Nadendla Manohar: రేపటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర

ABN , First Publish Date - 2023-09-30T18:01:10+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) వల్ల ఆంధ్రప్రవేశ్‌కు ఏం మేలు జరిగిందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ Nadendla Manohar) వ్యాఖ్యానించారు.

Nadendla Manohar: రేపటి నుంచి నాలుగో విడత వారాహి యాత్ర

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) వల్ల ఆంధ్రప్రవేశ్‌కు ఏం మేలు జరిగిందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) వ్యాఖ్యానించారు. శనివారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో మనోహర్ మీడియాతో మాట్లాడుతూ...‘‘ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేలా పవన్ కళ్యాణ్ జనసేన తరపున వారాహి యాత్ర చేపట్టారు. నాలుగో విడత యాత్ర రేపటి నుంచి అవనిగడ్డ వేదికగా ప్రారంభం అవుతుంది. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు, అభిమానులు యాత్రకు తరలి రావాలి. వారాహి యాత్రకు మద్దతు పలికిన టీడీపీ నేతలకు మా ధన్యవాదాలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో అలజడి సృష్టించి, ప్రతిపక్షాల గొంతు నొక్కేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా వైసీపీ నేతల దారుణాలు చూశాం. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే.. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో మన అభిప్రాయాలను చెబుతూ పోస్టు పెట్టినా అరెస్టు చేయిస్తున్నారు. వైసీపీకి వచ్చిన మెజార్టీతో ప్రజలకు మేలు చేయకుండా, కక్ష సాధింపుకు వినియోగించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, తదనంతర పరిణామాలతో చెడు సంకేతాలు వెళ్తున్నాయి.ఏపీలో జరిగే సంఘటనలు ప్రతి ప్రజాస్వామ్య వాదులకు బాధ కలిగిస్తోంది. వచ్చే ఎన్నికలకు తప్పకుండా టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయి.

భవిష్యత్‌లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలలో కలిసి కట్టుగా పని చేయాలి. వైసీపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం సమష్టిగా పని చేయాలని కోరుతున్నాం. బటన్ నొక్కే కార్యక్రమాలు ఇంట్లో, ఆఫీసులో ఉండి చేయవచ్చు. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభల ద్వారా ప్రతిపక్ష నాయకులను విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఇంటింటికీ వెళ్లి అద్భుతాలు చేశామంటూ స్టికర్లు వేశారు. సంచులను సంకలో వేసుకుని ఇళ్ల వెంట తిరిగారు. టోపీలు ధరించి.. జగనే మా నమ్మకం అనే కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆంధ్రాకు జగన్ ఎందుకు అవసరం అని పేరు పెట్టారు. మేము అడుగుతున్నాం.. జగన్ వల్ల ఈ రాష్ట్రానికి ఏం మేలు జరిగిందీ, ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలి. గతంలో జగన్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, తన రాజకీయ లబ్ధి కోసం ప్రజల జీవితాలను నాశనం చేశారు. జగన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదు అంటూ జనసేన తరపున ప్రచారం చేస్తాం.ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు.. ఎంతమందికి జాబులిచ్చారో చెప్పాలి. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రతి సభలో జగన్ చెప్పారు. ఇప్పుడు సీపీఎస్ కాదు.. జీపీఎస్ ముద్దు అని గొప్పగా చెబుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచారు.

గతంలో అద్దెకు ఉన్నవాళ్లు కరెంటు వాడితే... ఇప్పుడు ఉన్న వాళ్లు బిల్లు కట్టాలంట. 9.61లక్షల కోట్లు ఏపీకి నేడు అప్పులు ఉన్నాయి.మరి ఈ డబ్బులు అన్నీ ఎక్కడకు వెళ్లాయో చెప్పాలి. 2.63లక్షల రూపాయలు ప్రజలకు పంపిణీ చేశామని జగన్ ప్రకటించారు. మరి మిగతా డబ్బులు ఎక్కడకు వెళ్లాయి.. రైతులకు ఎందుకు మేలు చేయలేదు. జగనన్న కాలనీల్లో ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలి.అందుకనే ఏపీకి జగన్ అవసరం లేదని మేము ఘంటాపధంగా చెబుతున్నాం. ఏపీకి రాజధాని అమరావతి అని అందరూ నిర్ణయం చేశారు.. జగన్ ఒకే అన్నారు. ఇక్కడే ఇళ్లు కట్టానని చెప్పిన జగన్.. ఇప్పుడు విశాఖపట్నంకు వెళ్లిపోతా అంటున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త కొత్త నాటకాలు ఆడుతున్నారు. అమరావతిలో రైతులు చేసిన త్యాగాలను జగన్ ఎందుకు గౌరవించలేదు. ‘‘వై డస్ నాట్ నీడ్ జగన్’’ అనే స్లోగన్ ప్రజలకు చేరాలి. పోలవరం నిర్మాణంపై సీఎం, మంత్రులు మాట్లాడరు. 45మీటర్ల పోలవరం ఎత్తును 41.5 మీట్లలకు తగ్గించినా జగన్ సంతకం చేశారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టును బొమ్మలాటగా చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది.

గంజాయి కూడా మద్యానికి పోటీగా దొరికే వస్తువు అయిపోయింది. గతంలో ఎప్పుడూ ఈవిధంగా చూడలేదు. లక్షా పది వేల కోట్ల రూపాయల మద్యం జగన్ హయాంలో అమ్మకాలు సాగాయి. సంపూర్ణ మద్య నిషేధం అన్న వ్యక్తి.. ప్రజలను మోసం చేశాడు. నేడు అనేకమంది మహిళలు తమ కుటుంబాలు వీధిన పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. మద్యం, గంజాయిలతో పేదల బతుకులు చిద్రమైపోతున్నాయి. అధికార పార్టీ నేతల అండతోనే గంజాయి రవాణా సాగుతుందనేది వాస్తవం. ప్రజల సొమ్ముతో రాజకీయ లబ్ధి కోసం జగన్ ఆడే నాటకలను నమ్మవద్దు. టోపీలు వేసుకుని వైసీపీ నేతలు మీ ముందుకు వస్తే.. వీటిపై ప్రజలు ప్రశ్నించండి. ఈ సమస్యలు, హామలపై జగన్ ఎందుకు స్పందించలేదని నిలదీయండి. ఎందుకు ఆంధ్రాకు జగన్ వద్దంటే.. నినాదంతో.. అంశాలను ప్రజలకు వివరిస్తాం. చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టిన అంశం సరైంది కాదని మన అధినేత చెప్పారు. టీడీపీ వారికి జనసేన సంఘీభావం తెలుపుతుంది.. కలిసి పోరాటాలు చేస్తాం. ఈరోజు సాయంత్రం టీడీపీ గంట మోగించే కార్యక్రమంలో జనసేన నేతలు కూడా పాల్గొనాలి. వారాహియాత్రను అన్ని విధాలా విజయవంతం చేసేలా నాయకులు పని చేయాలి’’ అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-30T18:02:27+05:30 IST