Share News

సాహసం శ్వాసగా... సాగిపో...

ABN , Publish Date - Aug 30 , 2026 | 09:44 AM

ప్రతీ మలుపు ఒక కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. ప్రతీ కొండ ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ప్రతీ ప్రయాణం ఒక కొత్త కథను పరిచయం చేస్తుంది.

సాహసం శ్వాసగా... సాగిపో...
Best bike tour routes in India

ప్రతీ మలుపు ఒక కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. ప్రతీ కొండ ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ప్రతీ ప్రయాణం ఒక కొత్త కథను పరిచయం చేస్తుంది. విమానంలోనో, రైలులోనో వెళ్లి కొత్త ప్రదేశాల్ని చూసి రావడం మామూలే. యువతరం మాత్రం దారి వెంట ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించడంలో కలిగే అనుభూతిని పొందాలను కుంటోంది. అందుకోసం బైక్‌ ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. అయితే బైక్‌ టూర్లకు ఏ రహదారులు సరైనవి? ఏ మార్గంలో మర్చిపోలేని అనుభూతుల్ని మూటగట్టుకోవచ్చు? ఆ విశేషాల ప్రయాణమే ఇది...

బైక్‌ టూర్‌ అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం కాదు. ప్రజలతో మమేకమవుతూ, సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకుంటూ, ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిపోయే ఒక సాహస యాత్ర. సాహసోపేతంగా ఉండాలని కోరుకునేవారికి, రైడర్లకు సవాళ్లు విసిరే మార్గాలున్నాయి. అలా కాకుండా సరదాగా, ప్రశాంతంగా సాగిపోవాలనుకుంటే సులభమైన మార్గాలూ ఉన్నాయి. బైక్‌ ట్రిప్‌కు ముందుగా రూట్‌ను ప్లాన్‌ చేసుకోవడం ముఖ్యం. రూట్‌ మాత్రమే కాదు... వెళ్లే సీజన్‌, ప్రయాణించాల్సిన దూరం ఎంత? ఎన్ని రోజులు వెళుతున్నారు? ఎలాంటి దుస్తులు, పరికరాలు తీసుకెళ్లాలి? వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. హిమాలయాల నుంచి కేరళ వరకు, రాజస్థాన్‌ నుంచి పుదుచ్చేరి వరకు, గోవా నుంచి గువాహటి వరకు బైక్‌ ప్రియులకు సరిపోయే రూట్లు చాలానే ఉన్నాయి.


book4.2.jpgడ్రీమ్‌ రూట్‌

మనాలీ - లేహ్‌.... బైక్‌ ప్రయాణాలు చేసే వారికి ఒకరకంగా డ్రీమ్‌రూట్‌. ఇది సాధారణ రోడ్‌ ట్రిప్‌ కాదు. హై ఆల్టిట్యూడ్‌ అడ్వెంచర్‌ ట్రిప్‌. బైకర్స్‌కి మరిచిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. ఈ రూట్‌లో ప్రయాణం మనాలీలో ప్రారంభమై ఖర్దుంగ్‌ లా పాస్‌, రోహ్‌తంగ్‌ లా, గులాబా, దార్చా వంటి ప్రాంతాల మీదుగా సాగుతుంది. ప్యాంగాంగ్‌ లేక్‌, డెస్కిట్‌, సింధునది, నుబ్రా వ్యాలీ అందాలు చూసి తీరాల్సిందే. ఎత్తైన కొండ ప్రాంతాల్లో ప్రయాణం ఉంటుంది కాబట్టి విండ్‌ప్రూఫ్‌ జాకెట్లు ధరించాలి. జూలై నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలం బైక్‌ రైడ్‌కు అనువైనది.


భిన్నమైన అనుభూతి

లేహ్‌ కన్నా కొంచెం భిన్నమైన అనుభూతి కావాలంటే మనాలీ - స్పితీ వ్యాలీ రూట్‌ని ఎంచుకోవచ్చు. 12 రోజుల పాటు ఈ టూర్‌ ఆద్యంతం పర్వతాలు, లోయల గుండా సాగుతుంది. భారతదేశంలో మోస్ట్‌ బ్యూటీఫుల్‌ జర్నీగా ఈ రూట్‌కు గుర్తింపు ఉంది. మనాలీ నుంచి ప్రయాణం ప్రారంభమై... రోహ్‌తంగా పాస్‌, చంద్రతాల్‌ సరస్సు, కుంజుమ్‌ పాస్‌ మీదుగా కాజా చేరుకుంటారు. ఇక్కడి రోడ్లపై ప్రయాణం ఒకరకంగా సహనానికి పరీక్షనే. రాళ్లు, నీటి ప్రవాహాలు, ఇరుకైన కొండ రోడ్లు సవాళ్లు విసురుతాయి. కానీ అదే సమయంలో చుట్టూ కనిపించే పర్వతాలు, పురాతన బౌద్ధ మఠాలు, నిశ్శబ్దమైన లోయలు ఈ ప్రయాణాన్ని మరచిపోలేని ట్రిప్‌గా మారుస్తాయి. చంద్రతాల్‌ సరస్సు దగ్గర క్యాంపింగ్‌ చేయడం ఈ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఎత్తైన పర్వతాలు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు కనిపిస్తాయి. బాస్పా, కిన్నౌర్‌ ప్రాంతాల్లోని ఆపిల్‌, ఆప్రికాట్‌ తోటలు, సట్లెజ్‌ నది దృశ్యాలు, మంచుతో కప్పబడిన మఠాలు ఈ ప్రయాణాన్ని అందంగా మారుస్తాయి. ప్రయాణానికి అనువైన సమయం మే నుంచి జూలై.


book4.5.jpgఎడారి ప్రయాణం

రాజస్థాన్‌ చరిత్ర, సంస్కృతి, ఎడారి అందాలు, కోటలు, పురాతన రాజభవనాలు, రంగురంగుల పట్టణాలు చూసేందుకు జైపూర్‌ - జోధ్‌పూర్‌ - జైసల్మేర్‌ బైక్‌ టూర్‌ మంచి ఎంపిక. పింక్‌ సిటీ, బ్లూసిటీ, గోల్డెన్‌ సిటీలను చుట్టొచ్చే ట్రిప్‌ ఇది. రాజస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవనశైలిని దగ్గరగా చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో లభించే స్థానిక వంటకాల రుచిని కూడా ఆస్వాదించొచ్చు. రాజ్‌పుతానా శైలిలో నిర్మించిన కోటలు, భవనాలు దాదాపు ప్రతీ చోటా కనిపిస్తాయి. ఎడారి ప్రాంతాల్లో ప్రయాణం కొంత సవాలుగా ఉంటుంది. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్య కాలం ప్రయాణానికి అనువుగా ఉంటుంది.


మరిచిపోలేని ట్రిప్‌

అహ్మదాబాద్‌ - రణ్‌ ఆఫ్‌ కచ్‌ .... బైక్‌ ట్రిప్‌ ఆద్యంతం ఆశ్చర్యాలకు గురి చేస్తుందనే చెప్పాలి. పౌర్ణమి సమయంలో ఈ ప్రయాణాన్ని ప్లాన్‌ చేస్తే మరింత అద్భుతంగా ఉంటుంది. గ్రేట్‌ రణ్‌ ఆఫ్‌ కచ్‌లో పౌర్ణమి వెన్నెలను చూడటం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి. గుజరాత్‌లోని రద్దీగా ఉండే నగర ప్రాంతాల నుంచి బైక్‌ ట్రిప్‌ ప్రారంభమై.. ఉప్పు ఎడారితో కూడిన రణ్‌ ఆఫ్‌ కచ్‌ వరకు సాగే సరికొత్త అనుభూతి వల్ల బెస్ట్‌ ట్రిప్‌గా నిలుస్తుంది. మార్గమధ్యంలో అడవి గాడిదల శాంక్చువరీ, ధోలవీరా వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. కచ్‌ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వైవిధ్యానికి ప్రసిద్ధి. అహ్మదాబాద్‌, ధోలవీరా, మాండ్వి, భుజ్‌, కచ్‌ మొత్తం దూరం సుమారు 750 కి.మీ. కనీసం 5 రోజుల పాటు ప్రయాణం సాగుతుంది. అక్టోబర్‌ నుంచి మార్చి మధ్య కాలం ప్రయాణానికి అనువైనది.


book4.3.jpgఆకట్టుకునే ఈశాన్య భారతం

ఈశాన్య భారతంలో బైక్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేసుకునేవారికి గువాహటి - తవాంగ్‌ రూట్‌ మంచి ఆప్షన్‌. ఈ మార్గంలో పచ్చని కొండలు, లోయలు, జలపాతాలు, మేఘాలతో కప్పబడిన పర్వతాలు కనువిందు చేస్తాయి. తవాంగ్‌ వెళ్లే మార్గంలో సెలా పాస్‌ ప్రధాన ఆకర్షణ. ఎత్తైన పర్వత మార్గాల మీదుగా బైక్‌ ప్రయాణం సాహసికులకు మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. అయితే కొన్ని చోట్ల రోడ్లు సరిగా లేకపోవడం, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు మూసుకుపోవడం వంటి సమస్యలు కూడా ఎదురుకావొచ్చు. మార్గమధ్యంలో జలపాతాలు, మెట్ల పద్ధతిలో సాగు చేసే వరి పొలాలు, కొండ వాగులు, చిన్న గ్రామాలు కనిపిస్తాయి. అంతేకాదు, స్థానిక గిరిజన సంస్కృతిని దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది. ఈ మార్గంలో బొమ్డిలా, దిరాంగ్‌, తవాంగ్‌, గోర్షెమ్‌ చోర్టెన్‌, జీరో, పరశురామ్‌ కుండ్‌, నామ్‌దఫా నేషనల్‌ పార్క్‌ చూడొచ్చు. అక్టోబర్‌ నుంచి మార్చి మధ్య సమయం ప్రయాణానికి అనువైనది.


వీకెండ్‌ గేట్‌వే

పుదుచ్చేరికి బైక్‌ ప్రయాణం చెన్నై ప్రజలకు ఒక వీకెండ్‌ గేట్‌వేలా ఉంటుంది. చెన్నై నుంచి పుదుచ్చేరికి బైక్‌ రైడ్‌ ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌ మీదుగా ప్రయాణం ప్రత్యేకం. ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చని పొలాలు, మధ్యలో కనిపించే మత్స్యకారుల గ్రామాలు ప్రయాణానికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. సద్రాస్‌ డచ్‌ ఫోర్ట్‌, ఆలంపరై కోట శిథిలాలు, కల్పక్కం టౌన్‌షిప్‌, సెరినిటీ బీచ్‌, చున్నంబార్‌ బ్యాక్‌వాటర్స్‌ వంటి ప్రదేశాలు చూడదగినవి. సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాదిలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు.


book4.6.jpgఅందాల అరకు వ్యాలీ

అరకు లోయ జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి. వైజాగ్‌ నుంచి అరకు వరకు బైక్‌ ట్రిప్‌ మరిచిపోలేని అనుభూతిని పంచుతుంది. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, పచ్చని ప్రకృతి ఈ ప్రయాణాన్ని ఎంతో అందంగా మారుస్తాయి. సముద్రతీరం నుంచి కొండలు, అడవులతో కూడిన ప్రాంతం వరకు ట్రిప్‌ సాగుతుంది. ఈ రూట్‌లో బొర్రా గుహలు, గాలికొండ వ్యూ పాయింట్‌ చూసి తీరాల్సిందే. అనంతగిరి హిల్స్‌లో కాఫీ తోటలను చూడొచ్చు. టైడా మంచి వ్యూపాయింట్‌. ట్రిప్‌ విశాఖపట్నంలో ప్రారంభమై కొత్తవలస, శృంగవరపుకోట, బౌడారా, బొర్రా, అరకు వరకు సాగుతుంది. మొత్తం ప్రయాణ దూరం సుమారు 115 కి.మీ ఉంటుంది. ఏడాదిలో ఎప్పుడైనా వెళ్లవచ్చు.


అడ్వెంచర్‌ రైడ్‌

లద్ధాఖ్‌లో బైక్‌ రైడింగ్‌ ఒక డ్రీమ్‌ డెస్టినేషన్‌. ప్రకృతి అందాలతో నిండిన ఈ ప్రాంతం అడ్వెంచర్‌ ప్రియులకు ఒక పరీక్ష లాంటిది. కఠినమైన రోడ్లు, అనూహ్యమైన వాతావరణం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం వంటి సవాళ్లు రైడర్లకు ఎదురవుతుంటాయి. అయితే అందమైన సరస్సులు, ఎత్తైన పర్వత మార్గాలు, బౌద్ధ మఠాలు, వంకలు తిరిగే కొండ రహదారులు లద్ధాఖ్‌ ప్రయాణాన్ని జీవితంలో మరచిపోలేని అనుభవంగా మారుస్తాయి. జూన్‌ నుంచి అక్టోబర్‌ మధ్య వరకు ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు.


ప్రకృతిని ఆస్వాదిస్తూ...

కేరళ బ్యాక్‌ వాటర్స్‌ అందాలు చూసి తీరాల్సిందే. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ టూర్‌ కొచ్చిలో ప్రారంభమై మున్నార్‌, తేక్కడి మీదుగా అలెప్పీ వరకు సాగుతుంది. బైక్‌ ట్రిప్‌ ప్రశాంతంగా సాగిపోవాలంటే ఈ రూట్‌ని ఎంచుకోవాలి. కొండలపై విస్తరించిన టీ తోటలు, చల్లని వాతావరణం, పొగమంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలతో ఆకట్టుకునే అందమైన హిల్‌ స్టేషన్‌లతో ప్రయాణం ఆద్యంతం మధురానుభూతులను పంచుతుంది. టీ తోటలు, కొండల మధ్య ప్రశాంతంగా ఉన్న మట్టుపెట్టి డ్యామ్‌ దృశ్యాలు చూసి తీరాల్సిందే. అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్య సమయం ట్రిప్‌కు అనువైనది.


ఈ వార్తలు కూడా చదవండి:

చీరలతో ముగ్గు...నగలతో పెయింటింగ్‌...

గోల్డ్ ధరలు మరింత తగ్గే ఛాన్స్!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 09:44 AM