Owaisi vs Rahul: నీకు దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్!

ABN , First Publish Date - 2023-09-25T11:33:13+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్‌లో పోటీ చేయాలని బహిరంగంగా సవాల్ చేశారు.

Owaisi vs Rahul: నీకు దమ్ముంటే హైదరాబాద్‌ నుంచి పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఓవైసీ సవాల్!

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని బహిరంగంగా సవాల్ చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ అసదుద్దీన్ ఓవైసీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గల బాబ్రీ మసీదు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కూల్చివేబడిందని ఒవైసీ అన్నారు. ‘‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని మీ నాయకుడికి (రాహుల్‌గాంధీ) నేను సవాల్‌ విసురుతున్నాను. మీరు పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లు ఇస్తూనే ఉన్నారు. కానీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి నాతో తలపడండి. కాంగ్రెస్‌కు చెందిన వారు చాలా విషయాలు చెబుతారు. కానీ నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ హయాంలో బాబ్రీ మసీదు, సెక్రటేరియట్ మసీదు కూల్చివేశారు’’ అని అసుదుద్దీన్ ఓవైసీ అన్నారు. కాగా రాహుల్ గాంధీకి ఓవైసీ సవాల్ విసరడం ఇది మొదటి సారి ఏం కాదు. గతేడాది మేలో ఆయన ఇదే విధమైన సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలన్నారు. ఇక రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.


అయితే ఓవైసీ విసిరిన సవాల్‌పై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తునేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా ఈ ఏడాది చివరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నెల మొదట్లో తెలంగాణలోని తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఏఐఎంఐఎం ఐక్యంగా పనిచేస్తున్నాయని, ఈ త్రయంపై తమ పార్టీ పోరాడుతోందని అన్నారు.

‘‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క బీఆర్‌ఎస్‌పై పోరాడడం లేదు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎంలతో కూడిన త్రయంపై పోరాడుతుంది. తమను తాము వేర్వేరు పార్టీలుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఆ పార్టీలన్నీ కలిసి ఐక్యంగా పనిచేస్తున్నాయి. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు లేదా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలను ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత వ్యక్తులగా భావిసున్నందన వారిపై సీబీఐ-ఈడీ కేసులు లేవు."అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తాజాగా ఓవైసీ ఖండించారు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో విజయం కోసం ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా పార్టీలు వదిలిపెట్టడం లేదు. అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే వాటిని నెరవేరుస్తామని చెబుతోంది.

Updated Date - 2023-09-25T11:41:24+05:30 IST