భార్యను చంపి, గుండెపోటుగా చిత్రీకరించిన భర్త.. సీసీటీవీ కెమెరాతో గుట్టురట్టు..
ABN , Publish Date - Aug 30 , 2026 | 07:48 AM
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆమె గుండెపోటు కారణంగా చనిపోయిందనీ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీలతో అతడి దుర్మార్గం బయటపడింది.
బెంగళూరు, ఆగస్టు 30: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఆమె గుండెపోటు కారణంగా చనిపోయిందనీ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీలతో అతడి దుర్మార్గం బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల మేరకు..
మంకి గ్రామానికి చెందిన మంగళ (27) అనే మహిళకు, ఆమె భర్త గణపతి మంజునాథ్ నాయక్‌కు మధ్య తరచూ చిన్నచిన్న విషయాలపై గొడవలు జరుగుతుండేవి. మద్యానికి బానిసైన గణపతి ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేసేవాడు. ఆగస్టు 25వ తేదీ అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ నేపథ్యంలో గణపతి భార్యపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో గదిలో నిద్రిస్తున్న మంగళపై దాడి చేశాడు. ఆమె నోరు, ముక్కు గట్టిగా నొక్కిపెట్టి మెడ పిసికి హత్య చేశాడు. కేసు తన మీదకు అనురాకుండా ఉండేందుకు నాటకానికి తెర తీశాడు.
మంగళకు హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని ఇంట్లోని తన తల్లిదండ్రులను నమ్మించాడు. ఆ తర్వాత మంగళ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. గుండె పోటు వచ్చిన మంగళను తన ఆటో రిక్షాలో ఆసుపత్రికి తరలించానని, మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ఇంటికి తీసుకువచ్చానని చెప్పాడు. అయితే, గణపతి మాటలపై అనుమానం వచ్చిన మంగళ సోదరి మంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ఇంటి పక్కన ఉన్న భవనంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. నిందితుడు గణపతి ఆ రాత్రి అసలు ఆటోను ఇంటి నుంచి బయటకు తీయలేదని తేలింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తనే భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు.
ఇవి కూడా చదవండి
మహిళల హాకీ ప్రపంచ కప్: విజేతగా అర్జెంటీనా.. షూటౌట్‌లో డచ్‌కు షాక్
జీఎస్టీ ఖాతా హ్యాక్..183 కోట్ల నకిలీ బిల్లులు!