Rahul Gandhi Vs BJP : చేసుకున్నోళ్లకు చేసుకున్నంత : హిమంత బిశ్వ శర్మ

ABN , First Publish Date - 2023-03-25T18:24:18+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే ఇతర వెనుకబడిన వర్గాలవారిని అవమానించారని

Rahul Gandhi Vs BJP : చేసుకున్నోళ్లకు చేసుకున్నంత : హిమంత బిశ్వ శర్మ
Rahul Gandhi , Himanta Biswa Sarma

గువాహటి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) ఉద్దేశపూర్వకంగానే ఇతర వెనుకబడిన వర్గాల (OBC) వారిని అవమానించారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) ఆరోపించారు. తాను హిందూ సిద్ధాంతాలను నమ్ముతానని, ఈ సిద్ధాంతాల ప్రకారం, చేసిన కర్మకు ఫలితం వస్తుందని చెప్పారు. ఇంటి పేరు మోదీ అని ఉన్నవారిని, ఓబీసీలను రాహుల్ అవమానించారని బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ నేరస్థుడనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. ‘‘దొంగలందరికీ ఇంటి పేరు మోదీ అని ఎలా ఉంటోందబ్బా!’’ అన్నారు. దీంతో ఆయనపై వివిధ రాష్ట్రాల్లో పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి. గుజరాత్‌లోని పశ్చిమ సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ (Surat West MLA Purnesh Modi) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తీర్పు చెప్పింది. రెండేళ్ళ జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అమలును 30 రోజులపాటు నిలిపేస్తూ, బెయిలు మంజూరు చేసింది. ఈ తీర్పుపై అపీలు చేసేందుకు ఆయనకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ పార్లమెంటుకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్లమెంటు సచివాలయం గాంధీపై అనర్హత వేటు వేసింది. ఫలితంగా ఆయన కేరళలోని వయనాద్ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం మీడియాతో మాట్లాడుతూ, తాను హిందూ సిద్ధాంతాలను నమ్ముతానని, చేసిన పనికి ఫలితం వస్తుందని హిందూ సిద్ధాంతాలు చెప్తున్నాయని తెలిపారు. అదేవిధంగా రాహుల్ గాంధీ చేసిన కర్మకు ఫలితం వచ్చిందన్నారు. 2013లో ఓ ఆర్డినెన్స్‌ను గాంధీ తిరస్కరించారన్నారు. ఇప్పుడు ఇక ఆయన భారత్ జోడో యాత్ర చేసుకోవచ్చునని, కానీ పార్లమెంటుకు వెళ్ళడానికి వీలుండదని చెప్పారు. ఆయన కర్ణాటకలో 2019లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఓబీసీలను ఉద్దేశపూర్వకంగానే అవమానించారన్నారు. ఆ జాతికి ఆయన క్షమాపణ చెప్పి ఉండవలసిందన్నారు. ఆయన క్షమాపణ చెప్పలేదన్నారు. దీనినిబట్టి ఆయన దురహంకారి అని స్పష్టమవుతోందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పులు చేసే అవకాశం ఉంటుందని, అయితే మనం వెంటనే క్షమాపణ చెబుతామని అన్నారు. దాదాపు ఐదేళ్లపాటు న్యాయ ప్రక్రియ జరిగిన తర్వాత ఆయనను దోషిగా తీర్పు చెప్పారని తెలిపారు.

2013 ఏప్రిల్‌కు ముందు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు ఏదైనా కేసులో దోషులుగా నిర్థరణ అయి, కనీసం రెండేళ్ళ జైలు శిక్ష విధించబడితే, ఆ తీర్పు వెలువడిన తేదీ నుంచి మూడు నెలలపాటు వారి చట్టసభల సభ్యత్వంపై అనర్హత వేటు వేయడానికి వీలుండేది కాదు. అయితే 2013 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ఈ నిబంధనలను మార్చింది. కనీసం రెండేళ్ళ జైలు శిక్ష పడిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలను తీర్పు వెలువడిన తక్షణమే వారి పార్లమెంటు లేదా శాసన సభ సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, అనర్హులుగా ప్రకటించాలని చెప్పింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టడం కోసం ఈ తీర్పు వెలువడిన దాదాపు ఐదు నెలల తర్వాత అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఈ ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ఇది కంప్లీట్ నాన్సెన్స్ అన్నారు. అవినీతిని ఆపాలంటే ఇలాంటి రాజీ ధోరణి పనికిరాదన్నారు. ఈ ఆర్డినెన్స్‌ను చింపి, పారేయాలన్నారు. మీడియా సమావేశంలోనే ఆ ఆర్డినెన్స్‌ను చింపేశారు. దీంతో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ విషయంలో వెనుకకు తగ్గింది.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : చైనా జాతీయుడికి అదానీ కంపెనీల్లో పెట్టుబడులతో లింక్..

Karnataka : భాషలతో రాజకీయాలు : మోదీ

Updated Date - 2023-03-25T18:24:18+05:30 IST