోదని చెప్పడంతో పాటు జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారబోతోందని వెల్లడించాయి. ప్రాంతీయ న్యూస్‌ చానళ్ల సర్వేల్లో ఇదే తేలింది. ఆప్ ప్రభావంపై సర్వే సంస్థలు ఏమీ వ్యాఖ్యానించలేదు.

ది ఏషియానెట్‌-సువర్ణ న్యూస్‌ జన్‌కీ బాత్‌ సర్వే: బీజేపీ 98-109, కాంగ్రెస్‌ 89-97, జేడీఎస్‌ 28-99

ది న్యూస్‌ ఫ్‌స్ట్-మాట్రిజ్‌ సర్వే: బీజేపీ 96-106, కాంగ్రెస్‌ 84-94, జేడీఎస్‌ 29-34

విస్తారా న్యూస్‌-సౌత్‌ ఫస్ట్‌ పీపుల్స్‌ పల్స్‌ సర్వే: బీజేపీ 88-93, కాంగ్రెస్‌ 84-90, జేడీఎస్‌ 23-26

ది సౌత్‌ ఫస్ట్‌ చేపట్టిన సర్వే: కాంగ్రెస్‌ 95-105, బీజేపీ 90-100, జేడీఎస్‌ 25-30

అయితే టీవీ9-సీ ఓటర్‌ సర్వే మాత్రం కాస్త డిఫరెంట్‌గా సర్వే ఫలితాలిచ్చింది. కాంగ్రెస్‌కు మెజార్టీ రాబోతోందని వెల్లడించింది

టీవీ9-సీ ఓటర్‌ సర్వే : బీజేపీ 79-89, కాంగ్రెస్‌ 106-116, జేడీఎస్‌ 24-34

నెల క్రితం వచ్చిన సర్వేల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గాలి దిశ మారుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా పది రోజుల ముందు బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ లాగా తలపడబోతున్నాయని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసే మే 8 నాటికి ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో చెప్పడం కష్టమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అయితే బీజేపీ, కాంగ్రెస్ ఫైట్ ఇలా ఉంటే జేడీఎస్ కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో 89 సంవత్సరాల దేవెగౌడలో ( JDS supremo H D Deve Gowda) జోష్ వచ్చేసింది. స్వయంగా 42 స్థానాల్లో ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. తమ పార్టీ పంచరత్నాల పేరుతో ఇస్తోన్న ఐదు హామీలపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, తామే మెజార్టీ సాధిస్తామని కూడా దేవెగౌడ నమ్మకంగా చెబుతున్నారు. మెజార్టీ సాధించి జేడీఎస్ సొంతంగా అధికారంలోకి వస్తుందంటున్నారు. దేవెగౌడ తనయుడు కుమారస్వామి (Kumara Swami) ఇప్పటివరకూ 118 స్థానాల్లో స్వయంగా ప్రచారం చేశారు. మైసూరులో తమ సామాజికవర్గమైన వక్కలిగలకు పట్టు ఉండటంతో ఇక్కడున్న 64 స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోగలమని జేడీఎస్ విశ్వసిస్తోంది. రాష్ట్రంలో వక్కలిగల జనాభా 15 శాతం వరకూ ఉంది. జేడీఎస్‌ ఓట్ షేర్ 20 శాతం వరకూ ఉంది. 2006, 2018లో హంగ్ ఏర్పడి కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి సర్వేలన్నీ హంగ్ అని చెబుతుండటంతో మరోసారి సీఎం అవడం ఖాయమనే ధీమాలో కుమారస్వామి ఉన్నారు. రాబోయే వారం రోజుల్లో కర్ణాటకలో గాలి ఎటువైపు వీస్తుందో చూడాలని రాజకీయ పరిశీలకులంటున్నారు.

Updated Date - 2023-04-27T18:42:38+05:30 IST