ఉన్నత విద్యా కమిషనరేట్‌కు అడ్మిషన్ల అధికారాలు
ABN , Publish Date - May 05 , 2026 | 06:55 AM
ఉన్నత విద్యాశాఖను పునర్ వ్యవస్థీకరించి ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకనుగుణంగా కమిషనరేట్‌కు పలు అధికారాలు అప్పగించింది.
ఉన్నత విద్యా మండలి అధికారాలు బదలాయింపు
అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖను పునర్ వ్యవస్థీకరించి ఉన్నత విద్య కమిషనరేట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకనుగుణంగా కమిషనరేట్‌కు పలు అధికారాలు అప్పగించింది. ప్రస్తుతం ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖల వద్ద ఉన్న అడ్మిషన్లు, అనుమతుల అధికారాలను కమిషనరేట్‌కు అప్పగించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం అధికారాల బదిలాయింపుపై 18 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై అన్ని ఉన్నత విద్యా కోర్సుల, డిప్లొమా కోర్సుల అడ్మిషన్లను ఉన్నత విద్యా కమిషనరేటే చేపడుతుంది. అలాగే డిగ్రీ, లా, ఇతర కోర్సులు అందించే కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులను ఈ కమిషనరేటే జారీ చేస్తుంది. బీఈడీ అడ్మిషన్లు కూడా కమిషరేట్ నుంచే జరుగుతాయి. అయితే, ప్రవేశ పరీక్ష నిర్వహణ మాత్రం ఉన్నత విద్యామండలి పరిధిలోనే ఉంటుంది. మండలి ప్రవేశ పరీక్షలను నిర్వహించాక అడ్మిషన్లను కమిషనరేట్ చేపడుతుంది.