Weekend Comment BY RK: పాలకుడి దొరహంకారం...!

ABN , First Publish Date - 2023-08-20T01:17:41+05:30 IST

పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి.

Weekend Comment BY RK: పాలకుడి దొరహంకారం...!

పాలెగాడి చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ను మించిన ఉదాహరణ ఉండదేమో! రాయలసీమలో అరాచకాలు సృష్టించిన పాలెగాళ్లలోని పోకడలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి(AP CM JAGAN)లో కనిపిస్తున్నాయి. ప్రజల్లోకి వచ్చినప్పుడు షిక్కటి చిరునవ్వులు చిందిస్తూ కనిపించే జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌(Tadepalli Palace)లోకి ప్రవేశించగానే ప్రత్యర్థుల అణచివేతకు కుయుక్తులు పన్నుతుండటం చూసి ఒకప్పటి రాయలసీమ పాలెగాళ్లు గుర్తుకొస్తున్నారు. వ్యవస్థలను చెరపట్టి ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బతీయడంపై ఆయన తన శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌(Margadarshi Chit Funds) ఉదంతమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్‌(Telugu Desam MP Galla Jayadev)పై పగబట్టిన జగన్‌ ప్రభుత్వం ఇంతకుమునుపు అమరరాజా బ్యాటరీస్‌ను ముప్పతిప్పలు పెట్టిన విషయం విదితమే. కాలుష్యం పేరిట ఆ సంస్థను ఇబ్బందులపాలు చేశారు. జగన్‌ తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అమరరాజా విస్తరణకు భూమి కేటాయించారు. మూడు దశాబ్దాలుగా వేలాదిమందికి ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వానికి వందలకోట్ల రూపాయల పన్నులు చెల్లించిన ఈ కంపెనీలో జగన్‌ ప్రభుత్వానికి మాత్రమే కాలుష్యం కనిపించింది. జయదేవ్‌ తెలుగుదేశం ఎంపీగా ఉండి ఉండకపోయిఉంటే అమరరాజా కంపెనీ వ్యవహారం సాఫీగా సాగిపోయేది. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీలో ఉండకూడదన్న దురుద్దేశంతో జయదేవ్‌ కంపెనీని టార్గెట్‌ చేసుకున్నారు. జగన్‌ ప్రభుత్వంతో పోరాడి అలసిపోయిన జయదేవ్‌ చివరకు రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి రావడంతోపాటు అమరరాజా విస్తరణ ప్లాంట్‌(Amararaja Expansion Plant)ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో జగన్‌రెడ్డి కళ్లు చల్లబడ్డాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమరరాజాపై అధికారుల దాడులు ఆగిపోయాయి. ప్రభుత్వ చర్యల వలన యాజమాన్యానికి తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురై ఉండవచ్చునుకానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే ప్రధానంగా నష్టపోయారు. ఒక పరిశ్రమ విస్తరణ పొరుగు రాష్ర్టాలకు తరలిపోయింది. విద్యావంతుడైన జయదేవ్‌ రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ వంతు వచ్చింది. మార్గదర్శిని జగన్‌ లక్ష్యంగా చేసుకోవడంలో బహుముఖ ప్రయోజనాలు ఇమిడి ఉన్నట్టు కనిపిస్తోంది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్గదర్శి ఫైనాన్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌ వంతు వచ్చింది. తన గ్రూపు సంస్థల షేర్లను రిలయన్స్‌ సంస్థకు విక్రయించడం ద్వారా మార్గదర్శి గండం నుంచి గట్టెక్కిన రామోజీరావును... ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై వరుస దాడులు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. వయో భారంతోపాటు అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న రామోజీరావుకు ఇది ఊహించని కష్టమే!


మూసివేయించడం సాధ్యమా?

రామోజీరావు వ్యవహార శైలిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన సంస్థల విశ్వసనీయతను మాత్రం ప్రశ్నించలేని పరిస్థితి. మార్గదర్శి ఫైనాన్స్‌ను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం టార్గెట్‌గా చేసుకున్నప్పుడు కూడా డిపాజిట్‌దారుల విశ్వాసం చెక్కుచెదరలేదు. ఇతర సంస్థల విషయంలో జరిగినట్టుగా డిపాజిట్‌దారులు తమ డబ్బుకోసం మార్గదర్శి ఫైనాన్స్‌ వద్దకు పరుగులు పెట్టి ఉంటే రామోజీ గ్రూపు ఇబ్బందుల్లో పడేది. దశాబ్దాలుగా నెలకొల్పుకున్న విశ్వసనీయత, నమ్మకం కారణంగా ఆ గండం నుంచి రామోజీరావు బయటపడ్డారు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి మార్గదర్శి చిట్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ సంస్థ కూడా దశాబ్దాలుగా విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటూ పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, తమిళనాడులో కూడా వ్యాపారం చేస్తోంది. చిట్‌ పాడుకున్న వారు డబ్బు తీసుకోవాలంటే నిబంధనలు కఠినంగా ఉంటాయని తప్పితే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై మరో ఆరోపణ లేదు. అనేక చిట్‌ఫండ్‌ కంపెనీలు బోర్డు తిప్పేయడం చూశాం. ప్రైవేటుగా చిట్‌ వ్యాపారం చేసేవాళ్లు చిట్‌ డబ్బులతో పరారవడం చూస్తున్నాం, వింటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చట్టాలు తెచ్చింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఖాతాదారుల నుంచి ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. అయినా జగన్‌రెడ్డి ప్రభుత్వానికి ఈ సంస్థలో గోల్‌మాల్‌ జరుగుతున్నట్టు కనిపించింది. వెంటనే సీఐడీ అధికారులు తగదునమ్మా అంటూ కేసు నమోదు చేసి సోదాలు జరిపి కొన్ని బ్రాంచిల మేనేజర్లను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు కల్పించుకొని ఉపశమనం కలిగించాయి. రామోజీరావును, ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ను తమ ముందు విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు కూడా జారీచేశారు. మార్గదర్శిలో ఏదో జరుగుతోందని ప్రభుత్వ అధికారితో ఫిర్యాదు తీసుకొని సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడమే ఇక్కడ ప్రత్యేకత. ఖాతాదారుల ఫిర్యాదుపై ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉంటే అర్థం ఉండేది. సీఐడీ అధికారులు కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోయారు. జగన్‌ మీడియాకు మాత్రం మార్గదర్శిలో కొండచిలువ ఉన్నట్టు కనిపిస్తోంది. మార్గదర్శిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని, అరెస్టులు గట్రా వద్దని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జగన్‌రెడ్డి ప్రభుత్వం కొంతకాలం శాంతించింది. అయితే... ముఖ్యమంత్రిలోని పాలెగాడి బుర్ర మాత్రం పనిచేస్తూనే ఉంది. ఫలితమే మార్గదర్శిపై తాజాగా జరుగుతున్న దాడులు. ఈ పర్యాయం సీఐడీ(CID) అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా సోదాల్లో పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులను కూడా సోదాల్లో భాగం చేయడం జగన్‌ హీన మనస్తత్వానికి నిదర్శనం. సోదాలకు ముందు రోజు వివిధ శాఖల అధికారులందరినీ ఒక ఫంక్షన్‌ హాల్లో సమావేశపరచి మార్గదర్శిని ఎలా టార్గెట్‌ చేయాలో ఉన్నతాధికారులు వివరించారు. సోదాలు చేసే బృందాలకు ఏమేం చేయాలో వివరిస్తూ నోట్‌ కూడా అందించారు. మార్గదర్శి తప్పు చేస్తే చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. ఖాతాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా లేకపోయినా ఆ సంస్థపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం ఏమిటి? జరుగుతున్న వ్యవహారాలన్నీ పరిశీలిస్తే మార్గదర్శి చిట్‌ఫండ్‌ మూత పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఖాతాదారులను భయభ్రాంతులకు గురి చేయగలిగితే సంస్థ దానంతట అదే మూతపడుతుంది. ఇక్కడ మరో లక్ష్యం కూడా ఉంది. రామోజీ గ్రూపునకు చెందిన ‘ఈనాడు’ దినపత్రిక ఇటీవలి కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతోంది. కొన్ని ఇతర మీడియా సంస్థల వలె చెంచాగిరీ చేయడానికి ‘ఆంధ్రజ్యోతి’తో పాటు ‘ఈనాడు’ కూడా నిరాకరించడం తెలిసిందే. దీంతో మార్గదర్శిపై దాడులకు దిగారు. ‘ఆంధ్రజ్యోతి’కి అనుబంధంగా మరే వ్యాపారమూ లేనందున మా జోలికి రాలేకపోతున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మూతపడటం సాధ్యమా? ఈ సంస్థను మూయించినంత మాత్రాన రామోజీరావు ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీయగలనని జగన్‌రెడ్డి భావిస్తున్నారా?

నాడు ఏడ్పులూ... గగ్గోలు...

చంద్రబాబు(Chandrababu) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ మీడియాలో అవినీతి సొమ్ము ఉన్నందున దాన్ని స్వాధీనం చేసుకొనే ఆలోచన చేస్తున్నామని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించగానే... వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థను దెబ్బతీస్తారా? అని ఇదే జగన్‌ అండ్‌ కో గగ్గోలు పెట్టారు. మీడియాకు చెందిన మరికొన్ని గొంతులు వంతపాడాయి. అదే జగన్‌రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? మార్గదర్శి మూతపడేలా చేస్తే వేలాది మంది ఉపాధి కోల్పోరా? అయినా నాలుగైదు రాష్ర్టాలలో విస్తరించి ఉన్న ఈ సంస్థను మూయించడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సాధ్యమా? మహా అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంస్థ వ్యాపారం కొంతమేరకు దెబ్బతీయవచ్చు. మిగతా రాష్ర్టాలలో వ్యాపారం కొనసాగుతుంది కదా? మార్గదర్శి మూతపడినంత మాత్రాన రామోజీరావు(Ramoji Rao) దివాలా తీస్తారని అనుకోవడం పిచ్చితనమే అవుతుంది. రామోజీ గ్రూపు ఆర్థిక మూలాలు అంత బలహీనంగా లేవు. మార్గదర్శిని దెబ్బతీస్తే ‘ఈనాడు’ దారిలోకి వస్తుందనుకోవడం అవివేకం. అగ్నిమాపక శాఖ అధికారులను కూడా మార్గదర్శి పైకి ఉసిగొల్పడమే ఆశ్చర్యంగా ఉంది. నూటికి నూరు శాతం నిబంధనలు పాటిస్తూ ఈ దేశంలో ఎవరైనా వ్యాపారం చేసే పరిస్థితి ఉందా? అగ్నిమాపక శాఖ నిబంధనలకు అనుగుణంగా ఏ ఒక్కరైనా కార్యాలయాలను నిర్వహించగలరా? అంతెందుకు సోదాలు చేస్తున్న అధికారుల కార్యాలయాల్లో అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నారా? ప్రభుత్వానికి గుండెకాయ వంటి సచివాలయంలో ఈ నిబంధనలు పాటిస్తున్నారా? ఇంకా చెప్పుకొంటే, ఇలాంటి కేసులను విచారించే కోర్టులలో అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటిస్తున్నారా? అంతెందుకు... జగన్మోహన్‌ రెడ్డి పొరుగు రాష్ర్టాలలో నిర్మించుకున్న ప్యాలెస్‌లు ఆయా శాఖల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? జగన్‌కు చెందిన కార్యాలయాల్లో పరిస్థితి ఏమిటి? పరిశ్రమలను, వ్యాపారాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగడం పాలెగాళ్ల పాలనలోనే జరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం మారి జగన్‌రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్‌పైకి కాలుష్య నియంత్రణ అధికారులను, అగ్నిమాపక శాఖ అధికారులను ఉసిగొల్పితే ఆ సంస్థను మూయించడం కష్టమేమీ కాదుగదా? జగన్‌రెడ్డి వలె తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న చరిత్ర రామోజీరావుది కాదు. దాదాపు ఐదు దశాబ్దాల కఠోర శ్రమ ఉంది. మీడియాలో ఉండే వారిపట్ల సహజంగానే కొందరికి కోపం ఉంటుంది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడమే మీడియా సంస్థల ప్రథమ కర్తవ్యం. కాలక్రమంలో మార్పులొచ్చాయి. అధికారంలోకి వచ్చిన వాళ్లు అక్రమ సంపాదనతో సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇతర మీడియా సంస్థలు కూడా తమకు వంత పాడాలని కోరుకుంటున్నారు. పాలెగాళ్లకు అధికారం తోడవటంతో పరిస్థితులు మరింత దిగజారాయి. జగన్మోహన్‌ రెడ్డి అధికార దుర్వినియోగానికి అంతులేకుండా పోతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు(Andhra Jyoti and Eenadu Papers) ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఈ పత్రికలు దెబ్బతింటాయనుకోవడం, ఈ పత్రికలను దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీ ఉండదనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. జగన్‌రెడ్డి బటన్‌ నొక్కే కార్యక్రమం కొనసాగాలన్నా పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటు కావాలి కదా! పాలెగాళ్ల సంస్కృతిని ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారా? రామోజీరావుపై కోపం ఉన్నవారికి జగన్‌ ప్రభుత్వ చర్యలు సంతోషం కలిగిస్తూ ఉండవచ్చునుగానీ రాష్ర్టానికి ఈ ధోరణులు మంచి చేయవు. ఖాతాదారులకు లేని ఇబ్బంది ప్రభుత్వానికి ఎందుకు? అన్న ప్రశ్నకు జగన్‌ అండ్‌ కో సమాధానం చెప్పాలి. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఊహించుకొని సంస్థలను వేధించే విధానం ముమ్మాటికీ సమర్థనీయం కాదు. రాష్ట్రంలో లెక్కా పత్రం లేకుండా ఇసుకను తవ్వి అమ్ముకుంటున్నారు. ‘రూల్‌ ఆఫ్‌ లా’ ఉన్న రాష్ట్రంలో అది సాధ్యమా? చట్టం తన పని తాను చేయడంలేదు కనుక జగన్‌ది పాలెగాడి పాలన అని చెప్పాల్సి వస్తోంది.


తెలంగాణలో ‘దొరల’ పాలన

పాలెగాడిని తలపిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి విషయం కాసేపు పక్కన పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహార శైలి విషయానికి వద్దాం! కేసీఆర్‌ పోకడలను చూస్తే తెలంగాణలో ఒకప్పుడు చెలరేగిపోయిన దొరలు గుర్తుకొస్తున్నారు. ఆనాటి దొరల అరాచకాలకు వ్యతిరేకంగానే తెలంగాణలో నక్సలైట్‌ ఉద్యమం ఊపిరిపోసుకుంది. నక్సలైట్లు బలపడటంతో దొరలు తోక ముడిచారు. అనేకమందిని నక్సలైట్లు చంపేశారు. ఇంత కాలానికి ఇప్పుడు మళ్లీ తెలంగాణలో ఆనాటి పోకడలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రైవేటు వ్యవహారంగా మార్చివేశారు. దొర అనుమతి లేకుండా ప్రభుత్వ యంత్రాంగం కదలదు–మెదలదు. ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగానే గిట్టని వ్యక్తులను, మీడియా సంస్థలను కేసీఆర్‌ టార్గెట్‌ చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలకు కనీసం ఆహ్వానం కూడా పంపకూడదని అధికారులను ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన లేకి బుద్ధిని ప్రదర్శించుకున్నారు. అధికారులు కూడా దొర గడీలోని బానిసలుగా మారిపోయి కేసీఆర్‌ ఆదేశాలను తలదాల్చుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఫలానా మీడియాను అనుమతించకూడదన్న వింత పోకడలను తెలుగు రాష్ర్టాలలోనే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యక్రమాలకు హాజరు కాకుండా ఏబీఎన్‌తో పాటు మరో రెండు సంస్థలపై కొన్నేళ్లుగా నిషేధం విధించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నివాసం పరిసరాలకు కూడా ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను అనుమతించడం లేదు. ఒకప్పుడు విలేఖరుల సమావేశానికి ముఖ్యమంత్రి ఆలస్యంగా వస్తే సదరు సమావేశాలను విలేఖరులు బాయ్‌కాట్‌ చేసేవారు. అలాంటిది ఇప్పుడు పాలకులే మీడియాను నిషేధిస్తున్నారు. సోషల్‌ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో ఈ నిషేధాల వల్ల పాలకులకు ఏ ప్రయోజనమూ ఉండదు. అయినా వారు తమ వెకిలితనాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ మీడియాను రానివ్వకపోతే నానా యాగీ చేశారు. ఎవరెవరికో ఫిర్యాదులు చేశారు. కేసీఆర్‌ అధికారం కోల్పోతే ఆయన మీడియా పరిస్థితి ఏమిటి? అప్పుడు ఎవరి దగ్గర గోడు వెళ్లబోసుకుంటారు? కేసీఆర్‌ తన ఇంట్లో పేరంటానికి పిలవకపోతే తప్పు పట్టాల్సిందేమీ ఉండదు. ప్రభుత్వ కార్యక్రమాలు ఆయన ఇంట్లో జరిగే కార్యక్రమాలు కావు కదా? ఒకప్పుడు దొరలు తమకు గిట్టనివాళ్లకు తమకు పట్టున్న ప్రాంతంలో బతుకు లేకుండా చేసేవాళ్లు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తనకు జై కొట్టడం లేదన్న కారణంగా తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పోరాడిన వాళ్లకు కూడా ప్రగతిభవన్‌లో ప్రవేశం లేకుండా చేశారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోదండరామ్‌కు ఎక్కడా ప్రవేశం లేకుండా చేశారు. ‘మా రాజ్యంలో బతకాలంటే మాకు బానిసలుగా ఉండండ్రి. లేదంటే మీకు బతుకే లేకుండా చేస్తం’ అన్నట్టుగా కేసీఆర్‌, జగన్‌ల ధోరణి ఉంది. ఇలా చేయడం వల్ల లక్ష్యం నెరవేరుతుందా? కోదండరామ్‌ను కేసీఆర్‌ లొంగదీసుకోగలిగారా? ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేసినంత మాత్రాన ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను లొంగదీసుకోగలిగారా? మాకు మనుగడ లేకుండా చేయగలిగారా?


గద్దర్‌నూ అవమానించిన కేసీఆర్‌

ఇటీవల కన్నుమూసిన గద్దర్‌ విషయంలో కూడా కేసీఆర్‌ నిరంకుశంగానే వ్యవహరించారు. ప్రగతిభవన్‌ గేటు వద్ద పడిగాపులు పడినప్పటికీ ఆయనను లోపలకు అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల వద్ద కూడా గద్దర్‌కు ఇలాంటి అవమానం జరిగి ఉండదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే గద్దర్‌ మద్దతుకోసం కేసీఆర్‌ పాకులాడారు. ఆమరణ నిరాహార దీక్ష పేరిట నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌, తాను దీక్షను కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నానని, గద్దర్‌ వంటి వాళ్లు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని నన్ను స్వయంగా కోరారు. మరుసటి రోజు నేను గద్దర్‌తో మాట్లాడి నచ్చచెప్పడంతో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి దీక్ష విరమించాలని కోరడానికి ఆయన అంగీకరించారు. విలేకరుల సమావేశానికి ఏర్పాట్లు జరిగాయి. ఇంతలో ఆనాటి యుపీఏ ప్రభుత్వం నుంచి తెలంగాణకు సానుకూలంగా సంకేతాలు వచ్చాయి. కేసీఆర్‌ బిగుసుకుపోయారు. కేసీఆర్‌తో దీక్ష విరమించాలని కోరడానికి టీఆర్‌ఎస్‌ వద్ద నుంచి గద్దర్‌ వద్దకు ఎవరూ రాయబారం వెళ్లలేదు. దీంతో ‘చూసినవా రాధన్నా. కేసీఆర్‌ ఎలాంటోడో!’ అని గద్దర్‌ నాతో వాపోయారు. మానవతా దృక్పథంతో కేసీఆర్‌కు మద్దతుగా నిలవడానికి అంగీకరించిన గద్దర్‌ పట్ల తెలంగాణ ఏర్పడ్డాక ఇదే కేసీఆర్‌ ఎంత అమానవీయంగా వ్యవహరించారో మనం చూశాం. కేసీఆర్‌కూ జగన్‌రెడ్డికీ మధ్య ఒక తేడా మాత్రం ఉంది. గిట్టని మీడియాను మినహాయిస్తే ప్రతిపక్షాలకు చెందిన వ్యాపారాలు, పరిశ్రమలను కేసీఆర్‌ టార్గెట్‌ చేసుకొని వేధించడం లేదు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణలో పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ఆయనకు తెలుసు. కేసీఆర్‌కు ఉన్న ఈ మాత్రం ఇంగితం కూడా జగన్‌కు లేకుండా పోయింది. ఒక్క ఈటెల రాజేందర్‌ను మాత్రం కేసీఆర్‌ వేధించారు. గతంలో రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరుగా ఉండేవి. ప్రతిపక్షంలో ఉండే వారి వ్యాపారాలను అధికార పక్షంలో ఉన్నవారు టార్గెట్‌గా చేసుకొనేవారు కారు. క్రమంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. జగన్‌ పాలనలో పరిస్థితులు పూర్తిగా విషమించాయి. మానవ సంబంధాలు కూడా మృగ్యమయ్యాయి. స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే మనుగడ కొనసాగించలేని పరిస్థితులు సృష్టిస్తున్నారు. స్వతంత్రంగా వ్యవహరించాలనుకున్న మీడియాను తొక్కి పారేయడానికి కంకణం కట్టుకుంటున్నారు. ప్రభుత్వాలను ఎదిరించి మనుగడ సాగించలేని పరిస్థితి మీడియాకు కల్పిస్తున్నారు. దీంతో ఢిల్లీ నుంచి తెలుగు రాష్ర్టాల వరకు అనేక మీడియా సంస్థలు ఆయా ప్రభుత్వాలకు దాసోహం అంటున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కోరుకుని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశత్వం పరిఢవిల్లడం విచారకరం. భిన్నాభిప్రాయాలకు తావు ఉండకూడదు అనుకోవడాన్ని మించిన ఫాసిజం ఏముంటుంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులిరువురూ పాలెగాళ్లుగా, దొరలుగా, చివరకు హిట్లర్లుగా అవతరించబోతున్నారు. ప్రజాస్వామ్య వాసనలు గిట్టని వ్యక్తులు పాలకులు కావడం తెలుగు రాష్ర్టాలలో చోటు చేసుకున్న విషాదం!

ఆర్కే

Updated Date - 2023-08-20T05:25:15+05:30 IST