తూర్పు కనుమల్లో ‘జలమిత్రులు’
ABN , Publish Date - Aug 30 , 2026 | 10:21 AM
తూర్పు కనుమల్లో వర్షం మొదలైతే... కొండలన్నీ పచ్చటి దుప్పటి కప్పుకున్న ట్టుంటాయి. వాగులు పరుగెడుతాయి.
తూర్పు కనుమల్లో వర్షం మొదలైతే... కొండలన్నీ పచ్చటి దుప్పటి కప్పుకున్న ట్టుంటాయి. వాగులు పరుగెడుతాయి. ఆ దృశ్యం చూస్తే ఇక్కడ నీటి కొరత అనే మాటే ఉండదనిపిస్తుంది. కానీ అదే కొండల మధ్య ఉన్న రైతును అడిగితే మరో కథ చెబుతాడు. ‘‘వానలకు లోటు లేదు... కానీ రబీలో నీళ్లు లేవు’’ అంటాడు. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా వాస్తవ దృశ్యం...
ఏటా సుమారు 1,400 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదయ్యే ఈ గిరిజన ప్రాంతంలో... ఖరీఫ్‌లో మాత్రమే ఎక్కువగా సాగు జరుగు తుంది. రబీ వచ్చేసరికి కేవలం 10 శాతం భూమిలోనే పంటలు కనిపిస్తాయి. కారణం వర్షాభావం కాదు. వర్షపు నీటిని నిల్వ చేసి, పొలాలకు చేరవేసే చెక్‌డ్యామ్‌లు, కాలువలు, చిన్న రిజర్వాయర్లు కాలక్రమంలో శిథిలమవడం.
చెక్‌డ్యామ్‌లు పాడైతే...
ఒకప్పుడు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు, చిన్న కాలువలు ఈ ప్రాంత రైతులకు జీవనాడిలా పనిచేశాయి. వర్షపు నీటిని నిల్వచేసి రబీ పంటలకు ఆధారమ య్యాయి. కానీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడంతో చాలావరకు శిథిలమయ్యాయి. కాలువల చివర వరకూ నీరు చేరడం ఆగిపోయింది. దాంతో సాగు తగ్గింది. కూలీ పనులు తగ్గాయి. కొన్ని గ్రామాలు మళ్లీ వలసల బాట పట్టాయి.
‘‘మాకు వానలకు లోటులేదు. కానీ చెక్ డ్యామ్ పాడైన తర్వాత రబీలో నా మూడు ఎకరాలు ఖాళీగా ఉంటున్నాయి’’ అనిపాడేరుకు చెందిన రైతు అప్పలనాయుడు చెబుతుంటే... అదే ప్రాంతానికి చెందిన గెమ్మెల రాజు మాటల్లో బాధ మరింత స్పష్టంగాకనిపిస్తుంది. ‘‘కాలువ మొదట్లో నీళ్లు ఉంటాయి. చివరికి వచ్చేసరికి చుక్క ఉండదు. చెక్‌డ్యామ్‌లు బాగు చేస్తే మాకు ఏడాది పొడవునా పని ఉంటుంది.’’
యువత ముందుకొచ్చింది...
ఈ సమస్యను ప్రభుత్వం మాత్రమే పరిష్కరించలేదు. గ్రామ యువత కూడా భాగస్వాములు కావాలనే ఆలోచనతో వాసన్ స్వచ్ఛంద సంస్థ ఒక ఆలోచన చేసింది. స్థానిక యువతీ యువకులకు నీటి వనరులపై శిక్షణ ఇచ్చి, వారిని ‘జలమిత్రులు’గా తీర్చిదిద్దింది. ఇక వారి పని ఏమిటంటే... చెక్‌డ్యామ్‌లను గుర్తించడం మాత్రమే కాదు. పాడైన నీటి వనరులను సర్వే చేయడం, సాంకేతిక వివరాలు నమోదు చేయడం, పునరుద్ధరణకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయడం, ప్రభుత్వ యంత్రాంగానికి నివేదికలు అందించడం వరకు వారి బాధ్యత విస్తరించింది. ఈ ప్రతిపాదనకు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. పనికిరాని చెక్‌డ్యామ్‌లను గుర్తించి ప్రతిపాదనలు పంపితే, నిధుల సమీకరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సాంకేతికత తోడైంది!
ఈ కార్యక్రమం కేవలం కాగితాలపైసర్వేలతో ఆగిపోలేదు. జలమిత్రులు గ్రామాలకు వెళ్లి ప్రతీ చెక్‌డ్యామ్, కాలువ, నీటి వనరును పరిశీలించి వివరాలను (Google Earth, Open Data Kit (ODK)... వంటి డిజిటల్ సాధనాల ద్వారా నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం నేరుగా డిజిటల్ మ్యాపుల్లో చేరుతోంది. దీంతో ఏ గ్రామంలో ఏ చెక్‌డ్యామ్ మరమ్మతు అవసరమో అధికారులు సులభంగా గుర్తించగలుగుతున్నారు. ‘‘సమస్యలను డిజిటల్ రూపంలో నమోదు చేయడంతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్ట గలుగుతున్నాం. ఈ ప్రాజెక్ట్‌లో ఎస్‌విడిఎస్, లయ, జిఎసెస్, అమృత, ఆదివాసీమిత్ర, జివిఎసెసెస్ ఎన్జీఓలు పాల్గొన్నాయి’’ అని ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ప్రసాద్ చెబుతున్నారు.
ఉద్యోగం కాదు... బాధ్యత
జలమిత్రులుగా పనిచేస్తున్న యువతకు ఇది సాధారణ పని, డ్యూటీ కాదు. ‘‘వర్షపు నీటిని వృథా కాకుండా భూమి కడుపులో దాచేదే చెక్‌డ్యామ్. అవే రైతులకు ప్రాణా ధారం. వాటిని కాపాడటం మా బాధ్యతగా భావించాం’’ అంటోంది పాడేరుకు చెందిన జలమిత్ర శాలిని. మరో జలమిత్రుడు మల్లేష్ మాటల్లో సేవాభావం స్పష్టంగా వినిపిస్తుంది. ‘‘మా ప్రాంతంలో నీళ్లు లేక పంటలు ఎండిపో కూడదు. అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం’’ అంటున్నారాయన.
మార్పు మొదలైంది...
గత ఏడాది ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పటికే ఫలితాలు చూపిస్తోంది. 11 గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల పునరుద్ధరణ, 315 కుటుంబాలకు లబ్ధి, 426 ఎకరాలకు సాగునీటి సౌకర్యం, ప్రతీ గ్రామానికి అదనంగా రూ.15 లక్షల నుంచి 20 లక్షల వార్షిక ఆదాయం, ఒక్కో కుటుంబ ఆదాయం రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు పెరుగుదల ఉంది. ‘‘ఏడాది పొడవునా కూరగాయలు, పండ్లు అందుబాటులోకి రావడంతో గిరిజన కుటుంబాల పోషకాహారం మెరుగుపడుతోంది. వలసలు తగ్గుతున్నాయి. గ్రామంలోనే ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి’’ అన్నారు వాసన్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ డా. ఎం.ఎల్. సన్యాసిరావు.
చెక్‌డ్యామ్ అనేది వాగు లేదా చిన్న ప్రవాహంపై నిర్మించే చిన్న అడ్డుకట్ట. ఇది వర్షపు నీటిని కొంతసేపు నిలిపి, నెమ్మదిగా భూమిలోకి ఇంకేలా చేస్తుంది. ఫలితంగా భూగర్భ జలాలు పెరుగుతాయి. బావులు, బోర్లలో నీరు నిలుస్తుంది. రైతుకు సాగునీరు ఎక్కువకాలం అందుతుంది. నీటిని కాపాడేది కేవలం కాంక్రీట్‌తో కట్టిన చెక్‌డ్యామ్ కాదు. దానిని కాపాడే మనుషులే అసలు బలం. ఈ రోజు తూర్పు కనుమల్లో పుట్టిన ‘జలమిత్రుల’ ఉద్యమం, రేపు దేశంలోని ప్రతీ వర్షాధార ప్రాంతానికి ఆదర్శంగా మారవచ్చు. వానను ఆపలేం... కానీ వర్షపు నీటిని నిలబెట్టగలం. ఆ పనిని ఇప్పుడు మన్యం యువత తమ చేతుల్లోకి తీసుకుంది.
శ్యాంమోహన్, 94405 95858
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ ధరలు మరింత తగ్గే ఛాన్స్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News