Share News

వంటలు: పుదీనా... శాకశోభన!

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:42 AM

పుదీనా, తులసి అక్కాచెల్లెళ్లే! పుదీనా ఘాటైన ఆకుకూర. వంటకాలకు కమ్మని వాసననిస్తుంది. పేగులకు బలాన్నిచ్చే వాటిలో తిరుగులేనిది.

వంటలు: పుదీనా... శాకశోభన!
vantalu

పుదీనా, తులసి అక్కాచెల్లెళ్లే! పుదీనా ఘాటైన ఆకుకూర. వంటకాలకు కమ్మని వాసననిస్తుంది. పేగులకు బలాన్నిచ్చే వాటిలో తిరుగులేనిది.

పుదీనా ఆకుల్లో దాదాపు 88 వంతులు నీరుంది. ఆకుల్ని నీడలో ఆరబెడితే నీరు తగ్గుతుంది. మిగిలిన 12 వంతుల్లో 4.1 గ్రాముల ప్రొటీన్లు, 0.6 గ్రాముల కొవ్వు, 2 గ్రాముల పీచు, 8 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. ఇంకా క్యాల్షియం 0.2 గ్రాములు, భాస్వరం 0.08 గ్రాములు, ఇనుము 15.6 మిల్లీ గ్రాములు ఉండటంతో పాటు ‘బి’ విటమిన్లు, ‘సి’ విటమిన్‌ వంటి పోషకాలుంటాయి. దీన్ని కూరల్లో సువాసనకు వాడటం అలవాటు. అందుకే ‘శాకశోభన’ అన్నారు. పుదీనాతో చేసుకోదగిన వంటకాలు చాలా ఉన్నాయి.


పుదీనా పచ్చడి: పుదీనా ఆకుని నూరి, మిరియాలు, అల్లం, నిమ్మరసం, ఉప్పు తగినంతగా కలిపి తాలింపు పెట్టిన పచ్చడిని రోజూ అన్నంలో మొదటి ముద్దగా తింటే నోటి అరుచి పోతుంది. అన్నహితవు కలుగుతుంది. తిన్న తర్వాత భుక్తాయాసం, అజీర్తి కలగకుండా ఉంటాయి. కఫం, వాతం తగ్గుతాయి. జ్వరం పడి లేచిన వారికి, ఆపరేషన్లు అయినవారికి గాయాలై కోలుకుంటున్నవారికి ఇదిపథ్యంగా పెట్టదగినది. జీర్ణకోశవ్యాధుల్లో మేలు చేస్తుంది. కలరా, అతిసారం, అమీబియాసిస్‌ వ్యాధుల్లో దీన్ని తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. ఎక్కిళ్లు, వాంతులు, వికారం తగ్గుతాయి. గుండెకు బలాన్నిస్తుంది. యవ్వనంలో ఉన్నవారికి మొటిమలను నివారిస్తుంది.


book7.2.jpgఅమెరికన్‌ చిమిచుర్రీ సాస్‌: తాజా పుదీనా ఆకులు, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఆలివ్‌ నూనె, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి.. వీటిని మిక్సీలో వేసి మెత్తగా గుజ్జులా చేసినదాన్ని శాకాహారం లేదా మాంసాహార పదార్థాలతో నంజుకోవటానికి వాడతారు.

సలాడుల్లో పుదీనా ఆకుల: కీరదోస,పుచ్చకాయ, క్యారెట్‌, ముల్లంగిలను ముక్కలుగా తరిగి పుదీనా ఆకులు కలుపుకుని రోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి కలుగుతుంది. చలవ చేస్తుంది. జీర్ణాశయం బలపడుతుంది.

పుదీనా పానకం: ఒక గ్లాసునీళ్లలో కొద్దిగా పంచదార వేసి వేడి చేస్తూ కరిగించి, అందులో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి పుదీనా ఆకుల తరుగుని చేర్చి ఓ గంటసేపు నాననిచ్చి ఆకులతో సహా తాగితే చలవ, తక్షణ శక్తినిస్తుంది.


టమోటా పుదీనా పెరుగుపచ్చడి: ఇంగ్లీషు కీరా లేదా కీరదోసకాయ, టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిరప.. సన్నగా తరిగి అన్నింటినీ కలిపి ఒక పాత్రలోకి తీసుకుని తగినంత పెరుగు, రెండు లవంగాలు, కొద్దిగా వాము కలిపి పైన పుదీనా ఆకుల తరుగును చేర్చిన పెరుగుపచ్చడి చాలా రుచిగా ఉంటుంది. జీర్ణాశయాన్ని బలపరుస్తుంది. వేసవి కాలానికి అనువైన ఆహార పదార్థం, ఉదయంపూట అల్పాహారంగా అనువుగా ఉంటుంది.

పుదీనా ఉసిరి జ్యూసు: ఉసిరికాయలు ఇప్పుడు అన్ని సీజన్లలోనూ మార్కెట్‌లో దొరుకుతున్నాయి. గుప్పెడన్ని పుదీనా ఆకులు, ఉసిరిగుజ్జు కలిపి జ్యూసు తీసుకుని రోజూ ఒక గ్లాసు చొప్పున తాగుతుంటే అన్ని వ్యాధుల్లోనూ హితకరం.

ఇంకా పుదీనా రైసు, పుదీనా కిచిడీ లాంటివి అందరికీ తెలిసినవే! కొత్తిమీరని వాడినట్టే అన్ని కూరల్లోనూ పుదీనాని కూడా వాడుకోవచ్చు. అల్లం, పుదీనా, నిమ్మరసం.. ఈ మూడూ కలిస్తే ఏ వంటకమైనా తేలికగా అరుగుతుంది.

  • డా. జి.వి పూర్ణచందు, 94401 72642


ఈ వార్తలు కూడా చదవండి:

గుండెలోని బాధకు ఓ టెలిఫోన్‌ బూత్‌

ఈ మ్యూజియం... అత్యుత్తమం...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 11:42 AM