ఎల్‌నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది 50 శాతం లోటు వర్షపాతం.!
ABN , Publish Date - May 29 , 2026 | 03:03 PM
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది దేశంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండనుందని.. దీనివల్ల నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఈ ఏడాది వర్షాకాలంపై భారత వాతావరణ శాఖ(IMD) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈసారి నైరుతి రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా సాధారణం కంటే చాలా తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం అత్యంత బలంగా మారడమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ఈ ఎల్‌నినో ముప్పు కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 50 శాతం వరకు వర్షపాత లోటు ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ విడుదల చేసిన 2026 నైరుతి రుతుపవనాల ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి. గత ఐదారు సంవత్సరాలతో పోల్చి చూస్తే ఈసారి వర్షాలు చాలా తక్కువగా ఉంటాయని, 2018 నాటి కరవు పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది రుతుపవనాలు జూన్ రెండో వారంలో సకాలంలోనే దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల జూన్, జులై నెలల్లో సాధారణ వర్షాలు కురిసినప్పటికీ.. ఆ తర్వాత వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ రుతుపవనాల లోటు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా చూపే అవకాశం ఉంది.
ఇక.. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ముప్పు పొంచి ఉంది. అలాగే దక్షిణ కోస్తాలో పాక్షికంగా వానల లోటు ఉండనుండగా.. ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగస్టు, సెప్టెంబర్లలో వర్షాలు తగ్గుతాయి కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవడం ఉత్తమమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో నీటిఎద్దడి తలెత్తకుండా ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News