Botsa: చంద్రబాబుకు ఆ మాటలు తగవన్న బొత్స
ABN , First Publish Date - 2023-06-19T17:22:12+05:30 IST
చంద్రబాబు వ్యాఖ్యలను బొత్స తప్పుపట్టారు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడుతున్నారా? అని అడిగారు. నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఏమైంది? అని
విజయవాడ: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర, నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. పవన్, లోకేష్ యాత్రలతో వారికి ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. వైసీపీలో ఉన్నవాళ్లంతా రౌడీలా?...గూండాలా? పవన్ ఏం మాట్లాడుతున్నారని? అని ప్రశ్నించారు. అయినా జనాలను తీసుకువచ్చి బస్సు యాత్రలు, పాదయాత్రలు చేపట్టినా విపక్షాలకు పెద్ద ప్రయోజనం ఉండదని బొత్స చెప్పుకొచ్చారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై..
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యలను బొత్స తప్పుపట్టారు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడుతున్నారా? అని అడిగారు. నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఏమైంది? అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అన్నారు. చంద్రబాబు భాష మార్చుకోవాలని హితవు పలికారు. నాలుగేళ్లుకా? వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లు ఇచ్చేది అని అడగాలి.. అంతేకాని ఒకరికి పుడితే.. ఇంకొకరి పేరు అనే పదాలు చంద్రబాబుకు తగవు అని సూచించారు. అయినా సీఎంగా ఉన్నప్పుడు ఒక్క టిడ్కో ఇల్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆది నుంచీ బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని బొత్స తెలిపారు. యాభై శాతం మహిళలకు సముచిత స్థానం ఇచ్చి నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చామని తెలిపారు. మూడు పార్టీలు కాదు.. ముప్పై పార్టీలు కలిసి వచ్చినా... వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఎంత మంది కలిసి వచ్చినా.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తారని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు తర్వాత మాత్రం.. ఎవరితో కలిసి వెళ్లాలనేది అప్పుడు ఆలోచన చేస్తామన్నారు. బాపట్ల జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థి అమర్నాథ్‌ను పెట్రోల్ పోసి కాల్చి చంపిన సంఘటన చాలా దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ఎవరూ సమర్థించరని.. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.