పుచ్చకాయతో వంటకాలు
ABN , Publish Date - Aug 30 , 2026 | 11:22 AM
గుమ్మడికాయకి తమ్ముడు, సొరకాయకి సోదరుడు, దోసకాయకి మనవడు అవుతుంది పుచ్చకాయ.
గుమ్మడికాయకి తమ్ముడు, సొరకాయకి సోదరుడు, దోసకాయకి మనవడు అవుతుంది పుచ్చకాయ. కేవలం పండుగానే కాదు, కాయ గూరగా కూడా వండుకోవటానికి తగిన వంశ చరిత్ర దానికుంది.
రామదోస కాయ, కలింగరికాయ, కర్బూజ కాయ ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పుచ్చకాయని పిలుస్తారు. నల్లని తోలు కలిగి నవిగా ఉన్నవాటిని కరిపుచ్చకాయ అంటారు. జనం వాడుకలో అదే కరిబూజ, కర్బూజగా మారింది. దాన్ని బట్టి తరుబూజ అనటం కూడా ఉంది. లేత ఆకుపచ్చగా ఉండి, పైన తెల్లని చారలు ఉంటే దాన్ని కరలు (చారలు) పుచ్చ అంటారు. ఇదికూడా కరుబూజ అనే పదానికి కారణం కావచ్చు. కొందరు దోసకాయ ఆకారంలో ఉండే పండుని కర్బూజ అనీ, కొందరు దీన్నే కళింగ ఫలం, కాళిందఫలం అనీ అంటారు.
పుచ్చకాయ తింటే తీపి సమానంగా ఉంటుంది. లోపల కొవ్వుని పెంచే ద్రవ్యాలు లేవు, కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది కాబట్టి! పుచ్చకాయలు తినేవారికి శరీరం సన్న బడుతుందని ఒక వివరణ ఉంది. 100గ్రాముల పుచ్చముక్కల్లో 91.45ు నీరుంది. కానీ ఈ నీరు మన ఆర్ వో వాటర్ కన్నా చాలా శక్తి వంతమైనది. అందులోనే విలువైనపదార్థాలెన్నో దాగి ఉన్నాయి. అయితే పుచ్చకాయలోపలనీళ్లు మాత్రమే ఉంటాయి, పోషకాలేవీ ఉండవనేది కూడా అపోహే! ఇందులో అధికంగా ‘బి’ విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం ఎలక్ట్రోలైట్లు, దండిగా ఉన్నాయి. దీనిలోని సిట్రుల్లైన్ అనే రసాయనం ఉందని ఆధునిక వైద్యులు చెప్తున్నారు. వడదెబ్బ కొట్టకుండా, శోష రాకుండా ఇది కాపాడుతుంది. కిడ్నీలు చెడకుండా కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆలస్యంగా అరిగే స్వభావం వలన వెర్రి ఆకలిని తగ్గిస్తుంది.
పుచ్చకాయని తినటం కూడా ఒక కళే! లోపల ఎర్ర గుజ్జుని మాత్రమే తిని పైన తెల్లగా ఉండే తడప (రిండ్)ని విసిరి అవతల పారేస్తాం. పైన ఆకుపచ్చ తోలుని ఎటుతిరిగి వదిలేస్తాం. కడివెడంత పుచ్చకాయలో మనం తింటున్నది ఒక చిన్న పళ్ళెం అంత ఎర్ర గుజ్జు మాత్రమే! తక్కినదంతా వేస్టు పదార్థమే అనుకుంటున్నాం. ఎర్రగుజ్జుకీ తోలుకీ మధ్యన ఉండే తెల్లటి భాగమే ఆహారయోగ్య మైనది. దాన్ని పారేయకూడదు. కూర, పప్పు, పులుసు, పచ్చడి వీటికి ఇది అనుకూలం.
లోపలి ఎర్రగుజ్జుని పండులాగా వాడు కోవచ్చు. పైన తెల్లని కండని ముక్కలుగా తరిగి, నీళ్ళతో కడిగి తగినంత ఉప్పు వేసి నీళ్లపళ్లెం మూతబెట్టి బాగా ఉడకనియ్యాలి. ఒక భాండీలో నెయ్యి, ఇంగువ, ఆవాలు, మిన ప్పప్పు, జీలకర్ర, ఇంకా ఇతర సుగంధద్రవ్యాలు కలిపి వేగనిచ్చి ఈ ఉడికిన ముక్కలకు తాలింపు పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా వండిన పుచ్చకాయ ఇగురుకూరని పొయ్యి మీంచి దింపి, చల్లారిన తరువాత పచ్చ కర్పూరం లాంటి పరిమళ ద్రవ్యాలను కలిపి కొద్దిగా నెయ్యి వేసి మూతబెట్టి ఉంచండి. తినబోయే ముందు ఈ కూరని ఒక వస్త్రంలో మూటగట్టి, వేడివేడి నేతిలో ముంచి తీస్తే కూర కూడా వేడిగా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఈ కూరని కళింగఫల శాకం అన్నాడు నలుడు పాక దర్పణం పాక శాస్త్ర గ్రంథంలో.
పుచ్చకాయ తెల్లగుజ్జుతోనే పెరుగుపచ్చడి, సాంబారు, జామ్, హల్వా కూడా చేసుకోవచ్చు. తురిమి పాయసం కాచుకోవచ్చు. ఊరగాయ కూడా పెట్టుకోవచ్చు.
డా. జి.వి పూర్ణచందు, 94401 72642
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News