Share News

ఊరించే వరుగులు

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:02 PM

కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్‌ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది.

ఊరించే వరుగులు

కూరగాయల్ని ముక్కలుగా తరిగి ఉప్పు పట్టించి రాత్రంతా ఉంచితే ముక్కల్లోని నీరు ఆస్మాసిస్‌ ప్రక్రియలో బైటకు వచ్చేస్తుంది. నీటిని పిండేసి, ముక్కల్ని ఎండలో ఒరగబెడ్తే బాగా ఎండుతాయి. లేదా, ఉప్పు వేసిన నీళ్లలో ఉడకబెట్టి నీటిని వార్చేసి ఎండబెడతారు. ఒరగబెట్టి ఎండించినవి కాబట్టి వరుగులు. ఈ ముక్కల్ని ఎండించే మేదరి తట్టని ‘దాగర’ (ప్రసేవం) అంటారు.

వరుగులు మన వంటింటి సంస్కృతిలో ముఖ్యమైన ఆహారద్రవ్యం. ఎండు చేపలు, ఎండు మాంసం, ఎండు రొయ్యలను ఇష్టంగా తినే యూరోపియన్లు, కూరగాయలను ఎండించి తినడాన్ని ఈసడించటం నిజంగా విచిత్రమే. వరుగులు కేవలం ఎండబెట్టిన కూరగాయలు కావు, అవి ఒక కాలపు జ్ఞాపకం, ఒక రుతువుపై మనిషి సాధించిన విజయం. తాజా కూరలు చవకగా దొరికే కాలంలోనే వాటిని భవిష్యత్తు కోసం దాచుకునే తెలివి. కాలాన్ని ఆరబెట్టకుండా నిలిపిన జీవన పద్థతి.


ఇప్పటి కాలంలో ‘డీప్‌ ఫ్రీజర్‌’లో ఉంచి ఫ్రోజెన్‌ చేసి కూరగాయల్ని అన్‌ సీజన్లో వాడు కునే సౌలభ్యం వచ్చింది. కానీ, మన పూర్వులు ఉప్పులో ఊరవేసి ఎండించి నిలవబెట్టుకునేవాళ్లు. ఉమ్మడి కుటుంబాల రోజుల్లో ఆహార కొరత రాకుండా చూసుకునే వాళ్లు. ఫ్రోజెన్‌ చేయటం కన్నా వరుగుల పద్ధతిలో ఎక్కువ పరిమాణంలో నిలవబెట్టుకోవచ్చు.

ఎండబెట్టిన ఒరుగులను ఒక రేకు డబ్బాలో పోసి, మూత బిగించి, అటకమీద భద్రపరుస్తారు, ఊష్మం ఎక్కువగా ఉండి ఫంగస్‌ పట్టకుండా ఉంటాయని! ఎండబెట్టే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి, ఆమ్‌ చ్యూర్‌లా ఇతర కూరగాయల వరుగుల్ని కూడా వ్యాపార పరంగా తయారు చేసి అందించడానికి అవకాశం ఉంది.


ఎండించినందువలన కూరగాయలు నీటి భాగాన్ని, కొంతవరకూ ‘సి- విటమిన్‌’ ని కోల్పోయినా, ఖనిజాలు, ఇతర విటమిన్లూ, పీచు పదార్థాలు (ఫైబర్‌) చాలావరకు నిలిచే ఉంటాయి. చలికాలంలోనూ, వర్షాకాలంలోనూ వీటిని కొద్దిగా నూనె వేసి వేగించి వేపుడు కూరలు చేసుకుంటారు. కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి పప్పు, ఇగురు కూర, పచ్చడి కూడా చేసుకుంటారు. దప్పళం, పులుసు, సాంబారు ల్లోకి వరుగులు అనుకూలంగా ఉంటాయి. వరుగుల్ని, వడియాల్ని నూనెతో వేగించి పెట్టిన పచ్చిపులుసు రుచిగా ఉంటుంది. వరుగుల్ని మిక్సీ పట్టిన పొడితో సూపు కాచుకోవచ్చు, చారు కూడా కాచుకోవచ్చు.


వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకర, మామిడి, కామంచి, ఆదొండ, ఆగాకర, దోస, మిరప, టమాటా, ఆలు, పెండలం,కంద... వీటితో వరుగులు పెట్టుకుంటారు. ఈ వరుగులకి ఆ కూరగాయల లక్షణాలే ఉంటాయి. కాకపోతే ఆర్ద్రత (నీటి శాతం) కోల్పోయి శుష్కత్వం పొందుతాయి కాబట్టి, ఇవి శరీరాన్ని శుష్కింప చేస్తాయి. అందుకని డైటింగ్‌ చేసే వారికి అనుకూలం. శరీరంలో అదనంగా పేరుకున్న నీటిని పీల్చేసే గ్రాహి స్వభావం కలవి కాబట్టి, నీరుపట్టినవారికి వరుగులు మేలు కలిగిస్తాయి. నీళ్ళ విరేచనాల్లో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. కఫాన్ని వేడినీ పోగొడతాయి. కానీ వాతాన్ని పెంచుతాయి. కీళ్లవాత రోగులు తక్కువ తినాలి.


ఆదొండకాయ వరుగులు వేడిని కలిగిస్తాయి. కాకర వరుగులు కఫాన్ని తగ్గిస్తాయి. గజ్జల్లో ఏర్పడే హెర్నియాని తగ్గిస్తుందని భోజన కుతూహలం పేర్కొంది. నేలములక కాయల తోనూ వరుగులు పెట్టుకుంటారు. ఇవి జీర్ణశక్తిని పెంచుతాయి. ఊపిరితిత్తుల్ని శుభ్రపరుస్తాయి. వాతవ్యాధుల్లో తినదగినవి.

తక్కువ ఖరీదులో కూరగాయలు దండిగా దొరికినప్పుడు వరుగులు పెట్టుకుంటే, ఎక్కువ ఖరీదుకి కూరలు కొనాల్సిన పరిస్థితి వచ్చిన ప్పుడు వాడుకోవటానికి ఉపయోగపడతాయి. మధ్యతరగతి మందహాసానికి వరుగులు ఒక సాక్ష్యం. మిగిలిపోతున్న, వడిలిపోతున్న, పండి పోతున్న కూరగాయల్ని పాడైపోకమునుపే పారేసే పరిస్థితి రాకుండా వరుగులుగా మార్చుకోవటం అనేది మన పూర్వులు పాటించిన ఆచారం. మన కాలానికీ అవసరమైన ఉపాయమే!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


book8.2.jpgచపాతీ నూడుల్స్‌

కావలసిన పదార్థాలు: చపాతీలు - ఐదు, వెల్లులి, పచ్చి మిర్చి ముక్కలు - అర స్పూను, ఉల్లి ముక్కలు - పావు కప్పు, ఉల్లికాడలు - పావు కప్పు, క్యారెట్‌, క్యాప్సికమ్‌, క్యాబేజీ ముక్కలు - చెరో అర కప్పు, టమాటా సాస్‌ - రెండు స్పూన్లు, వెనిగర్‌ - స్పూను, సోయా సాస్‌ - స్పూను, ఉప్పు, నూనె - తగినంత.

తయారుచేసే విధానం: చపాతీలను చుట్టి తీగలు తీగలుగా వచ్చేలా కత్తెరతో కట్‌ చేయాలి. ఓ బాణలిలో కాస్త నూనె వేసి వెల్లుల్లి, పచ్చి మిర్చిని వేయించాలి. ఆ తరవాత ఉల్లి వేయాలి. క్యారెట్‌, క్యాబేజీ, క్యాబేజ్‌ కూడా జతచేసి కాస్త మగ్గే వరకు అన్నీ వేయించాలి. మంట తగ్గించి టమాటా సాస్‌, వెనిగర్‌, సోయా సాస్‌, ఉప్పు కలపాలి.ఇప్పుడు చపాతీ తీగలు, ఉల్లికాడల్నీ వేసి అంతా బాగా కలిపి స్టవ్‌ కట్టేస్తే సరి.


ఇడ్లీ పకోడా

కావలసిన పదార్థాలు: ఇడ్లీలు - ఐదు, మైదా - కప్పు, మొక్కజొన్న పిండి - పావు కప్పు, కారం - స్పూను, మిరియాల పొడి - పావు స్పూను, సోయా సాస్‌ - స్పూను, నీళ్లు, నూనె - తగినంత.

తయారుచేసే విధానం: ఇడ్లీలను ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్‌ వేసుకుని అన్నీ బాగా కలపాలి. కాస్త నీటిని జతచేసి జారు పిండిగా కలుపుకోవాలి. ఒక్కో ఇడ్లీ ముక్కని ఈ పిండిలో ముంచి నూనెలో దోరగా వేయిస్తే ఇడ్లీ పకోడా తయారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎవరికీ సబార్డినేట్‌ని కాదు

సర్వం.. కల్తీ మయం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 08 , 2026 | 12:02 PM