Share News

మురిపించే మినీ బైట్స్‌..!

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:11 AM

సాధారణంగా ఫంక్షన్లు, పార్టీల్లో అతిథులకు భోజనానికి ముందు చిన్న చిన్న స్ర్పింగ్‌ రోల్‌ పీసెస్‌, టిక్కా బైట్స్‌, టార్ట్‌లెట్స్‌, పేస్ట్రీ షెల్స్‌ను రకరకాల డిప్స్‌తో సర్వ్‌ చేస్తుంటారు....

మురిపించే మినీ బైట్స్‌..!

వంటిల్లు

సాధారణంగా ఫంక్షన్లు, పార్టీల్లో అతిథులకు భోజనానికి ముందు చిన్న చిన్న స్ర్పింగ్‌ రోల్‌ పీసెస్‌, టిక్కా బైట్స్‌, టార్ట్‌లెట్స్‌, పేస్ట్రీ షెల్స్‌ను రకరకాల డిప్స్‌తో సర్వ్‌ చేస్తుంటారు. వీటిని ఇష్టపడనివారుండరు. అలాంటి మినీ బైట్స్‌ను ఇంటి వద్దే స్వాదించాలనుకునేవారి కోసమే ఈ రుచులు...

మినీ చాక్లెట్‌

చిప్‌ మఫిన్స్‌

కావాల్సిన పదార్థాలు

మైదా- రెండు కప్పులు, చక్కెర- అర కప్పు, బ్రౌన్‌ షుగర్‌- రెండు చెంచాలు, బేకింగ్‌ పౌడర్‌- చెంచా, ఉప్పు- పావు చెంచా, కోడిగుడ్డు- ఒకటి, పాలు- ఒకటిన్నర కప్పులు, కరిగించిన వెన్న- అర కప్పు, వెనీలా ఎసెన్స్‌- రెండు చెంచాలు, చాక్లెట్‌ చిప్స్‌- కప్పు

తయారీ విధానం

పెద్ద గిన్నెలో మైదా, చక్కెర, బ్రౌన్‌ షుగర్‌, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో గుడ్డు సొనలు, పాలు, వెన్న, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా బీట్‌ చేయాలి. దీన్ని మైదా మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు రాకుండా కలపాలి. చివరగా చాక్లెట్‌ చిప్స్‌ వేసి మెల్లగా కలపాలి. మఫిన్‌ కప్పులకు వెన్న రాసి ఒక్కోదానిలో సగం వరకు పిండి మిశ్రమాన్ని వేయాలి. ఈ కప్పులను ఓవెన్‌లో పెట్టి 200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద పది నిమిషాలు బేక్‌ చేయాలి. తరువాత వీటిని పళ్లెంలోకి తీసి డ్రై ఫ్రూట్స్‌, తాజా పండ్ల ముక్కలతో సర్వ్‌ చేయాలి.


మినీ పిజ్జా బైట్స్‌

కావాల్సిన పదార్థాలు

మినీ పిజ్జా బేస్‌లు- ఆరు, పిజ్జా సాస్‌- ఆరు చెంచాలు, మొజారెల్లా చీజ్‌ తురుం- 12 చెంచాలు, ఆలివ్‌ ఆయిల్‌- తగినంత, క్యాప్సికమ్‌- ఒకటి, ఉల్లిపాయ- ఒకటి, టమాటా- ఒకటి, స్వీట్‌కార్న్‌- అర కప్పు, చిల్లీఫ్లేక్స్‌- మూడు చెంచాలు

తయారీ విధానం

క్యాప్సీకమ్‌, ఉల్లిపాయ, టమాటాలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెడల్పాటి పళ్లెంలో పిజ్జా బేస్‌లు ఉంచి ఒక్కోదానిపై చెంచా పిజ్జా సాస్‌ను పలుచగా రాయాలి.

తరువాత వాటిపై ముందుగా సిద్దం చేసుకున్న కూరగాయల ముక్కలు, స్వీట్‌ కార్న్‌ వేయాలి. ఒక్కోదానిపై రెండు చెంచాల మొజారెల్లా చీజ్‌ తురుం పరిచి కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ను చిలకరించాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి చెంచా ఆలివ్‌ ఆయిల్‌ రాసి ఆపైన మినీ పిజ్జాలు ఉంచి మూతపెట్టి చిన్న మంటమీద పది నిమిషాలు వేగనివ్వాలి. తరువాత వాటిని ప్లేట్‌లోకి తీసి చిల్లీఫ్లేక్స్‌ చల్లి సర్వ్‌ చేయడమే.

మినీ సెసేమ్‌

ప్రాన్స్‌ టోస్ట్‌

కావాల్సిన పదార్థాలు

బ్రెడ్‌ పీసెస్‌- నాలుగు, రొయ్యలు- పావు కేజీ, కోడిగుడ్డు- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- రెండు, అల్లం- చిన్న ముక్క, సోయాసాస్‌- చెంచా, కార్న్‌ఫ్లోర్‌- చెంచా, ఉల్లికాడల తరుగు- పావు కప్పు, మిరియాల పొడి- చెంచా, ఉప్పు- తగినంత, తెల్ల నువ్వులు- పావు కప్పు, నూనె- తగినంత

తయారీ విధానం

బ్లెండర్‌లో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లికాడల తరుగు, సోయాసాస్‌, కోడిగుడ్డు తెల్లసొన, కార్న్‌ఫ్లోర్‌, మిరియాల పొడితోపాటు శుభ్రం చేసిన రొయ్యలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. నువ్వులను దోరగా వేయించి పెట్టుకోవాలి. బ్రెడ్‌ పీసెస్‌ను త్రిభుజాకారంలో కట్‌ చేసి వాటిపై రొయ్యల పేస్టును పరచాలి. ఈ పేస్టు నువ్వులమీదికి వచ్చేలా ఉంచి బ్రెడ్‌ పీసెస్‌ను గట్టిగా నొక్కి ఆపైన పళ్లెంలో పెట్టాలి. స్టవ్‌ మీద కడాయి పెట్టి సగానికి పైగా నూనె పోసి బాగా వేడిచేయాలి. అందులో బ్రెడ్‌ పీసెస్‌ను ఒకదానితరువాత మరోదాన్ని వేస్తూ అన్నివైపులా ఎర్రగా వేయించి టిష్యూ పేపర్‌ మీదికి తీయాలి. వీటిని టమాటా సాస్‌ లేదా సోయా సాస్‌తో సర్వ్‌ చేయవచ్చు.


మినీ చిల్లీ చీజ్‌

టోస్ట్‌ పుడ్డింగ్‌

కావాల్సిన పదార్థాలు

బ్రెడ్‌ పీసెస్‌- ఆరు, పచ్చి మిర్చి- ఎనిమిది, వెల్లుల్లి రెబ్బలు- పది, వేయించిన వేరుశనగ గుండ్లు- గుప్పెడు, మొజారెల్లా చీజ్‌ తురుం- కప్పు, చెద్దార్‌ చీజ్‌ తురుం- పావు కప్పు, క్యాప్సీకమ్‌ ముక్కలు- అర కప్పు, ఫ్రెష్‌ క్రీమ్‌- అర కప్పు, కోడి గుడ్లు- రెండు, కరిగించిన వెన్న- రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, ఉప్పు- తగినంత, చిల్లీ ఫ్లేక్స్‌- మూడు చెంచాలు

తయారీ విధానం

స్టవ్‌ మీద గిన్నె పెట్టి చెంచా వెన్న, పచ్చి మిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, వేరుశనగ గుండ్లు, కొత్తిమీర తరుగు, కొద్దిగా ఉప్పు వేసి దోరగా వేయించి చల్లార్చాలి. ఆపైన మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేసి తేచా తయారుచేసి పెట్టుకోవాలి. మరోగిన్నెలో కొడిగుడ్ల సొనలు, ఫ్రెష్‌ క్రీమ్‌, ముందుగా తయారుచేసుకున్న తేచా, కొద్దిగా ఉప్పు వేసి బాగా బీట్‌ చేయాలి. బేకింగ్‌ బౌల్‌ లోపల వెన్న రాయాలి. తరువాత బ్రెడ్‌ ముక్కలు, క్యాప్సీకమ్‌ ముక్కలు, కొద్దిగా మొజారెల్లా చీజ్‌, చెద్దార్‌ చీజ్‌ వేసి కలపాలి. దీనిపైన తేచా-కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి తేలికగా కలపాలి. ఆపైన మిగిలిన మొజారెల్లా చీజ్‌ తురుం వేసి చిల్లీ ఫ్లేక్స్‌ చల్లాలి. ఈ బౌల్‌ని ఓవెన్‌లో ఉంచి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద 20 నిమిషాలపాటు బేక్‌ చేయాలి. తరువాత పళ్లెంలోకి తీసి చిన్న ముక్కలుగా కోసి సర్వ్‌ చేయాలి.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 05:11 AM