ఆఖరి సెల్ఫీ!
ABN , Publish Date - Aug 30 , 2026 | 07:10 AM
ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలతో ఆ దంపతులు అందరితో కలివిడిగానే ఉండే వారు! భర్త రాఖీ పండగకు కుటుంబంతో సహా సొంతూరు వెళ్లి అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టిం చుకుని కానుకలిచ్చారు.
పిల్లలకు విషాహారం తినిపించి..
ఇద్దరు బిడ్డలతో సహా దంపతుల ఆత్మహత్య
వాట్సాప్ స్టేటస్‌లో ‘రిప్’ మెసేజ్‌తో కుటుంబ సెల్ఫీ
విశాఖ జిల్లాలో విషాదం.. ఆర్థిక సమస్యలే కారణం?
పెందుర్తి (విశాఖపట్నం జిల్లా), ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలతో ఆ దంపతులు అందరితో కలివిడిగానే ఉండే వారు! భర్త రాఖీ పండగకు కుటుంబంతో సహా సొంతూరు వెళ్లి అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టిం చుకుని కానుకలిచ్చారు. తిరిగి ఇంటికి వచ్చాక.. ఏంజరిగిందో ఏమో.. ఇద్దరు బిడ్డలతో కలిసి దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ తీసుకుని ‘రిప్’ అంటూ వాట్సాప్ స్టేటస్‌లో పెట్టి మరీ ప్రాణా లు తీసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో శనివారం తెల్లవా రుజామున ఈ దారుణం వెలుగుచూసింది. పెందుర్తి సీఐ కేవీ సతీశ్‌కుమార్, మృతులు బంధువుల కథనం ఇలా ఉంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మిందివలస సమీప కుమ్మరిపేటకు చెందిన మళ్ల వినోద్‌కుమార్ (30)కు, పెందుర్తి మండలం చింతల అగ్రహారానికి చెందిన అహల్య (25)కు 2019లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారైలు హితిష (3), హన్విక (ఏడాదిన్నర). వినోద్ ఆటోడ్రైవర్. ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చేశాడు. కొత్తవలసలో అప్పుల భారం అధికం కావడంతో అహల్య తండ్రి పులమరశెట్టి శ్రీను ఏడు నెలల క్రితం అల్లుడు, కూతురిని చింతల అగ్రహారం తీసుకువచ్చారు. అగ్రహారం కాలనీలో అద్దెకు ఉంటున్నారు. మామ ఆర్థిక సహకారం, ఆటో నడపగా వచ్చిన డబ్బుతో ఆనందంగానే జీవనం కొనసాగించేవారు. అహల్య కూరగాయలు విక్రయిస్తుండేది. ఈ క్రమంలో వినోద్‌కుమార్.. భార్యా పిల్లలతో రాఖీ పండగ జరుపుకొనేందుకు శుక్రవారం కొత్తవలస వెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరుకున్నారు.
కుటుంబం సెల్ఫీతో స్టేటస్
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న బంధువుల అమ్మాయి ఒకరు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.25 గంటల సమయంలో వినోద్‌కుమార్ ఫోన్ స్టేటస్‌లో ‘రిప్’ అని ఫ్యామిలీ చిత్రం ఉండడం చూసి ఆందోళన చెందింది. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. కొత్తవలసలో అతడి అన్న వెంకటేశ్వరరావు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో అతడు చింతల అగ్రహారం చేరుకుని వినోద్‌కుమార్ బావమరిది వెంకటేశ్‌తో కలిసి వినోద్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో వినోద్‌కుమార్ నైలాన్ తాడుతో ఉరి వేసుకుని, అహల్య, ఇద్దరు చిన్నారులు మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. పోలీసులకు సమాచారం అందజేడంతో వారు 108 అంబులెన్స్‌ను రప్పించి సిబ్బందితో వైద్య పరీక్షలు నిర్వహించి.. నలుగురూ మృతిచెందారని నిర్ధారించారు. ఆహార పదార్థాల్లో పురుగు మందు కలిపి, పిల్లలకు తినిపించి, తాను తిని ఉండవచ్చునని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు వినోద్‌కుమార్ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. వాయిదాలు చెల్లించాలని పలు ఫైనాన్స్ సంస్థల నుంచి వచ్చిన మెసేజ్‌లు ఉన్నాయి. ఆర్థిక సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని సీఐ తెలిపారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు