Chandrababu Arrest: చంద్రబాబు, టీడీపీ గ్రాఫ్‌ ఇలా పెరిగాయి.. తేల్చేచెప్పిన...!

ABN , First Publish Date - 2023-09-13T02:56:12+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై జాతీయ మీడియా తీవ్రంగా స్పందించింది. సీఎన్‌ఎన్‌ న్యూస్‌18

Chandrababu Arrest: చంద్రబాబు, టీడీపీ గ్రాఫ్‌ ఇలా పెరిగాయి.. తేల్చేచెప్పిన...!

  • లోకేశ్‌ పాదయాత్రకు విశేష స్పందన

  • బీజేపీ అగ్రనేతలతోనూ పెరిగిన సాన్నిహిత్యం

  • ఎన్డీయేలోని పవన్‌ సైతం బాబుకే మద్దతు

  • రాజకీయ వైరంతోనే బాబు అరెస్టు

  • విశ్లేషిస్తున్న జాతీయ న్యూస్‌ చానళ్లు

  • జాతీయంగా పెరిగిన రాజకీయ మద్దతు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై (Chandrababu Arrest) జాతీయ మీడియా తీవ్రంగా స్పందించింది. సీఎన్‌ఎన్‌ న్యూస్‌18, రిపబ్లిక్‌ టీవీ వంటి జాతీయ మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్టును తప్పుబడుతూ ప్రత్యేక కథనాలు అందించాయి. వైసీపీ, టీడీపీ మధ్య ఉన్న రాజకీయ వైరంతోనే చంద్రబాబును అరెస్టు చేశారని సీఎన్‌ఎన్‌ న్యూస్‌18 విశ్లేషించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబును అరెస్టు చేయడం అంటే వైసీపీ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని అంచనా వేసింది. గత కొంతకాలంగా చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తుండడం, నారా లోకేశ్‌ పాదయాత్రకు (Nara Lokesh) మంచి స్పందన వస్తుండడం వంటి పరిణామాల రీత్యా తెలుగు దేశం పార్టీ బలం (TDP) పెరిగిందని అధికార పార్టీ గుర్తించిందని పేర్కొంది. గత ఎన్నికల్లో భారీ తేడాతో టీడీపీ పరాజయంపాలైనా తర్వాతికాలంలో రాజకీయ పరిస్థితులు మారాయంటూ... కొద్దినెలల క్రితం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయిన విషయాన్ని గుర్తు చేసింది. ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబును బలంగా సమర్థిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై బాగానే ప్రభావం చూపనున్నదని విశ్లేషించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ విషయంలో అవినీతి జరిగిందనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలు చూపలేకపోయిందని రిపబ్లిక్‌ టీవీ పేర్కొంది.

సీమెన్స్‌ కంపెనీ నుంచి చంద్రబాబుకు ఒక్క రూపాయి అయినా అందినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొనలేదని తెలిపింది. మనీ ట్రయల్‌కు సంబంధించి ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయా అని రిపబ్లిక్‌ టీవీ ప్రశ్నించింది. కాగా, చంద్రబాబుకు జాతీయ స్థాయిలో రాజకీయ మద్దతు పెరుగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో ముందు నిలిచారు. రాజకీయ కక్ష సాధింపే చంద్రబాబు అరెస్టుకు కారణమని మమత తేల్చిచెప్పారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫారుక్‌ అబ్దుల్లా, శిరోమణి అకాళీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ డిప్యుటీ సీఎం, ఎంపీ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝా వంటి సీనియర్‌ నాయకులు.. చంద్రబాబు అరెస్టును ఖండించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో మరిన్ని పార్టీలు కూడా స్పందించే అవకాశముంది.

Updated Date - 2023-09-13T09:52:56+05:30 IST