Lok sabha Elections 2024: మోదీని ఆపతరమా?

ABN , First Publish Date - 2023-02-22T18:46:41+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వారితో జట్టు కట్టిన నాయకులు ఎలాంటి ప్రకటనలు చేసినా వాస్తవ దృశ్యం ....

Lok sabha Elections 2024: మోదీని ఆపతరమా?
Can Modi Be Defeated in 2024 Lok sabha Elections

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections 2024) ప్రధానమంత్రి (Prime Minister of India) నరేంద్ర మోదీ (Narendra Modi) సారధ్యంలోని బీజేపీని ఇంటికి సాగనంపాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) పిలుపునిచ్చారు. బీజేపీ(BJP)ని గద్దె దింపుతామని, ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందన్నారు. ఇందుకోసం భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతోనూ 137 ఏళ్ల కాంగ్రెస్ చర్చిస్తుందని నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రకటించారు. 2024లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ సారథ్యం వహిస్తుందని చెప్పారు. ఇతర పార్టీలతో కూడా ఈ దిశగా చర్చలు సాగిస్తున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేవి ఉండవని అన్నారు. ప్రతి పార్టీతో తమ అభిప్రాయాలను పంచుకుంటామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. అన్ని పార్టీలను కలుపుకొని తాము మెజారిటీ సాధిస్తామన్నారు.

ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే మోదీ ప్రభుత్వాన్ని వంద శాతం ఓడించవచ్చని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. మరోవైపు బీజేపీని వంద సీట్లకు పరిమితం చేయొచ్చని బీహార్ సీఎం, జేడియూ(JDU) అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) రెండ్రోజుల క్రితమే చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వారితో జట్టు కట్టిన నాయకులు ఎలాంటి ప్రకటనలు చేసినా వాస్తవ దృశ్యం వారు చెప్పినంత సులభంగా ఏమీ లేదు. నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014, 2019లో రెండు సార్లు సొంతంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ముచ్చటగా మూడోసారి వచ్చేందుకు అన్ని వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వచ్చేలా చూసుకోవడంపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రజావ్యతిరేకతకు కొట్టుకుపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం ద్వారా రాష్ట్రాల్లో ప్రయోజనం పొందాలని బీజేపీ శ్రేణులు తీవ్రంగా యత్నిస్తున్నాయి. బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ శాంతి భద్రతలపై దృష్టి సారించి, గ్యాంగ్‌స్టర్లకు గుణపాఠం నేర్పుతూ ఓటు బ్యాంక్‌ను కాపాడుకుంటున్నారు. 2024 జనవరి లోపు రామమందిరం పూర్తి చేస్తామని ప్రకటించి పనులు ఉధృతం చేశారు కూడా. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కూడా ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఎన్డీయే పాలిత మహారాష్ట్రలో అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్నారు. దేశీయంగా శాంతి భద్రతలపై ఫోకస్ చేసిన మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దుతోంది. అదే సమయంలో రక్షణపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరిహద్దుల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక ఆయుధాలు, విమానాలు కొనుగోలు చేస్తూ రక్షణపరంగా రాజీలేని ధోరణి కనపరుస్తోంది. మోదీ ప్రభుత్వం కొవిడ్ మహమ్మారిని దీటుగా ఎదుర్కొని ప్రపంచ దేశాల ప్రశంసలందుకుంది. కొవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కొని భారత్ ఆర్ధికంగా నిలబడుతోంది. ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ఉన్న భారత్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో మూడో స్థానానికి చేరాలని లక్ష్యం పెట్టుకుంది. మేకిన్ ఇండియా ద్వారా దేశీయంగా ఆయుధాలు, ఇతర ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు, సాఫ్ట్‌వేర్‌లు తయారు చేస్తూ ఉపాధిపరంగానే కాకుండా ఆర్ధికరంగంలో కూడా గట్టిగా నిలదొక్కుకునేందుకు కేంద్రం తీవ్రంగా యత్నిస్తోంది. మోదీ ప్రభుత్వ విదేశీ విధానం కూడా ఆకట్టుకుంటోంది. ఉక్రెయిన్- రష్యా యుద్ధ వేళ అమెరికా, యూరప్‌లతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూనే రష్యానుంచి ఆయిల్ తక్కువ ధరకు కొనుగోలు చేయడం మోదీ సర్కారు ప్లస్ పాయింట్. ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను ఆదుకోవడం నుంచి టర్కీలో భూకంప బాధితులను కాపాడటం వరకూ మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

బీజేపీ అడుగులు అలా ఉంటే వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కనుచూపుమేరలో కనపడటం లేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మబోమని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), తృణమూల్ కాంగ్రెస్(TMC), భారత్ రాష్ట్ర సమితి(BRS) తేల్చి చెప్పాయి. కేసీఆర్ (KCR) నాయకత్వంలో నిర్వహించిన బహిరంగ సభకు తరలివచ్చిన సమాజ్‌వాదీ పార్టీ(SP) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కూడా కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సుముఖంగా లేరు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తమిళనాడు, జార్ఖండ్‌, బీహార్‌లో సంకీర్ణ ప్రభుత్వాల్లో కాంగ్రెస్ కూడా ఉంది. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పేరిట ఎన్సీపీ, ఉద్ధవ్ వర్గంతో కాంగ్రెస్ దోస్తీ ఉంది. త్వరలో ఎన్నికలు జరిగే కర్ణాటకలో కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో సొంత పార్టీలో ఉన్న కుమ్ములాటలు కాంగ్రెస్‌ను నట్టేట ముంచనున్నాయి.

వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాల పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్‌ కూటమి, బీజేపీ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వంటి నాయకులు 2024 నాటికి కీలకంగా మారనున్నారు. ప్రస్తుతానికి ప్రతిపక్షాలన్నీ ఎవరికివారే అన్నట్లుగా ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపించే కొద్దీ ప్రతిపక్షాలు ఐక్యంగా వెళ్తాయా లేక వేర్వేరు గ్రూపులుగా ఉంటూ బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడతాయా అనేది స్పష్టమౌతుందని పరిశీలకులంటున్నారు.

Updated Date - 2023-02-22T19:07:26+05:30 IST