Aadhaar: ఆధార్ భద్రతపై మూడీస్ సంచలన ఆరోపణలు.. కేంద్రం ఏం చెబుతుందంటే..?

ABN , First Publish Date - 2023-09-26T14:12:24+05:30 IST

ఆధార్ కార్డు వాడకం ద్వారా భద్రతాపరమైన, గోప్యతపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయనే గ్లోబల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఆరోపణలపై కేంద్రం స్పందించింది. మూడీస్ చేసిన ఆరోపణలను ఖండించిన కేంద్రం వాటిని నిరాధరమైనవిగా పేర్కొంది.

Aadhaar: ఆధార్ భద్రతపై మూడీస్ సంచలన ఆరోపణలు.. కేంద్రం ఏం చెబుతుందంటే..?

ఢిల్లీ: ఆధార్ కార్డు వాడకం ద్వారా భద్రతాపరమైన, గోప్యతపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయనే గ్లోబల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఆరోపణలపై కేంద్రం స్పందించింది. మూడీస్ చేసిన ఆరోపణలను ఖండించిన కేంద్రం వాటిని నిరాధరమైనవిగా పేర్కొంది. ఆధార్ వ్యవస్థను నిర్వహించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కూడా మూడీస్ వాదనలను గట్టిగా ఖండించింది. ప్రత్యేకించి మాన్యువల్ కార్మికులకు, వేడి, తేమతో కూడిన వాతావరణంలో ఆధార్ సేవలు తరచుగా తిరస్కరణలకు గురవుతున్నాయని మూడీస్ ఏజెన్సీ ఆరోపించింది. మూడీస్ ఆరోపణలను ఖండించిన కేంద్రం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వంటి ఇతర ప్రపంచ సంస్థలు ఆధార్‌ను ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇలాంటి డిజిటల్ గుర్తింపు వ్యవస్థలను ఎలా అమలు చేయాలో అర్థం చేసుకోవడానికి చాలా దేశాలు UIDAIని సంప్రదించాయని పేర్కొంది.


మూడీస్ చేస్తున్న ఆరోపణలు ఇవే..

భారతీయుల గుర్తింపు కార్డు అయినా ఆధార్ కార్డు భద్రతపై మూడీస్ ఏజెన్సీ ‘డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అండ్ డిజిటల్ అసెట్స్’ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆధార్ కార్డు వినియోగం వల్ల భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని మూడీస్ ఆరోపించింది. ఆధార్ సేవలు తరచుగా తిరస్కరణకు గురవుతున్నాయని, బయోమెట్రిక్ సరిగ్గా రాక చాలా మందికి సేవలు అందడం లేదని తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా తేమ, వేడి వాతావరణంలో పని చేసే కార్మికులు ఆధార్‌ను ఉపయోగించడం శ్రేయస్కరం కాదని చెప్పుకొచ్చింది. అలాగే పౌరుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని ఆరోపించింది. బ్యాంకింగ్ అవసరాలు, సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వ సంక్షేమాలు అన్నింటికి ఒకే గుర్తింపు కార్డును ఉపయోగించడం వల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి చిక్కే ప్రమాదం ఉందని మూడీస్ తన నివేదికలో పేర్కొంది.

కేంద్రం ఏం చెబతుందంటే..?

మూడీస్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది. మూడీస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా సదరు సంస్థ ఈ ఆరోపణలు చేసిందని మండిపడింది. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ఐడీ ఆధార్ అని పేర్కొంది. గత 10 ఏళ్లలో 100 కోట్లకు పైగా భారతీయులు ఆధార్‌పై నమ్మకం ఉంచినట్లు తెలిపింది. అంతేకాకుండా తమ గుర్తింపును ధృవీకరించేందుకు ఆధార్ కార్డును భారతీయులు ఇప్పటివరకు 100 కోట్ల సార్లకు పైగా వినియోగించారని వెల్లడించింది. మూడీస్ సంస్థ ఎలాంటి ఆధారాలు లేకుండా, ఆధార్‌కు వ్యతిరేకంగా వాదనలు చేసిందని పేర్కొంది. సదరు సంస్థ తమ నివేదికలో పేర్కొన్న అభిప్రాయాలను సమర్థించేలా ఎలాంటి అధ్యయనాలను ప్రస్తావించలేదని చెప్పుకొచ్చింది.

వేడి, తేమ ప్రాంతాల్లో పని చేసే కార్మికులకు ఆధార్ శ్రేయస్కరం కాదనే ఆరోపణలకు ఉడాయ్ వివరణ ఇచ్చింది. ఆధార్ బయోమెట్రిక్ కోసం వేలి ముద్రలు మాత్రమే కాకుండా, ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ అథెంటికేషన్, మొబైల్ ఓటీపీ వంటి కాంటాక్ట్‌లెస్ మార్గాలు ఉన్నాయని తెలిపింది. ఈ విషయాన్ని మూడీస్ విస్మరించిందని పేర్కొంది. అలాగే ఆధార్ డేటాబేస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి డేటా ఉల్లంఘటనలు జరగలేదని, ఆ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు పార్లమెంట్ ముందు కూడా వెల్లడించినట్లు ఉడాయ్ వివరించింది. కాగా ఆధార్ భద్రతపై ఆరోపణలు రావడం ఇది మొదటి సారి ఏం కాదు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

Updated Date - 2023-09-26T14:50:01+05:30 IST