Share News

రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు పిడుగులతో వర్షాలు..

ABN , Publish Date - May 05 , 2026 | 09:13 AM

రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రెయిన్ అలర్ట్.. మూడు రోజుల పాటు పిడుగులతో వర్షాలు..
AP Telangana Rain Alert

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.


ఈ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేశారు. అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. పిడుగుపాటు ప్రమాదం ఉన్నందున ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని ప్రజలకు సూచించారు.


ఇక సోమవారం ప్రకాశం, పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి, పిడుగులు పడినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు కురుస్తుండగా, మరోవైపు వేడి కూడా కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో 43.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదవగా, అనేక మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


తెలంగాణలో కూడా అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. సోమవారం పలు జిల్లాల్లో వడగళ్ల వాన కురిసి నష్టం కలిగించింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 2 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అకాల వర్షాల కారణంగా పంటలకు నష్టం కలగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని గమనిస్తూ రైతులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం

Read Latest AP News

Updated Date - May 05 , 2026 | 09:50 AM